ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. 1946 జూన్ 4న నెల్లూరు జిల్లాలో ఎస్పీ సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరులు, ఐదుగురు అక్కాచెల్లెళ్లు. వారిలో ఒకరు మనందరికీ సుపరిచితమైన గాయకురాలు ఎస్పీ శైలజ. బాలసుబ్రహ్మణ్యం భార్య సావిత్రి. కుమారుడు చరణ్, కుమార్తె పల్లవి. పాటే పంచప్రాణాలుగా అసమాన ప్రయాణం సాగించిన బాలు.. పాటలో ప్రధానమైన పల్లవి, చరణం అన్నమాటల్నే తన పిల్లల పేర్లుగా పెట్టుకోవడం విశేషం.
సంగీతంపై ఆసక్తి
యువకుడిగా ఉన్నప్పటి నుంచే సరిగమలపై మక్కువ కలిగిన ఎస్పీబీ.. చెన్నైలో ఇంజినీరింగ్ చదువుతుండగా సంగీతం నేర్చుకున్నారు. అలా 1964లో జరిగిన ఓ పాటల పోటీలో.. ఉద్ధండ సంగీతజ్ఞులు ఘంటసాల, కోదండపాణిల మెప్పు పొంది మొదటి బహుమతి గెలవడం.. ఆయన సినీ సంగీత ప్రస్థానానికి నాంది పలికింది. అప్పటినుంచి కోదండపాణి మాస్టారి శిష్యుడిగా మారిపోయిన బాలు.. 1966లో ఆయన సంగీతం అందించిన 'శ్రీశ్రీ మర్యాదరామన్న' సినిమా కోసం మొదటి పాట పాడారు. అనంతరం 8 రోజుల వ్యవధిలోనే కన్నడ చిత్రం కోసం గానాలాపన చేశారు. అలా మొదలైన ఆయన సినీ సంగీత ప్రయాణం భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా 54 ఏళ్ల పాటు నిర్విరామంగా సాగింది.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇప్పటి వరకు 40 వేలకు పైగా పాటలు పాడారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ సహా మొత్తం 16 భారతీయ భాషల్లో పాటలు పాడారు. సుబ్రహ్మణ్యం పాట వింటుంటే చెవిలో తేనె పోసినట్టు ఉంటుంది. అంత అద్భుతమైన గాత్రమాధుర్యం కలిగిన ఆ మహనీయుడు పాడని రాగం లేదు. గీతాలాపనలో చూపించని ప్రత్యేకత లేదు. పిల్లవాడి స్వరం పలికించడం నుంచి పండు ముదుసలికి గాత్రం అందించడం వరకు.. మధురాతి మధురమైన గానం నుంచి గంభీరమైన గొంతు వినిపించడం వరకు... భక్తి, రక్తి, విరక్తి, విషాదం, ప్రేమ, కసి, ద్వేషం, మధురం.. ఇలా పాట ఏదైనా అన్నింటా తనకే సొంతమైన ముద్ర వేశారాయన. మరెవ్వరికీ సాధ్యం కాదన్నంతగా... సినీ సంగీతం ఉన్నన్ని రోజులూ గుర్తుంచుకునేంతగా... తనకు తానే సాటి అని ఘనంగా చాటారు.
తొలి జాతీయ పురస్కారం
1980లో వచ్చిన 'శంకరాభరణం' చిత్రం... ఎస్పీ బాలు సినీ ప్రయాణంలో చిరస్మరణీయం. తెలుగునాట ఆ సినిమా ఎంత అజరామరమో... సంగీతమూ అంతే. ఒకరకంగా చెప్పాలంటే ఆ సినిమా, అందులోని సంగీతం వేర్వేరు కాదు. సంగీతమే సినిమా, సినిమానే సంగీతం అన్నట్లుగా సాగుతుంది. అలాంటి చిత్రంలో.. కేవీ మహదేవన్ సంగీత దర్శకత్వంలో అనన్యసామాన్యమనే స్థాయి గీతాలాపనతో యావత్ సంగీత ప్రపంచాన్ని బాలు మెప్పించారు. సంగీత ప్రపంచమంతా తనవైపు చూసేలా చేశారు.
అప్పటిదాకా సాగిన ఆయన సంగీత పయనం ఓ ఎత్తు. ఆ తర్వాత మరో ఎత్తు అని చెప్పవచ్చు. శంకరాభరణం పాటకుగానూ బాలుకు మొదటిసారి ఉత్తమ గాయకుడిగా జాతీయ పురస్కారం దక్కింది. ఆ తర్వాతి సంవత్సరమే బాలు స్వరమాధుర్యాన్ని చవిచూసింది హిందీ సినిమా. 1981లో వచ్చిన 'ఏక్ దూజే కేలియే' సినిమాకు ఆయనకు రెండో జాతీయ అవార్డు వచ్చింది.
అన్ని భాషల్లో స్వరాన్ని..
ఈ సుదీర్ఘ ప్రస్థానంలో చాలా తక్కువ మంది మినహా ఆయన పనిచేయని సంగీత దర్శకుడు లేడంటే అతిశయోక్తి కాదేమో. అలాగే కలిసి పాడని గాయనీ, గాయకులూ ఉండరేమో. నాటి ఎన్టీఆర్, ఏయన్నార్ నుంచి నేటి జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య వరకు అన్ని భాషల్లోనూ బాలు గళం అందించని నటులూ అరుదేనని చెప్పవచ్చు. ఆ సంగీత జ్ఞానిని ఒక్కసారి కలిస్తే చాలు అని భావించే సంగీత నిపుణులు, గాయనీ-గాయకులకు కొదవలేదు. ఇక సామాన్య ప్రజానీకం సంగతి చెప్పేదేముంది.
ఇళయరాజాతో అనుబంధం
ఇసై జ్ఞానిగా సంగీత ప్రపంచంలో అనితర సాధ్యమైన ముద్రవేసిన ఇళయరాజాతో ఎస్పీబీకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇళయరాజా సినీ ప్రయాణం ప్రారంభం కాకముందు నుంచే బాలుతో కలిసి పనిచేశారు. అప్పట్లో వివిధ ప్రాంతాల్లో జరిగిన సంగీత వేడుకల్లో బాలు పాడిన పాటలకు సంగీతం అందించిన బృందంలో ఇళయరాజా ఒకరు. తర్వాతి కాలంలో ఆయన సంగీత దర్శకుడిగా ఎదిగాక ఈ గాన గంధర్వుడితో లెక్కలేనన్ని పాటలు పాడించారు.