తెలంగాణ

telangana

ETV Bharat / sitara

​బాక్సాఫీసుపై 'సిక్స్​ప్యాక్'​తో మన హీరోల పోరు - సిక్స్​ప్యాక్​తో రానున్న మన హీరోలు

ఉక్కుదేహాలతో ప్రత్యర్థుల్ని మట్టికరిపించేందుకు మన టాలీవుడ్​ కథానాయకులు సిద్ధమైపోతున్నారు. మరి ఏ సినిమాతో ఏ హీరో తన కండలు తిరిగిన దేహాన్ని చూపించి ప్రేక్షకుల్ని అలరించనున్నాడో తెలుసుకుందాం.

sixpack
సిక్స్​ప్యాక్​

By

Published : Jun 9, 2020, 6:47 AM IST

విలన్‌ను గట్టిగా ఒక్కటి కొట్టాక... హీరో చేయి బిగుసుకొని బైసప్‌ కండలు షర్ట్‌లోంచి బయటికి వస్తుంటే ప్రేక్షకుడు ఈల వేయకుండా ఉంటాడా? సముద్రం ఒడ్డున హీరోయిన్‌తో పాటేసుకుంటూ... షర్ట్‌ విప్పేసిన కథానాయకుడు సిక్స్‌ప్యాక్‌తో నడిచొస్తుంటే అభిమానుల కళ్లకు పండగ కాక ఇంకేమిటి? ‘కండ గలిగితే... మాసోయ్‌.. మాసైతేనే బ్లాక్‌బస్టరోయ్‌...' అంటూ కండలు తిరిగిన దేహాలతో వెండితెరపై సందడి చేసేందుకు పలువురు కథానాయకులు సిద్ధమయ్యారు.

"ఆరడుగుల ఎత్తు.. కండలు తిరిగిన దేహం.. మెరుపు వేగంతో ఒంటి చేత్తో ప్రత్యర్థుల్ని మట్టి కరిపించగల సత్తా" - ఒకప్పుడు ఈ మాటలు వినపడగానే సినీప్రియుల మదిలో మెదిలేది ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగ్గర్‌, సిల్వస్టర్‌ స్టాలోన్‌ లాంటి ఉక్కు దేహాల కథానాయకులే. ఇప్పుడు వీరికి ఏ మాత్రం తీసిపోని రీతిలో సిక్స్‌ ప్యాక్‌ లుక్స్‌తో వెండితెరపై దుమ్ములేపుతున్నారు టాలీవుడ్‌ కుర్ర హీరోలు. నిజానికి తెలుగు తెరపై ఈ ట్రెండ్‌కు 'దేశముదురు'తోనే నాంది పలికారు దర్శకుడు పూరి జగన్నాథ్‌. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో నటించిన ప్రభాస్‌, ఎన్టీఆర్‌, గోపీచంద్‌, కల్యాణ్‌రామ్‌, రామ్‌ తదితర కథానాయకుల్నీ ఆయన సిక్స్‌ ప్యాక్‌ దేహాలతో చూపించి ప్రేక్షకులకు అదిరిపోయే కిక్‌ నిచ్చారు. ఇప్పుడు తన తాజా చిత్రంలోనూ ఇదే మ్యాజిక్‌ను చేయబోతున్నారు పూరి. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంతో రూపొందుతోన్న పక్కా యాక్షన్‌ కథ కావడంతో పాత్రకు తగ్గట్లుగా విజయ్‌ను సిక్స్‌ప్యాక్‌ లుక్‌లో చూపించబోతున్నారు పూరి.

ఉక్కుదేహాలతో ఎన్టీఆర్‌... చరణ్‌

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు గతంలోనే కండలు తిరిగిన దేహంతో వెండితెరపై విలన్స్‌తో చెడుగుడు ఆడుకున్న వాళ్లే. తారక్‌ 'టెంపర్‌', 'అరవింద సమేత' చిత్రాల కోసం కండలు పెంచగా.. చరణ్‌ 'ధ్రువ', 'వినయ విధేయ రామ' చిత్రాల్లో సిక్స్‌ప్యాక్‌తో అలరించారు. ఇప్పుడీ ఇద్దరూ కలిసి నటిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'లోనూ ఉక్కు దేహాలు కలిగిన హాలీవుడ్‌ కథానాయకుల్లాగే దర్శనమివ్వబోతున్నారు. స్వాతంత్య్ర వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ల జీవితాల ఆధారంగా అల్లుకున్న ఓ ఫిక్షనల్‌ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు రాజమౌళి. అందుకే ఆ పాత్రల ధీరత్వాన్ని గొప్పగా ఆవిష్కరించేందుకు ఈ పాత్రల్లో నటిస్తోన్న చరణ్‌, తారక్‌లను అదిరేలుక్‌లోకి మార్చేశారు జక్కన్న. ఆయన ఇప్పటికే అల్లూరిగా చెర్రి రూపాన్ని టీజర్‌ ద్వారా చూపెట్టారు. ఎన్టీఆర్‌ సిక్స్‌ప్యాక్‌తో ఉన్న చిత్రాన్ని ఆయన వ్యక్తిగత ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ ఇటీవలే ట్విటర్‌లో పంచుకున్నారు.

ఎన్టీఆర్​, రామ్​చరణ్​

కుర్రహీరోలూ సై

మంచి యాక్షన్‌ కథ దొరికితే కండలు తిరిగిన దేహంతో హీరోయిజం చూపించాలని ఉవ్విళూరుతున్న వారిలో పలువురు కుర్ర హీరోలూ ఉన్నారు. ఈ జాబితాలో సుధీర్‌బాబు, కార్తికేయ ముందు వరసలో ఉంటున్నారు. వీరి నుంచి రాబోతున్న కొత్త చిత్రాలు 'వి', 'చావు కబురు చల్లగా' సినిమాల్లోనూ కండలు తిరిగిన దేహాలతో సిద్ధం అవుతున్నారు. 'వి'లో పోలీస్‌ అధికారిగా సిక్స్‌ ప్యాక్‌ దేహంతో ఉన్న సుధీర్‌ ఫస్ట్‌లుక్‌ను ఇటీవలే విడుదల చేసి అందరిలోనూ అంచనాలను పెంచేశారు. కార్తికేయ తన సిక్స్‌ప్యాక్‌ చూపిస్తూ పోస్ట్‌ చేసిన ఫొటో బాగుందంటూ ఇటీవల చిరంజీవి ప్రశంసించారు. నిఖిల్‌ 'కార్తికేయ2' కోసం సిక్స్‌ప్యాక్‌ను ప్రయత్నిస్తున్నారు. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్‌ నేపథ్యలో వస్తోన్న చిత్రం కోసం వరుణ్‌తేజ్‌, హాకీ నేపథ్యంతో తెరకెక్కుతోన్న 'ఏ1 ఎక్స్‌ప్రెస్‌' కోసం సందీప్‌ కిషన్‌ కండలు తిరిగిన దేహాలతో అలరించడానికి కసరత్తులు చేస్తున్నారు.

సుధీర్​, సందీప్​
నిఖిల్​, కార్తీకేయ

ఇది చూడండి : ఆ అలవాటును తగ్గించే ప్రయత్నంలో కుల్దీప్

ABOUT THE AUTHOR

...view details