తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'థియేటర్​ నుంచి నవ్వుకుంటూ బయటికొస్తారు'

సోలో బతుకు గురించి శ్లోకాలు వల్లెవేస్తున్నారు సాయితేజ్‌. సినిమాలోనే కాదు, నిజ జీవితంలోనూ తనకు సోలో లైఫే మేలు అంటున్నాడాయన. ఈ నెల 25న క్రిస్మస్‌ సందర్భంగా ఆయన నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్'​ సినిమా.. థియేటర్లలో విడుదలవుతోంది. ఈ చిత్రం విషయంలో సాయి తేజ్‌ ఎంత నమ్మకంగా ఉన్నారు? తన వ్యక్తిగత జీవితం గురించి ఆయన మనసులో మాటేమిటి? నిహారిక పెళ్లి సందడి ముచ్చట్లు తదితర విషయాలపై 'ఈటీవీ భారత్​'తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

solo brathuke so better movie hero sai tej specai interview to etv bharat
థియేటర్​ నుంచి నవ్వుకుంటూ బయటికొస్తారు:సాయితేజ్​

By

Published : Dec 16, 2020, 7:30 AM IST

Updated : Dec 16, 2020, 7:53 AM IST

ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ అంతా సాయితేజ్​ కథా నాయకుడిగా నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్‌' గురించి ఎదురు చూస్తోంది. థియేటర్లు పునః ప్రారంభమయ్యాక ప్రేక్షకుల ముందుకొస్తున్న పెద్ద సినిమా ఇది. క్రిస్​మస్​ సందర్భంగా ఈ నెల 25న ఈ సినిమా విడుదల కానుుంది. ఈ నేపథ్యంలో 'ఈటీవీ భారత్​'తో సాయితేజ్​ పంచుకున్న విశేషాలు ఇవి..

కొత్త సినిమా కబుర్లేమిటి?

దేవా కట్టా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. అందులో ఒక యువ ఐఏఎస్‌ అధికారిగా కనిపిస్తా. ఏలూరు, కొల్లేరు సరస్సు చుట్టు పక్కల ప్రాంతాల్లో చిత్రీకరణ చేయాల్సి ఉంది. సుకుమార్‌ రైటింగ్స్‌, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ కలిసి నిర్మిస్తున్న ఓ సినిమా కూడా పక్కా అయ్యింది. 1970, 80 నేపథ్యంలో సాగే కథ అది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

లాక్‌డౌన్‌ తర్వాత థియేటర్లలో విడుదలవుతున్న పెద్ద సినిమా మీదే. ఇప్పుడంతా దీని గురించే ఎదురు చూస్తున్నారు. ఉత్కంఠగా ఉందా?
మేమేమీ అసాధారణమైన పనులు చేయడం లేదు. అసాధారణమైన ఈ సమయంలో ఒక చిన్న అడుగు వేస్తున్నాం. అన్ని సినిమాలూ ఓటీటీలో చూసేవి కావు. కొన్నింటిని థియేటర్లలోనూ చూడాలి. ఒక జోక్‌ వచ్చినప్పుడు నలుగురు కలిసి నవ్వితే ఆ ఆనందం వేరు. థియేటర్‌ అనుభూతి చాలా ప్రత్యేకమైనది. ఆ అనుభూతిని పునః సృష్టించి జోష్‌ నింపడం కోసం కష్టపడుతున్నాం. నా కోసమో, నా సినిమా కోసమో కాదు, మన పరిశ్రమ కోసం చేస్తున్న ప్రయత్నమిది. సినిమా గెలవాలి, సినిమా గొప్పదని చెప్పడం కోసం థియేటర్లలోకి తీసుకొస్తున్నాం. నాకు ఉత్కంఠగా ఏమీ లేదు. సినిమాపై నమ్మకంగా ఉన్నాం. ప్రేక్షకులు మునుపటిలా థియేటర్‌ అనుభూతిని ఆస్వాదిస్తూ, నవ్వుకుంటూ బయటికొస్తారు. ప్రతి ఇంట్లోనూ జరిగే కథ ఇది. యువతరంతోపాటు, ఇంట్లో పెద్దవాళ్లూ కనెక్ట్‌ అవుతారు. నేనూ థియేటర్‌ తెరిచిన వెంటనే సినిమా చూడటానికి వెళ్లా. ఆ అనుభూతి చాలా ప్రత్యేకంగా అనిపించింది. లాక్‌డౌన్‌కి ముందు 'భీష్మ'ని థియేటర్లో చూశా. సుదీర్ఘకాలం తర్వాత ఈమధ్య 'టెనెట్‌' చూసేందుకని అడుగు పెడుతుంటే కలిగిన ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.
నిహారిక పెళ్లి వేడుకలు ముగిశాయి కదా. పెళ్లి పనుల్లో మీ పాత్ర ఏమిటి?
ఆ విషయంలో క్రెడిట్‌ అంతా వరుణ్‌కే ఇవ్వాలి. చాలా బాగా చేశాడు. అతిథుల్ని ఆహ్వానించడం, వాళ్లకి ఏర్పాట్లు చూడటంలాంటి కొన్ని పనులు చూసుకున్నాను తప్ప, ప్రత్యేకంగా మేమేం చేయలేదు. వరుణ్‌ అంతా తానై చూసుకున్నాడు. పండగలు, వేడుకల్లో కుటుంబ సభ్యులం కలుస్తుంటాం కానీ, వంద శాతం కలిసేది ఇలాంటి సందర్భాల్లోనే. అందుకే... నిహారిక పెళ్లి మా అందరికీ చాలా సంతోషాన్ని పంచింది.
మా ఇంటి సూర్యకాంతం ఇక మీ ఇంటి సూర్యకాంతం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా నిహారిక అప్పగింతలు పూర్తి చేశారు మీరు...!
నిహారిక ఎప్పుడూ హుషారుగా ఉంటుంది. ఇంట్లో సందడిగా గడుపుతూ అందరినీ సంతోషపెడుతుంది. గల గల మాట్లాడుతుంటుంది. పైగా తను 'సూర్యకాంతం' పేరుతో సినిమా చేసింది. అందుకే సూర్యకాంతం అంటూ సరదాగా ఇన్‌స్టాగ్రామ్‌లో రాశా. చైతన్య కూడా చాలా మంచోడు. వాళ్లిద్దరిదీ మంచి జోడీ.
నిహారికతో మీకున్న అనుబంధం ఎలాంటిది?
మా ఇంట్లో కజిన్స్‌ అంతా అన్నా చెల్లెళ్లులాగే పెరిగాం. చిన్నప్పట్నుంచీ నిహారికను చెల్లెలుగా ఫీల్‌ అవుతుంటా. శ్రీజ, సుస్మిత అక్క... మా అందరిదీ అక్కాతమ్ముళ్ల బంధమే. నిహారికకి చాలా వరకు మా అమ్మ పోలికలు ఉంటాయంటారు. అంతా మేనత్త పోలికే అని మాట్లాడుతుంటారు. అలా నిహారిక మా అమ్మ అన్నమాట. తనని మా అమ్మలాగే చూసుకుంటాం.
మీరు 'సోలో బ్రతుకే సో బెటర్‌' అంటూనే తోడు వెతుక్కున్నారా?
ఇంకా వెతుక్కోలేదండీ (నవ్వుతూ). మా అమ్మ సంతోషం కోసం పెళ్లి చేసుకుంటానని చెప్పానంతే. అమ్మలను బిజీగా పెట్టకపోతే వాళ్లు ఏవేవో చేస్తుంటారు కదా. పదే పదే అడుగుతుంటే... 'సరే అమ్మా...నీ ఇష్టం, పెళ్లి చేయాలనుకున్నావ్‌ కదా, చేసేయ్‌' అని చెప్పానంతే. ప్రస్తుతానికి ఒంటరి జీవితాన్నే ఆస్వాదిస్తున్నా.
మీ కుటుంబంలో తదుపరి పెళ్లి మీదేనా?
శిరీష్‌ నాకంటే పెద్ద. తను వచ్చే యేడాది పెళ్లి చేసుకుంటాడు. ఇంటి పెద్ద కొడుకుగా నా బాధ్యతలు కొన్ని ఉన్నాయి. వాటిని పూర్తి చేయాలి. పైగా పెళ్లి చేసుకోవడం కంటే నాకు సోలోగా ఉంటేనే సంతోషంగా ఉంటుంది. చిన్నప్పట్నుంచి చాలా మిస్‌ అయ్యాను. చాలా కలలున్నాయి. వాటిని నెరవేర్చుకోవాలి కదా.
కలలున్నాయి అంటున్నారు. అవేమిటి?
వ్యక్తిగత ఆశయాలు అంటాం కదా... అలాంటివే. కొన్ని డ్యాన్స్‌ ఫామ్స్‌ నేర్చుకోవాలని, కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాలని ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాలకి సంబంధించి నాకంటూ కొన్ని కలలు ఉన్నాయి. ఇలాంటివన్నీ నెరవేరాలంటే దానికి సమయం కావాలి. పెళ్లి తర్వాత బాధ్యతలు పెరుగుతాయి. వాటిని నిర్వర్తించాలంటే వ్యక్తిగతంగా చాలా పరిణితి పెరగాలి. విజయం అనే విషయంలో ఒకొక్కరికీ ఒక్కో నిర్వచనం ఉంటుంది. నేను అనుకున్నది చేరానా? లేదా? అనేది నాకే తెలుస్తుంది. బహుశా అది చేరుకున్నాక కెరీర్‌ విషయంలో నేనింకా సీరియస్‌గా ఉంటానేమో.

ఇదీ చూడండి:అభిమాని 'లీఫ్​ ఆర్ట్​'కు సోనూ సర్​ప్రైజ్​

Last Updated : Dec 16, 2020, 7:53 AM IST

ABOUT THE AUTHOR

...view details