తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సినిమాలు తీయడం కంటే ఇంట్లో కూర్చోవడమే నయం' - రవిబాబు కొత్త సినిమా అప్​డేట్​

ప్రభుత్వ నిబంధనలను అనుసరించి సినిమాలు తెరకెక్కించాలంటే చాలా కష్టమని అంటున్నారు దర్శకుడు, నటుడు రవిబాబు. కరోనా కారణంగా.. రొమాంటిక్​తో పాటు ఫ్యామిలీ డ్రామా చిత్రాలను రూపొందించడం చాలా కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. ఆయన దర్శకత్వం వహించిన క్రష్​ చిత్రీకరణ దాదాపుగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రవిబాబుతో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ.

Sitting at home is better than making movies: Ravi Babu
'సినిమాలు తీయడం కంటే ఇంట్లో కూర్చోడం నయం'

By

Published : Jun 30, 2020, 8:21 AM IST

షూటింగ్‌ ప్రారంభించాలా? వద్దా? అని సినీపరిశ్రమ సందిగ్ధంలో ఉంటే... ఆయన ఏకంగా చిత్రీకరణే మొదలుపెట్టేశారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ 'క్రష్‌' చిత్రంలోని సన్నివేశాలు తెరకెక్కించి... చకచకా సినిమా నిర్మాణ పనులు పూర్తి చేస్తున్నారు దర్శకుడు రవిబాబు. నిబంధనలకు లోబడి 'క్రష్‌'ని తెరకెక్కిస్తున్న తీరు, అందులోని సాధకబాధలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు.

క్రష్​ సినిమా పోస్టర్​

లాక్‌డౌన్‌ ఏం నేర్పించింది?

నాకు ఓపిక చాలా తక్కువ. ఏ పనైనా సరే చాలా వేగంగా పూర్తి చేయాలనుకుంటా. చొక్కా వేసుకునేటప్పుడే తర్వాత చేయబోయే పని గురించి ఆలోచిస్తా. నేను కథ రాసేటప్పుడే సినిమా తీస్తున్నట్టు ఊహించుకుంటా. ఇలా ఏది చేసినా సరే నాకో ఈక్వేషన్‌ ఉంటుంది. నా సినిమాలు చూస్తున్నప్పుడైనా సరే మధ్యమధ్యలో లేచి వెళ్తుంటా. కానీ ఈ లాక్‌డౌన్‌ సమయంలో నాకు సహనం బాగా అలవడింది. చక్కగా కూర్చొని సినిమాలు చూసేవాణ్ని. ఈ సమయంలో నాలుగు కథలు సిద్ధం చేసుకున్నా.

'క్రష్‌' సినిమా గురించి చెప్పండి?

ఇది ఒక టీనేజీ రొమాంటిక్‌ కామెడీ చిత్రం. 18ఏళ్ల వయసులో ముగ్గురు కుర్రాళ్లలో జరిగే మార్పులే ఈ సినిమా. వాళ్లలో హార్మోన్లు రేసుగుర్రంలా పరుగులు తీస్తుంటాయి. దీనిలో 'అల్లరి' లాగే మంచి కామెడీ, పాటలు ఉంటాయి. ఈ సినిమా షూటింగ్‌ను లాక్‌డౌన్‌ కంటే ముందే 90 శాతం పూర్తి చేసుకున్నాం. మిగిలిన సన్నివేశాలను లాక్‌డౌన్‌ తర్వాత ప్రారంభించాం. ఇంకా ఐదు పాటలు చిత్రీకరించాల్సి ఉంది.

సెట్లో మనుషుల సంఖ్యను ఎలా తగ్గించుకున్నారు?

లాక్‌డౌన్‌ సమయంలోనే దీనిగురించి ఆలోచించా. ఒక సినిమాకు దర్శకుడు, సహ దర్శకుడు, నలుగురు అసిస్టెంట్‌ డైరెక్టర్లు పని చేస్తుంటారు. దర్శకుడు ఉన్నప్పుడు మళ్లీ సహదర్శకుడు ఎందుకు? నలుగురు అసిస్టెంట్‌ డైరెక్టర్లకు బదులు ఒకరు సరిపోతారు. చిత్రీకరణలో లైటింగ్‌ తప్పనిసరి. గతంలో ఎనిమిది లైట్లను ఆపరేట్‌ చేయడానికి ఎనిమిది మంది అవసరం అయ్యేవారు. ఇప్పుడు సులువుగా ఆపరేట్‌ చేసేలా పోర్టబుల్‌ దీపాలను తీసుకొచ్చాం. వీటిని నిర్వహించడానికి ఇద్దరు చాలు. ఇలా ఒక్కో విభాగంలో మనుషుల సంఖ్యను తగ్గించాం. ఒక సాధారణ షూటింగ్‌కి సెట్లో 80 నుంచి 90 మంది అవసరం. మేం 26 మందితోనే పూర్తి చేశాం. అన్ని విభాగాల్లో వ్యక్తుల సంఖ్యను తగ్గించుకున్నా... శానిటైజేషన్‌ కోసం పారిశుద్ధ్య సిబ్బందిని పెంచుకున్నాం.

దర్శకుడు రవిబాబు

ఇలాగే కొనసాగితే చాలా మంది ఉపాధి కోల్పోతారు కదా!

సాంకేతికత పెరిగే కొద్దీ చిత్రపరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. ఇలాగే ఒకప్పుడు సినిమా ల్యాబుల్లో యాభై నుంచి అరవై మంది అవసరం అయ్యేవారు. 2012లో డిజిటల్‌ టెక్నాలజీ వచ్చింది. దీంతో అక్కడ పనిచేసే చాలామంది చిత్రసీమను వదిలి వేరే అవకాశాలు చూసుకున్నారు. ఇప్పుడు కరోనా ప్రభావం చూపిస్తోంది. దీనికి తగ్గట్టుగా పరిశ్రమ మారుతుంది. భవిష్యత్తులో ఎక్కువ మంది మునుపటిలాగే పని చేస్తారో లేదా తక్కువ మందికే అలవాటుపడిపోతారో మనం చెప్పలేం.

ఇన్ని నిబంధనల మధ్య సినిమాలు తెరకెక్కించొచ్చా?

ప్రభుత్వం విధించిన నిబంధనలతో సినిమాలు తీయడం చాలా కష్టం. దానికి బదులు కామ్‌గా ఇంట్లో కూర్చోవడమే నయం. హీరో, హీరోయిన్‌ మధ్య కౌగిలింత సన్నివేశం లేకుండా ఒక లవ్‌ స్టోరీతో సినిమాను తెరకెక్కించడం ఎలా సాధ్యమవుతుంది? ఒక ఫ్యామిలీ డ్రామాలో పది మంది పక్కనే కూర్చోని భోజనం చేసే సన్నివేశాన్ని ఎలా చిత్రీకరిస్తాం...? ఇలా చెప్పుకొంటూ పోతే చాలా సన్నివేశాలు చిత్రీకరణకు సాధ్యం కావు. ఇలాంటి కథలు రాయడం, తీయడమూ కష్టమే. ఇటీవల మేం విడుదల చేసిన కౌగిలింత సన్నివేశం సినిమాలో ఎలా చూపించగలుగుతాం. అది సరదా కోసం రూపొందించాం.

క్రష్​ సినిమా పోస్టర్​

ఓటీటీలకు ఏమైనా కథలు రాస్తున్నారా?

కథలు రాయడమే నా పని. కానీ దాన్ని జనాలు థియేటర్లలో చూడటానికి ఇష్టపడతారా...? ఓటీటీ వాళ్లకు అనువుగా ఉంటాయా? అనేది మనం చెప్పలేం. మేం అద్భుతమైన కథలు ఇస్తాం. జనాలు ఎక్కడ చూడటానికి ఇష్టపడితే సినిమాను అక్కడ విడుదల చేస్తాం. 'క్రష్‌'ని ప్రేక్షకులకు ఎక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడ విడుదల చేస్తాం.

ఇదీ చూడండి...'మళ్లీ సినిమాలు నిర్మిస్తామా అని భయంగా ఉంది!'

ABOUT THE AUTHOR

...view details