సినిమా తెరపై కనిపించే హీరోలు-హీరోయిన్లు నాణేనికి ఒకవైపు అయితే.. తెర వెనకున్న మనకు కనిపించని పాత్రలే నాణేనికున్న రెండో భాగం. ఆ రెండో భాగంలో గాయకులు, డబ్బింగ్ ఆర్టిస్టులూ పాత్రధారులే. గాయనిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. ఆ తర్వాత డబ్బింగ్ మొదలుపెట్టి.. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు నేపథ్య గాయని సునీత. నేడు (మే 10) ఆమె పుట్టినరోజు సందర్భంగా తన సినీ ప్రయాణం గురించి చెప్పిన విశేషాలను ఆమె మాటల్లోనే విందాం.
మీ ప్రస్థానం ఎలా మొదలైంది..!
సునీత: మా అమ్మకు సంగీతం అంటే చాలా ఇష్టం. పరిస్థితుల ప్రభావం వల్ల తాను సాధించలేనిది తన కూతురిగా నాతో సాధించాలనుకుంది. ఆరేళ్ల వయసులోనే నాకు సంగీతం నేర్పించేందుకు గురువు సూర్యారావుగారి దగ్గరకు తీసుకెళ్లింది. 'ఇంత చిన్నపిల్లకు నేనేం సంగీతం నేర్పుతాను' అని ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు. అప్పటి నుంచి నా జీవితంలో అన్నీ ఆశ్చర్యార్థకాలే. ఒక పాట పాడి వినిపించమంటే ఏదో ఒక కీర్తన పాడాను. వెంటనే ఆయన.. 'చూడటానికి బక్కగా ఉంది కానీ.. గొంతు చాలా బాగుంది. శృతి చక్కగా ఉంది. నేను మీ పాపకు సంగీతం నేర్పిస్తా'నని నన్ను శిష్యురాలిగా స్వీకరించారు.
చిన్నప్పుడు మీరు ఏడుస్తున్నా మీ తాతగారు సంగీతంలా ఫీలయ్యేవారట..?
సునీత: మా అమ్మ నన్ను ఎలాగైనా సంగీతం వైపు మళ్లించి మంచి గాయనిని చేయాలని అనుకునేది. అందుకే నా ప్రతీ కదలికలోనూ సంగీతం వెతికేవారు. ఒకసారి నేను ఏడుస్తున్నప్పుడు మా పెద్ద తాతయ్య వచ్చి 'ఇదేదో రాగంలా ఉందే' అని అన్నారు. బహుశా అప్పటి నుంచే అనుకుంటా నన్ను ఎలాగైనా పెద్ద గాయనిగా చూడాలని మా అమ్మ నిర్ణయించుకొని ఉంటారు.
మీ చదువు ఎక్కడ ఎలా సాగింది?
సునీత: నా చదువు మొత్తం గుంటూరులోనే జరిగింది. ఇంటర్ పూర్తయిన తర్వాత నాకు అవకాశం వచ్చింది. సెలవు రోజుల్లో హైదరాబాద్ వచ్చి ఆ తర్వాత ఇక్కడే సెటిల్ అయ్యాం.
పదిహేడేళ్లకే సినిమా అవకాశం వచ్చిందట!
సునీత: సంగీతం నేర్చుకుంటూనే ఆలిండియా రేడియోలో పాడేదాన్ని. 17ఏళ్ల వయసులో దూరదర్శన్‌లో పాడే అవకాశం వచ్చింది. రకరకాల పాటలు పాడేదాన్ని.. శ్రోతలు సైతం మళ్లీ మళ్లీ సునీత గొంతు వినాలని కోరుకునేవారు. అప్పటికీ నాలో కొంచెం భయం ఉండేది. కానీ నన్ను ముందుకు తీసుకెళ్లింది మాత్రం లలిత సంగీతమే. కృష్ణమోహన్ గారి పాటలు పాడుతూ.. భాష మీద అభిమానం పెంచుకున్నాను. లలిత సంగీతం ప్రభావంతోనే నాకు సినిమాలో సులభంగా అవకాశం లభించింది.
మొదటి అవకాశం ఎవరిచ్చారు..?
సునీత: కృష్ణ నీరజ్, నాగరాజుగారు క్యాసెట్ పాటలకు ఎక్కువగా కంపోజింగ్ చేస్తుండేవారు. అందరం కలిసి రెగ్యులర్‌గా రికార్డింగ్‌లో పాల్గొనేవాళ్లం. 'గులాబీ' సినిమా సంగీత దర్శకులైన శశి ప్రీతమ్- నాగరాజుగారు స్నేహితులు. ఆ సినిమాలో 'ఈ వేళలో నీవు' అప్పటికే రికార్డింగ్ పూర్తయ్యింది. అయితే, ఫీమేల్ వెర్షన్‌లో అయితే ఈ పాట ఇంకా బాగుంటుందని భావించి నాకు అవకాశం ఇచ్చారు. నేను మొదటిసారి పాడిన తర్వాత గొంతు ఇంకొంచెం బాగుంటే సరిపోయేదని అన్నారు. 'కొంచెం టైం ఇవ్వండి' అని చెప్పాను. సినిమా పాట పాడదామనుకుంటే నా గొంతు బాగా లేదంటారా..? అని అనుకున్నాను. మళ్లీ పాడాను. ఆ తర్వాత ఓకే చేశారు. ఆ తర్వాత కృష్ణవంశీగారి సినిమాల్లో వరుసగా నాతో పాడించారు. ఆ తర్వాత.. కృష్ణారెడ్డిగారు.. ఆ తర్వాత.. అలా అవకాశాలు పెరిగాయి.
మీ మొదటి పాట ఎన్నిసార్లు పాడినా ఏ మార్పు కనిపించదు..!
సునీత: 'ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో..' పాట నేను ఇప్పుడు ఇలా (చేతలు మొహానికి అడ్డు పెట్టుకొని) వింటాను. నా గొంతు ఎంత పీలగా ఉందనుకుంటుంటాను. ఆ పాట ఇప్పుడేతే ఇంకా బాగా పాడేదాన్ని అనుకుంటాను. అయితే పాట పాడేది నేనే కాబట్టి మీకు పెద్ద తేడా కనిపించదు. కానీ నాకు తెలిసిపోతుంది.
డబ్బింగ్ చెప్పడం ఎలా మొదలైంది..
సునీత: రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన 'అనగనగా ఒకరోజు' సినిమాలో నేను పాట పాడాను. నా గొంతు విన్న వర్మగారు.. 'ఈమెతో హీరోయిన్‌కు డబ్బింగ్ చెప్పిస్తే బాగుంటుంది. ఈమెను చెన్నై తీసుకెళ్లాలి' అన్నారు. మొదట రికార్డింగ్ అంటేనే భయపడే నాకు.. డబ్బింగ్ అనగానే ఆ భయం మరింత పెరిగింది. అసలు నా జీవితం ఎటు వెళుతుందో అనుకున్నాను. అసలు ఒప్పుకోవాలా? వద్దా? అని చాలా ఆలోచించాను. చివరకు చెన్నై వెళ్లాను. వారం రోజులు అక్కడే ఉన్నాను. 'గులాబీ' సినిమాలో పాడింది ఈ అమ్మాయే అని చెన్నైలోనూ ప్రచారం జరిగింది. అవకాశాలు మొదలయ్యాయి.
ఆ సమయంలో సంగీత దర్శకులు కీరవాణిగారు, ఇళయరాజాగారిని స్వయంగా కలిశాను. చెన్నైలో ఉన్న సమయంలో అనుకోకుండా నాతో ఇళయరాజాగారు ఒక పాట పాడించారు. ఆ రోజు ఒక రికార్డింగ్ ఉంది. ఇళయరాజా గారు, ఎస్పీ చరణ్ గారు, బాలు గారు, శైలజ గారు కలిసి పాడాల్సిన పాట అది. శైలజ గారు విమానం మిస్ అవడం వల్ల రాలేకపోయారు. ఎస్పీ చరణ్‌గారికి అదే మొదటి పాట. శైలజగారు రాకపోవడం వల్ల 'మీరు పాడతారా' అని ఇళయరాజా గారు అడిగారు. అయితే, అది తమిళ్ పాట. నేను నేర్చుకొని మరీ ఆ పాట పాడాను. అలా తమిళ సినీ ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టాను. ఆ తర్వాత రెగ్యులర్‌గా ఇళయరాజాగారు పిలవడం, అదే సమయంలో కీరవాణి దగ్గర రకరకాల సినిమాల్లో పాడుతూ ఉండేదాన్ని. కృష్ణారెడ్డిగారి సినిమాలో పాడేందుకు హైదరాబాద్‌కు.. చెన్నైకి అటూ ఇటు తిరుగుతూ ఉండేదాన్ని.
ఇటు నేపథ్య గాయనిగా, అటు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సమయాన్ని ఎలా సమన్వయం చేసుకుంటున్నారు?
సునీత: ఓవైపు పాటలు పాడుతూనే మరోవైపు హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. డబ్బింగ్ చెప్పేటప్పుడు ఒక్కోసారి లెక్కకు మించి టేక్‌లు తీసుకున్నప్పుడు ఏడ్చేదాన్ని. దీంతో ఇక ఎక్కువ డబ్బింగ్‌లే చెప్పకూడదని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలో 'పెళ్లిపందిరి' సినిమాలో వందేమాతరం శ్రీనివాస్ గారి వల్ల ఒక పాటలో డైలాగ్ చెప్పాల్సి వచ్చింది. అది విన్న కోడి రామకృష్ణగారు ఈ అమ్మాయి బాగా డబ్బింగ్ చెబుతోందన్నారు. దాంతో మళ్లీ డబ్బింగ్ స్టార్ట్ అయ్యింది. పాట గంట నుంచి గంటన్నర ఉంటుంది. ఇక డబ్బింగ్ విషయానికొస్తే ఒక ఏడాదిలో సినిమాలో 36 సినిమాలకు డబ్బింగ్ చెప్పాను. డబ్బింగ్ చెప్పడం నాకు సరదా. ఒకానొక సందర్భంలో.. కొంతమంది దర్శకులు సినిమా అవకాశం ఇవ్వలేదు. కానీ 'సక్సెస్ స్పీక్స్ ఎవ్రీథింగ్' కదా.. కాబట్టి నో చెప్పే అవకాశం లేకుండా పోయింది. నాకు 19ఏళ్లకే పెళ్లయింది. 20వ సంవత్సరంలో బాబు పుట్టాడు.
ఆశా భోంస్లే పాడాల్సిన పాట మీరు పాడారట నిజమేనా?
సునీత: ఇలాంటి సంఘటనలు సర్వసాధారణం. మామూలుగా 'మాఘమాసం ఎప్పుడొస్తుందో' ఆశాభోంస్లే గారు పాడాల్సిన పాట. ఆ పాట పాడే అవకాశం నాకు వచ్చింది. అయితే, నేను పాడిన పాటను విన్న భోంస్లే గారు.. 'ఆ అమ్మాయి చాలా బాగా పాడింది. ఆమెతో ఇంకా పాడించండి' అని అన్నారు. నా కెరీర్‌లో 'గులాబీ' సినిమా తర్వాత బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది ఆ పాట.
కుటుంబం నుంచి ఎలాంటి మద్దతు ఉంది..?
సునీత: ఈతరం తల్లిదండ్రుల ముందుచూపు మా పేరెంట్స్‌కు అప్పట్లోనే ఉంది. అయితే డాక్టర్, లేకుంటే ఇంజినీర్, లేదా చార్టెడ్ అకౌంటెంట్, కనీసం టీచర్ అవ్వాలనుకునే సమాజంలోనూ నేను రాణించగల రంగాన్ని గుర్తించి నన్ను ప్రోత్సహించారు. మా అమ్మ నన్ను గుంటూరు నుంచి విజయవాడ తీసుకెళ్లి సంగీతం నేర్పించారు. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత మా నాన్నగారు ఒక్కక్షణం కూడా నన్ను విడిచి ఉండేవారు కాదు. నాన్నమ్మ, మేనత్త మొత్తం ఇలా అందరూ ఎంతో సహకరించేవారు.