హీరోయిన్ ఆలియాభట్ ప్రధాన పాత్రలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా 'గంగూబాయ్ కతియావాడి'. హుస్సేన్ జైదీ రచించిన 'మాఫీయా క్వీన్స్ ఆఫ్ ముంబయి'లోని 'మేడమ్ ఆఫ్ కామతిపుర' ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి కామతిపుర నివాసుల నుంచి అడ్డంకులను ఎదుర్కొంటూనే ఉంది. కామతిపుర దేశంలోనే రెండో రెడ్ లైట్ ఏరియాగా పేరు గాంచింది!.
ఇటీవల ఫిబ్రవరి 24వ తేదీన ఈ చిత్ర టీజర్ విడుదలైంది. దీంతో మరోసారి కామతిపుర నివాసులు.. సినిమాపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. తమ ప్రాంతానికి ఉన్న 200ఏళ్ల వాస్తవ చరిత్రను ఈ సినిమా ద్వారా కించపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ చిత్రం.. వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తుందని వాపోయారు.
కామతిపుర(రెడ్ లైట్ ఏరియా)కు ఉన్న పేరు ఇప్పుడిప్పుడే తొలిగిపోతుందని.. కానీ ఇప్పుడీ సినిమా ద్వారా మళ్లీ వెలుగులోకి వస్తుందని అన్నారు. దీనివల్ల ప్రస్తుత, భవిష్యత్ తరాలపై ప్రభావం పడే అవకాశముందని వెల్లడించారు. ఈ సినిమాను నిలిపివేయాలంటూ నిరసనలు తెలపడానికి ఆ ప్రాంత నివాసులు సిద్ధమవుతున్నారని తెలిసింది.