బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కొత్త చిత్రం 'గంగుబాయ్ కతియావాడి'కి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఈ సినిమా నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ గంగూబాయ్ కుమారుడు బాబూజీ రావ్జీ షా.. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చిత్ర దర్శకుడు భన్సాలీ సహా హీరోయిన్ ఆలియా భట్, రచయిత హుస్సేన్ జైదీ, పాత్రికేయుడు జేన్ బోర్గెస్లపై ఈ నెల 20న ఆయన కేసు పెట్టారు.
అసలేంటి ఈ వివాదం..
పాత్రికేయుడు జేన్ బోర్గెస్ సహకారంతో హుస్సేన్ జైదీ రాసిన 'ది మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబయి' పుస్తకం ఆధారంగా ఈ సినిమాను భన్సాలీ రూపొందిస్తున్నారు. అనుకోని పరిస్థితుల్లో చిన్నవయసులోనే వేశ్యగా మారిన గంగూబాయి.. తర్వాత ముంబయి మాఫియా క్వీన్‌గా ఎలా ఎదిగిందో ఈ పుస్తకంలో రచయిత వివరించారు. అయితే.. ఈ పుస్తకం తమకు పరువునష్టం కలిగిస్తోందని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు బాబూజీ. తమ గోప్యత, ఆత్మగౌరవం, స్వేచ్ఛలకు భంగం కలిగించేలా ఉందని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పుస్తకంలోని గంగూబాయి అధ్యాయాల్ని తొలగించాలని, భన్సాలీ సినిమాను నిలిపివేయాలని పిటిషన్లో కోరారు. ఈ అభ్యర్థనపై డిసెంబర్ 22న బొంబాయి సివిల్ కోర్టు విచారణ చేపట్టింది. దీనిపై జనవరి 7లోపు వివరణ ఇవ్వాలని ప్రతివాదులకు గడువునిచ్చింది.
'గంగూబాయ్ కతియావాడి'లో ఆలియా భట్, గంగూబాయ్ (పాత చిత్రం)
అయితే.. భన్సాలీ చిత్రాలు సమస్యల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. అంతకు మందు ఆయన తీసిన పద్మావత్‌ను నిలిపివేయాలని పెద్దఎత్తున నిరసనలు వినిపించాయి. హరియాణా, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో ఈ సినిమా విడుదల కాలేదు.
ఇదీ చూడండి:నెట్‌ఫ్లిక్స్ కోసం భన్సాలీ కొత్త ప్రాజెక్టు!