సీతారామశాస్త్రి సినీరంగ ప్రవేశం- ఒక అద్భుతం. ‘వి’ అంటే పక్షి, హంస. హంసలు వహించేది విరించిని (బ్రహ్మదేవుడు). ‘విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతం’ అంటూ చిక్కని పదబంధాలతో శివపూజకు చివురించిన సిరిమువ్వలా ‘విశ్వనాథు’డి ప్రేరణతో రంగంలోకి దిగాడు సిరివెన్నెల. ‘పరుగాపక పయనించవె తలపుల నావ, కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ’ అనేది అప్పటికి తానున్న యథార్థ స్థితికి అచ్చమైన ప్రతిరూపం. ‘ఎదిరించిన సుడిగాలిని జయించినావా... మదికోరిన మధుసీమలు వరించిరావా’ అన్నది శాస్త్రి ఎన్నుకున్న మార్గం.
పైకి నిందిస్తున్నట్లు కనపడుతూ- ఆంతర్యంలో అద్భుతంగా అర్చన సాగించే కవిత్వ ధోరణిని ‘వ్యాజస్తుతి’ అంటారు. ఇది ఒక పండిత కవికి మాత్రమే లోబడే ప్రక్రియ. ‘తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్లరంగునలమిన వాడినేది కోరేది? ఆదిభిక్షువు వాడినేది కోరేది! బూడిదిచ్చేవాడినేది అడిగేది’ అనే పాట సినీ గీతాల్లో నిందాస్తుతికి అరుదైన ఉదాహరణ. ఆదిభిక్షువు అనుగ్రహించే బూడిద పేరు విభూతి... ఐశ్వర్యం. అదీ, అందులో ధ్వని! ఈ తరహా పదాలను పొదిగి పండితుల జేజేలకు నోచుకున్న గొప్పకవి సీతారామశాస్త్రి. ‘ఆబాలగోపాలము- ఆ బాలగోపాలుని...’ అంటూ అవ్యయీభావానికి వేటూరి కర్మధారయాన్ని ముడివేసినప్పుడు కనుబొమలు పైకి లేచినట్లే- ‘ఆదిభిక్షువు’ పాట వినగానే పండితులకు పెదవులపై చిరునవ్వులు పూచాయి.
‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సినీ కవి కలానికి రెండు పాళీలు తప్పనిసరి. ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని. అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని’ అంటూ ఒక పాళీ కదం తొక్కితే- ‘బలపం పట్టి భామ ఒడిలో’ అంటూ మరో పాళీ సయ్యాటలాడుతుంది. ‘అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా’ అని నిలదీసిన కలమే- ‘శివానీ భవానీ శర్వాణీ’ అని భక్తితత్వాన్ని ఆశ్రయిస్తుంది. బిడ్డ ఆకలితో ఒడి చేరగానే తల్లి స్తనం పాలను స్రవించినంత చులాగ్గా పల్లవులను ఒలికించడం శాస్త్రి కలానికి సాధ్యమైంది. ఒక్కోసారి ఒక్క పాటకు వంద పల్లవులు సైతం అందించిన ఘనత శాస్త్రి సొంతం.
శ్రీనాథుడి గురించి దుగ్గన కవి చెప్పిన ‘పూర్వకవి ముఖ్య విరచిత అపూర్వ కావ్య భావరస సుధాచర్వణ ప్రౌఢత’ కవులకు బలమైన దన్ను. దీన్నే ‘వ్యుత్పత్తి’ అన్నారు పెద్దలు. ప్రతిభ, అభ్యాసం దానికి తోబుట్టువులు. కావ్య హేతువులైన ఆ మూడూ సమపాళ్లలో రాణించడం- కవి యోగ్యతకు గుర్తు. సినీ గీతానికి కావ్య గౌరవాన్ని ఆపాదిస్తాయవి. ‘తెలవారదేమో స్వామి’ అన్న అన్నమయ్య పల్లవిని ఎత్తుకుంటే చాలదు, ఆ పలుకు నిలదొక్కుకోవాలి. అది చేతనైతేనే ‘చెలువమునేలగ చెంగట లేవని, కలతకు నెలవై నిలచిన నెలతకు కలల అలజడికి నిద్దుర కరవై అలసిన దేవేరి అలమేలుమంగకు...’ అంటూ పాటను పోషించడమూ తెలుస్తుంది. పాటమొత్తం అన్నమయ్యదేమో అనిపింపజేస్తుంది.
కవి ప్రయోగించిన ఒక పదం భావుకుడి గుండెల్లో వ్యాఖ్యాన తరంగాలను సృజిస్తే ఆ వాక్కుకు ‘వ్యాకోచ వచోవిలాసం’ దక్కినట్లు అన్నాడు మాదయగారి మల్లన. ఆ పదం తెరిచిన ఒక్క కిటికీ రెక్క ద్వారా ప్రసరించే వెలుతురు సాయంతో పాఠకుడు రెండో రెక్కను తెరిచే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో పాఠకుడు ఎదుగుతాడు, భావుకుడవుతాడు. సీతారామశాస్త్రి సినీ గీతాల అభిమానులకు అలా అభిరుచిని మప్పాడు. ‘మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చైజారాక... లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక...’ అనే చరణంతో మాంగల్యానికి పర్యాయపదంగా సౌభాగ్యం అని ప్రయోగించడం వ్యాకోచ వచోవిలాసానికి ఉదాహరణ. ‘తరలిరాద తనే వసంతం’ పాటలో ‘వెన్నెల దీపం కొందరిదా అడవికి సైతం వెలుగు కదా’ వంటి ప్రయోగాలు- పాఠకుడు రెండో రెక్క తెరవడానికి సాయపడే వెలుతురు పిట్టలు. ఆనంద తీరాల అపురూప స్వనాన్ని అమోఘంగా వినిపించిన సిరివెన్నెల కలం అణగారిన వర్గాల ధిక్కార స్వరాన్నీ అంతే బలంగా వినిపించిందని చెప్పే గీతం- ‘తరలిరాద తనే వసంతం!’
సీతారామశాస్త్రి కవిలాగే బతికాడు. కవిత్వాన్నే శ్వాసించాడు. రచన ఎవరిదైనా కవిత్వమైతే చాలు, నిలువునా కరిగిపోయేవాడు. శాస్త్రి వ్యక్తిత్వమూ ఆదర్శప్రాయమే. తన ప్రతిభకు పాదులు తీసిన సత్యారావు మాస్టారును, జీవితాన్ని సరైన దిశగా మళ్ళించిన శివానంద మూర్తి సద్గురువును, తన ప్రగతికి తొలి విత్తు నాటిన దర్శకుడు విశ్వనాథ్‌ను నిత్యం స్మరించేవాడు. పరిపూర్ణమైన జీవితం శాస్త్రిది. హఠాత్తుగా హడావుడిగా వెళ్ళిపోయాడు... పాటగా మిగిలిపోయాడు... ఎందరి గుండెల్లోనో నిలిచిపోతాడు- ఎప్పటికీ!
- ఎర్రాప్రగడ