ఎస్పీబీ ఆరోగ్యం కోసం అందరూ ప్రార్థించాలని ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పిలుపు నిచ్చారు. భగవంతుడి ఆశీస్సులతో బాలు తిరిగి వచ్చి పాటలు పాడతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ఆర్పీ పట్నాయక్... ఈ సామూహిక ప్రార్థనాల్లో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
'బాలు త్వరగా కోలుకొని వస్తే కొత్త పల్లవితో ప్రకృతిని పలకరిద్దాం' అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి విన్నపం చేశారు. నిశ్శబ్దంగా విశ్రాంతి తీసుకునే హక్కు బాలుకు లేదని... త్వరగా కొలుకొని వస్తే కొత్త పల్లవితో ప్రకృతిని పలకరిద్దామంటూ తనదైన శైలిలో కవిత రాశారు సిరివెన్నెల.
బాలు ప్రాణం నలతపడి కొట్టుకుంటే కోట్లాది ప్రాణాలు అల్లాడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శివుడి ఆజ్ఞ రాలేదని, బాలును చీమ కూడా కుట్టదని కంటతడి చేసుకున్న సిరివెన్నెల... బాలసుబ్రహ్మణ్యం కోలుకోవాలంటూ ప్రార్థించారు.
అటు మరో నటుడు ఉత్తేజ్ కూడా ఎస్పీ బాలు ఆరోగ్యంపై భావోద్వేగానికి గురయ్యారు. బాలు పాట వింటూ పెరిగిన తాను ఆ పాటలు తనను రక్షించాయని పేర్కొన్నారు. అన్నయ్య క్షేమంగా తిరిగి వచ్చి మళ్లీ పాటలు పాడతారని బాలుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అలాగే బాలు సోదరి ఎస్పీ శైలజ కూడా ప్రత్యేక ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. బాలు ఆరోగ్యం నిలకడగానే ఉందని.. వైద్యుల చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: ఫేస్బుక్ సీఈఓకు కాంగ్రెస్ లేఖ, శివసేన గరం!