పాత్ర ఏదైనా, కథ ఎలాంటిదైనా అందులో ఒదిగిపోయి.. నూటికి నూరుశాతం తన నిబద్ధతను చాటే అతి కొద్దిమంది నటుల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. తండ్రి నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. యువ కథానాయకులకు దీటుగా సినిమాలు చేస్తున్నారు. ఆయన తొడగొడితే రికార్డులు, మీసం తిప్పితే రివార్డులు. జూన్ 10వ తేదీతో ఆయన 60వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ జీవితంలో అటు వ్యక్తిగతంగా, ఇటు సినీ కెరీర్ పరంగా 60 విశేషాలు మీకోసం..
1. పద్నాలుగేళ్ల వయసులో తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన 'తాతమ్మ కల' చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు.
2. బాల్యమంతా హైదరాబాద్‌లోనే గడిచింది. నిజాం కాలేజ్‌లో డిగ్రీ చదివారు.
3. ఇంటర్మీడియెట్ తర్వాత నటుడు అయిపోదామని అనుకున్నారు. కానీ, కనీసం డిగ్రీ అయినా ఉండాలన్న ఎన్టీఆర్ కోరిక మేరకు బీఏ చదివారు.
4. తొలినాళ్లలో సహాయ నటుడిగా వివిధ సినిమాల్లో నటించారు. వాటిలో తన తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి నటించిన చిత్రాలే ఎక్కువ.
5. కథానాయకుడు కాకముందు బాలకృష్ణ నటించిన 'తాతమ్మ కల', 'దాన వీర శూర కర్ణ', 'అక్బర్ సలీమ్ అనార్కలీ', 'శ్రీమద్విరాట్‌పర్వం', 'శ్రీ తిరుపతి వేంకటేశ్వర కల్యాణం' చిత్రాలకు ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు.
6. కథానాయకుడిగా మారిన తర్వాత ఎన్టీఆర్ దర్శకత్వంలో 'శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర' చిత్రంలో బాలయ్య నటించారు.
7. బాలకృష్ణ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమైన చిత్రం 'సాహసమే జీవితం'. 1984 జూన్ 1న విడుదలైన ఈ చిత్రానికి భారతి-వాసు దర్శకత్వం వహించారు. విజి కథానాయికగా నటించారు.
8. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ అత్యధికంగా 11 సినిమాల్లో నటించారు.
9. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఏడు, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆరు సినిమాల్లో నటించారు.
10. 1987లో అత్యధికంగా బాలకృష్ణ 8 చిత్రాల్లో నటించారు. 'అపూర్వ సోదరులు', 'భార్గవ రాముడు', 'రాము', 'అల్లరి కృష్ణయ్య', 'సాహస సామ్రాట్', 'ప్రెసిడెంట్‌గారి అబ్బాయి', 'మువ్వ గోపాలుడు', 'భానుమతిగారి మొగుడు' చిత్రాలు ఈ ఏడాదిలో విడుదలయ్యాయి.
11. సొంతపేరుతో బాలకృష్ణ ఏడు సినిమాల్లో నటించారు. తొలి చిత్రం 'తాతమ్మ కల'లో ఆయన పేరు కూడా బాలకృష్ణనే. ఆ సమయంలో బాలకృష్ణ తొమ్మిదో తరగతి చదివేవారు.
12. బాలకృష్ణ 25వ చిత్రం 'నిప్పులాంటి మనిషి'. ఎస్.బి.చక్రవర్తి దర్శకుడు. 50వ చిత్రం 'నారీ నారీ నడుమ మురారి'కి ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఇక 75వ చిత్రం 'క్రిష్ణబాబు'కు ముత్యాల సుబ్బయ్య దర్శకుడు. 100వ చిత్రం 'గౌతమీపుత్రశాతకర్ణి'కు క్రిష్ దర్శకత్వం వహించారు.
13. ఎన్టీఆర్ నటించిన 'యమగోల' చిత్రాన్ని బాలకృష్ణతో తీయాలనుకున్నారు. ఎన్టీఆర్ యముడిగా, బాలకృష్ణ హీరోగా చేస్తే బాగుంటుందని అనుకున్నారు. కానీ, కుదరలేదు.
14. బాలకృష్ణ నటించిన జానపద చిత్రం 'భైరవ ద్వీపం'. రోజా కథానాయిక. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు.
15. 'భైరవద్వీపం' విడుదలయ్యే వరకూ ఇందులో ఆయనే కురూపి వేషం వేశారన్న విషయాన్ని దాచిపెట్టారు. ఆ మేకప్ వేసుకోవడానికి తీయడానికి రెండేసి గంటలు సమయం పట్టేది.
16. 'ఇన్‌స్పెక్టర్ ప్రతాప్', 'తిరగబడ్డ తెలుగు బిడ్డ', 'రౌడీ ఇన్‌స్పెక్టర్', 'లక్ష్మీ నరసింహా', 'అల్లరి పిడుగు', 'చెన్నకేశవరెడ్డి' తదితర చిత్రాల్లో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు.
17. ఏఎన్నార్‌తో కలిసి రెండు సినిమాల్లో నటించారు. ఒకటి 'భార్యాభర్తల బంధం' కాగా, మరొకటి 'గాండీవం'.
18. బాలకృష్ణ నటించిన 'నిప్పు రవ్వ', 'బంగారు బుల్లోడు' ఒకే రోజున విడుదలయ్యాయి.
19. బాలకృష్ణ మొత్తం 15 చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు. 'అధినాయకుడు'లో ట్రిపుల్‌రోల్ పోషించారు.
20. బాలకృష్ణ అతిథి పాత్రలో నటించిన ఏకైక చిత్రం 'త్రిమూర్తులు'.
21. బాలకృష్ణ నటించిన 35 చిత్రాలకు పరుచూరి బ్రదర్స్ ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పనిచేశారు.
22. బాలకృష్ణ కోసం పరుచూరి బ్రదర్స్ రాసిన కథతో 'అల్లరి కృష్ణయ్య' కథ క్లాష్ అయింది. దీంతో పరుచూరి బ్రదర్స్ 'ప్రెసిడెంట్‌గారి అబ్బాయి' కథ రాశారు. తొలుత ఈ సినిమాకు భానుప్రియను అనుకున్నారు. కానీ, సుహాసిని నటించారు.
23. సినిమా ఆడదని తెలిసినా, తండ్రి మాటకు గౌరవం ఇచ్చి నటించిన చిత్రం 'తిరగబడ్డ తెలుగు బిడ్డ'.
24. 'లారీ డ్రైవర్' కన్నా ముందు పరుచూరి బ్రదర్స్ ఒక కథ చెప్పారు. అది బి.గోపాల్‌కు నచ్చలేదు. అప్పుడు పుష్పానంద్ చెప్పిన లైన్ ఆధారంగా 'లారీ డ్రైవర్'గా తీర్చిదిద్దారు.
25. బాలకృష్ణ డైలాగ్ బాడీ లాంగ్వేజ్‌తో పాటు, డైలాగ్ లాంగ్వేజ్ మార్చిన చిత్రం 'రౌడీ ఇన్‌స్పెక్టర్'.
26. ఈ సినిమా కోసం బాలకృష్ణ రోజూ పోలీస్ జీపులోనే షూటింగ్‌కు వచ్చేవారట.
27. 'సమర సింహారెడ్డి' చిత్రానికి తొలుత 'సమర సింహం' అని పెడదామనుకున్నారు. కానీ, చివరకు ప్రస్తుతం ఉన్న టైటిల్ అయితేనే బాగుంటుందని ఖరారు చేశారు.
28. 'నరసింహనాయుడు'లో కంటిచూపుతో చంపేస్తా డైలాగ్ మొదట లేదు. షూటింగ్ చివరి రోజున పరుచూరి గోపాలకృష్ణ రాశారు.
29. 'నరసింహనాయుడు' సినిమాను దేవి థియేటర్‌లో చూసిన దర్శకుడు బి.గోపాల్, రచయిత పరుచూరి గోపాలకృష్ణకు గేటు బయటకు రావడానికి గంటా ఏడు నిమిషాలు పట్టింది.
30. బాలకృష్ణ సెట్‌కు రాగానే తోటి నటీనటులను, సాంకేతిక బృందానికి అందరినీ విష్ చేసి షాట్‌కు వెళ్లిపోతారు.