జీవితంలో, తెరపైనా తనకెదురయ్యే ప్రతి సమస్యను ఓ సవాల్‌గా తీసుకుంటాను తప్ప బలహీనతగా ఎప్పటికీ మార్చుకోనని అంటోంది నటి కాజల్ అగర్వాల్. ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో వృత్తిపరంగా మీరు వదులుకోలేకపోయిన, మీకు అడ్డంకిగా అనిపించిన బలహీనతలేమైనా ఉన్నాయా? వాటి వల్ల ఇబ్బందులు పడ్డారా?అని ప్రశ్నిస్తే.. తానెప్పుడూ దేనినీ బలహీనత అనుకోనని సమాధానమిచ్చిందీ భామ.
"ఎప్పుడైనా ఓ పనిని చూసి భయపడి వదిలేయడమో.. మనకెదురైన సమస్య నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తేనో క్రమంగా అది మన బలహీనతగా మారుతుంది. నేను అలాంటి స్థితిలో ఉండాలని ఎప్పుడూ కోరుకోను. ఓ నటిగా నేనెంచుకునే ప్రతి పాత్రలోనూ నాకు సవాల్ విసిరే లక్షణాలు కొన్నయినా పక్కాగా ఉంటాయి. నేనెప్పుడూ అలాంటి ఛాలెంజింగ్ పాత్రల్ని ఎంచుకోవడానికే ఇష్టపడుతుంటా. అలా చేయగలిగినప్పుడే కదా నన్ను నేను సరికొత్తగా తెరపై ఆవిష్కరించుకోగలిగేది. ఇక ఈ ప్రయాణంలో నటిగా చిత్రీకరణలో నాకెదురైన ఇబ్బందులంటే.. చాలానే ఉన్నాయి. కానీ, నా వృత్తి జీవితంలో అవన్నీ మధుర జ్ఞాపకాలే. 'వివేగం' చిత్ర సమయంలో మైనస్ 12డిగ్రీల చలిలో చీరతో నటించా. అది నిజంగా ఏ నటికైనా కష్టమైన విషయమే. కానీ, తెరపై ఆ సన్నివేశాన్ని చూసుకున్నప్పుడు, ప్రేక్షకుల్ని ఆ కష్టం మెప్పించినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది"