"కమర్షియల్ కథలే చేయాలని లక్ష్యాలేం పెట్టుకోలేదు. ఆ పంథా నుంచి బయటకొచ్చి అర్థవంతమైన సినిమాలు చేయాలనుకుంటున్నా" అన్నారు శివ కందుకూరి. 'చూసి చూడంగానే' సినిమాతో చిత్రసీమకు పరిచయమైన కొత్త హీరో ఆయన. ఇటీవలే 'గమనం' చిత్రంతో పలకరించారు. ప్రస్తుతం 'మను చరిత్ర'తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. శుక్రవారం శివ పుట్టినరోజు. ఈ నేపథ్యంలోనే ఆయన గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.
"కాస్త నెమ్మదిగా చేసినా.. అర్థవంతమైన చిత్రాలే చేయాలన్నది నేను నమ్మే సూత్రం. నేనొక సినిమా చేయాలంటే కథ.. అందులో నా పాత్ర శక్తిమంతంగా ఉన్నాయో లేదో చూసుకుంటాను. అలాంటి కథలే ఎంపిక చేసుకుంటున్నా. 'గమనం' అలా చేసిందే. ఈ సినిమా వల్ల కెరీర్ ఆరంభంలోనే చారు హాసన్, ఇళయరాజా, విఎస్ జ్ఞానశేఖర్ వంటి ప్రముఖులతో కలిసి పని చేసే అవకాశం దొరికింది. సెట్స్‌లో నేను వాళ్ల నుంచి ఎన్నో విలువైన విషయాలు నేర్చుకున్నాను".