లాక్‌డౌన్ కారణంగా సొంతింటికి చేరాలనుకునే వలస కూలీలకు తనవంతు సాయం చేస్తోన్న ఓ బాలీవుడ్ నటుడ్ని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రశంసించారు. మిమ్మల్ని చూసి ఎంతో గర్వపడుతున్నా అని పేర్కొన్నారు.
మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా: స్మృతి ఇరానీ - మిమ్మల్ని చూసి గర్వపడుతున్న: స్మృతి ఇరాన
లాక్‌డౌన్ కారణంగా ఇంటికి చేరేందుకు ఇబ్బందిపడుతోన్న కూలీలకు తనవంతు సాయం చేస్తున్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. ఈ నేపథ్యంలో ఆయనపై ప్రశంసలు కురిపించారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.
సొంత గ్రామానికి వెళ్లేందుకు వలస కూలీలు పడుతోన్న వెతలు చూసి చలించిన సోనూసూద్.. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ ప్రాంతాలకు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటుచేసి వారికి అండగా నిలుస్తున్నారు. అయితే ఇటీవల ఓ వ్యక్తి ట్విట్టర్ వేదికగా సోనూసూద్‌ను ట్యాగ్ చేస్తూ.. "సర్ దయచేసి నాకు సాయం చేయండి. మీరు ఏదైనా వాహనాన్ని ఏర్పాటు చేసి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఏ ప్రాంతానికైనా పంపించండి. అక్కడి నుంచి నడుచుకుంటూ మా ఊరికి వెళ్లిపోతాను" అని ట్వీట్ చేశాడు.
ఆ ట్వీట్‌పై స్పందించిన సోను.. "నడుచుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఏముంది. మీ ఫోన్ నంబర్ పంపించండి" అని రిప్లై ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా స్మృతి ఇరానీ ట్విట్టర్ వేదికగా సోనూసూద్‌ను ప్రశంసించారు. "వృత్తిపరంగా రెండు దశాబ్దాల నుంచి మీ గురించి నాకు తెలుసు సోనూసూద్. మీరు గొప్ప నటుడిగా ఎదగడం చూసి ఎంతో సంతోషించాను. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో మీరు చేస్తున్న సాయం ఇప్పటికీ నన్ను గర్వపడేలా చేస్తోంది. మీవంతు సాయం చేసి ఎంతోమందికి అండగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు" అని అన్నారు.