సినీ నటులు అక్షయ్‌కుమార్, సోనూసూద్‌లకు భారతరత్న ఇవ్వాలని సామాజిక మాధ్యమాల వేదికగా సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా మహమ్మారి దేశాన్ని పట్టిపీడిస్తున్న నేపథ్యంలో సినీ తారలందరూ తమవంతు సాయం చేశారు. అయితే, బాలీవుడ్ నటులు అక్షయ్‌కుమార్, సోనూసూద్‌లు విరాళాలు ఇవ్వడమే కాకుండా ఎంతోమంది వలస కార్మికులకు దన్నుగా నిలిచారు. ప్రధాని సహాయనిధికి అక్షయ్ భారీగా రూ.25కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇక లాక్‌డౌన్ కాలంలో నటుడు సోనూసూద్ ఎంతోమంది వలస కార్మికులకు తనవంతు సాయం అందజేశారు. సొంతూళ్లకు చేరే మార్గం లేక బిక్కుబిక్కుమంటూ బతుకు వెళ్లదీసిన వారికి తన ఖర్చులతో బస్సులు ఏర్పాటు చేశారు. మరికొందరికి రైలు టికెట్లు ఇచ్చి పంపారు. ఈ నేపథ్యంలో వీరికి భారతరత్న ఇవ్వాలని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం ఊపందుకుంది.
'అక్షయ్, సోనూసూద్‌లకు భారతరత్న ఇవ్వాలి' - సోనూసూద్‌కు భారతరత్న
సినీ నటులు అక్షయ్ కుమార్, సోనూసూద్‌లకు భారతరత్న ఇవ్వాలని సామాజిక మాధ్యమాల్లో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. లాక్‌డౌన్ వేళ వారు చేస్తోన్న సేవపై ప్రశంసలు కురిపిస్తూ ఈ విధంగా పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు.
లాక్‌డౌన్ సడలించి దాదాపు నెలరోజులు పూర్తవుతున్నా, ఈ రోజుకీ సాయం చేయమని వందల కాల్స్ వస్తున్నాయని సోనూసూద్ తెలిపారు. అలాంటి వారందరికీ కాదనకుండా సాయం చేస్తున్నట్లు వెల్లడించారు. గతవారం కూడా ఉత్తరాఖండ్ వెళ్లేందుకు 2వేల మందికి, బిహార్ చేరేందుకు 2,400మందికి సాయం చేసినట్లు పేర్కొన్నారు.
"ఇప్పటికీ చాలామంది తమ సొంతూళ్లకు వెళ్లేందుకు అవకాశం లభించడం లేదు. ఎందుకంటే మహారాష్ట్రలో లాక్‌డౌన్ ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. వారంతా ఇరుకు గదుల్లో దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. చిన్న గదుల్లో 8-10మంది ఉంటున్నారు. లాక్‌డౌన్ పూర్తిగా సడలించిన తర్వాత సొంతూరికి వెళ్లిపోవాలనుకుంటున్నారు. చాలామందికి చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పటికీ మా హెల్ప్‌లైన్ నంబర్లకు రోజూ వందల సంఖ్యలో కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ముంబయిలో ఆంక్షలు సడలించరని అర్థమవడం వల్ల తమను సొంతూళ్లకు పంపాలని కోరుతున్నారు. రైల్వేస్టేషన్, బస్టాండ్‌లకు వెళ్లి వాళ్లను కలిసినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటోంది. నాకు లభించిన అవకాశంతో నా జీవితంలో ఒక మంచి పని చేస్తున్నా. ఇది నా జీవితంలో ఒక అరుదైన దశ. దీన్ని మాటల్లో వర్ణించలేను" అని సోనూసూద్ తన సంతోషాన్ని పంచుకున్నారు.