'నువ్వుంటే నా జతగా'.., 'ఉండిపోరాదే'.., 'పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే', 'ఏమై పోయావే నీ వెంటె నేనుంటే'.. ఈ పాటలు వింటుంటే మీకో పేరు గుర్తుకురావాలి. కాదు కాదు.. అంతకంటే ముందు అతడి గొంతు మీ మదిలో మెదలాలి. ఏ పాట పాడినా అది ట్రెండింగే.. అతడు గీతాన్ని పాడుతున్నాడంటే వచ్చే హైప్ అంతా ఇంతా కాదు. కొంత కాలంగా మనసులను హత్తుకునే పాటలతో యువతను మైమరిపిస్తోన్న యువ గాయకుడు సిద్ శ్రీరామ్. నేడు అతడి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం మీ కోసం..
మూడో ఏటనే..
1990, మే19న తమిళనాడులోని చెన్నైలో పుట్టాడు సిద్. ఏడాది ప్రాయంలోనే తన తల్లి లతా శ్రీరామ్‌తో కలిసి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు వెళ్లిపోయాడు. ఆ ప్రాంతంలో కర్ణాటక సంగీతం ద్వారా ఆమె మంచి పేరు తెచ్చుకుంది. సంగీతంపై మంచి పట్టు ఉన్న లత.. సిద్‌కు మూడో ఏట నుంచే తర్ఫీదునిచ్చింది. కర్ణాటక సంగీతంలో మంచి ప్రావీణ్యుడిని చేసింది.
2008లో శాన్ జోస్ హైస్కూల్లో పట్టభద్రుడయ్యాడు సిద్. తర్వాత బెర్క్లీ సంగీత కళాశాలలో మరింత ఉన్నత స్థాయి శిక్షణ పొందాడు. ప్రతి ఏటా డిసెంబర్లో మరగజి ఉత్సవంలో ప్రదర్శనలు ఇచ్చేవాడీ యువ గాయకుడు.
తొలి అడుగు..
ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మన్.. సిద్‌ను వెండితెరకు ప్లే బ్యాక్ సింగర్‌గా పరిచయం చేశాడు. ఈయన సంగీతమందించిన కడలి (2013) సినిమాలో తొలిసారి సిద్ శ్రీరామ్‌కు అవకాశమిచ్చాడు. ఇందులో 'యాడికే' అనే పాట పాడాడు. ఇది పేరే తెలియని సిద్‌ను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. తర్వాత రెండేళ్ల వరకు ఇతడు మళ్లీ తెరమరుగయ్యాడు.
'ఐ' ద్వారా రీఎంట్రీ..
2015లో వచ్చిన ఐ సినిమాలో 'నువ్వుంటే నా జతగా' అనే పాట పాడేందుకు సిద్‌కు మళ్లీ అవకాశమిచ్చాడు రెహ్మన్. ఇది ఎంతగా ఆకట్టుకుందంటే.. 'బెస్ట్ ప్లే బాక్ సింగర్'గా ఫిల్మ్‌ఫేర్ అవార్డునూ తెచ్చింది. తర్వాత తన జీవితమే మారిపోయింది. వరుస అవకాశాలు క్యూ కట్టాయి. రెహ్మన్, అనిరుధ్, జిబ్రాన్, యువన్ శంకర్ రాజా, తమన్ వంటి ప్రముఖ సంగీత దర్శకులతో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఏ పాట పాడినా మిలియన్ వీక్షణలతో రికార్డులు సాధిస్తున్నాడీ యువకెరటం.
నయా ట్రెండ్..
అల్లుఅర్జున్ సినిమా 'అల వైకుంఠపురములో' నుంచి 'సామజవరగమనా' పేరుతో విడుదలైన పాట కొత్త ట్రెండ్‌కు నాంది పలికింది. అత్యంత వేగంగా యూట్యూబ్లో 5 లక్షల లైక్స్ సంపాదించిన తొలి తెలుగు పాటగా సరికొత్త రికార్డును నమోదు చేసింది. తమన్ సంగీత సారథ్యంలో, సిరి వెన్నెల సాహిత్యాన్ని అద్భుతంగా ఆలపించాడు సిద్ శ్రీరామ్. సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకుందీ గీతం.
ఇవే కాకుండా సిద్ శ్రీరామ్ పాడిన 'ఉండిపోరాదే..గుండె నీదేలే' (హుషారు), 'ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే..చాలే ఇది చాలే' (గీత గోవిందం), 'పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే' (టాక్సీవాలా), 'ఏమై పోయావే నీ వెంటే నేనుంటే' (పడి పడి లేచె మనసు), 'నువ్వుంటే నా జతగా' (ఐ), ఏమో ఏమో(రాహు), నీలినీలి ఆకాశం(30 రోజుల్లో ప్రేమించడం ఎలా), ఓకేఓకా లోకం నీవే(శశి), మగువా మగువా(వకీల్‌సాబ్), పాటలు తెలుగులో ఎవర్ గ్రీన్ హిట్స్‌గా నిలిచాయి.
వీటితో పాటు డియర్ కామ్రేడ్, గ్యాంగ్ లీడర్, సాహసం శ్వాసగా సాగిపో, రంగ్ దే, 99 సాంగ్స్, నిన్నుకోరి వంటి సినిమాల్లో అదిరిపోయే పాటలు పాడాడు సిద్. తమిళంలో ఎన్నోడు నీ ఇరుందాల్(ఐ), కురుంబా కురుంబా (టిక్ టిక్ టిక్), కన్నాన కన్నే..(విశ్వాసం) వంటి పాటలతో అందర్నీ ఆకట్టుకున్నాడు. పలు సినిమాలకు సంగీత దర్శకుడిగానూ వ్యవహరించాడు. ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు.