సిరివెన్నెల సీతారామశాస్త్రికి కన్నీటి వీడ్కోలు sirivennela sitaramasastry cremation: ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు పూర్తయ్యాయి. హైదరాబాద్లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం నిర్వహించారు. టాలీవుడ్ ప్రముఖులందరూ అంతిమయాత్రకు హాజరై, సిరివెన్నెలకు కన్నీటి వీడ్కోలు పలికారు.
అంతకుముందు బుధవారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్లో ఆయన భౌతికకాయం.. అభిమానుల సందర్శనార్థం ఉంచారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున సహా సినీ ప్రముఖులందరూ సిరివెన్నెలను కడసారి చూసేందుకు అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో తమకున్న అనుబంధాన్ని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు.
న్యూమోనియాతో బాధపడుతూ ఇటీవల ఆస్పత్రిలో చేరిన సిరివెన్నెల సీతారామశాస్త్రి.. చికిత్స పొందుతూ నవంబరు 30 సాయంత్రం కన్నుమూశారు. ఆయన మృతితో చిత్రపరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి.
కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన 'సిరివెన్నెల' చిత్రంలో 'విధాత తలపున' గేయంతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఆ సినిమా టైటిల్‌నే ఇంటిపేరుగా సుస్థిరం చేసుకున్నారు. 800లకు పైగా చిత్రాల్లో దాదాపు 3వేల పాటలు ఆయన హృదయ కమలం నుంచి కలంలోకి చేరి అక్షరాలై శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశాయి. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019లో సిరివెన్నెలను పద్మశ్రీతో సత్కరించింది.
ఇదీ చూడండి: 'తెలుగు పరిశ్రమకు చివరి సాహితీ దిగ్గజం సిరివెన్నెల'