తెలుగు పాటకు సొబగులద్దిన ప్రముఖ గేయ రచయిత సిరి వెన్నెల సీతరామశాస్త్రి కలం ఆగిపోయింది. ఇటీవల అస్వస్థతకు గురై కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని వైద్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురించి కొన్ని విశేషాలు మీకోసం..
35ఏళ్ల సినీ ప్రస్థానంలో దాదాపు 100కు పైగా సినిమాల్లో వేలాది పాటలు రాసిన పాటల మాంత్రికుడు సిరివెన్నెల. అమ్మగా, ప్రేయసిగా, ప్రియుడిగా, భర్తగా, భార్యగా, మహా భక్తుడిగా, సాహితీ విమర్శకుడిగా, పోరాట యోధుడిగా.. పాట పాటకూ తన ఆలోచనా రూపాన్ని కలం పదును పెంచుకొని చక్కటి గీతాలు రాస్తూ తెలుగు సినిమా సాహిత్యస్థాయిని పెంచిన నిత్యకృషీవలుడు. శ్రీశ్రీ, వేటూరి, సుద్దాల తర్వాత అనేక అవార్డులు అందుకున్న అద్వితీయ రచయిత. కెరీర్లో దాదాపు మూడు వేలకుపైగా పాటలను రచించిన ఈయనను 11 రాష్ట్ర నంది అవార్డులు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు వరించాయి. 2019లో ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.
కిక్ ఎక్కించాయి
1989లో విడుదలైన 'శివ' చిత్రం నాటి కుర్రకారుకు కిక్ ఎక్కించింది. అందులో బోటనీ పాఠమా, మ్యాటనీ ఆటనా? కుర్రకారుతో గంతులేయించిందీ సిరివెన్నెల సీతారాముడే.