శ్రేయా ఘోషల్... భాషా భేదమెరుగని స్వరం ఆమె సొంతం. అందుకే తెలుగు, తమిళం, హిందీ అనే తేడాలేకుండా తేనెలూరే స్వరమాధుర్యంతో సినీ, సంగీత ప్రియుల హృదయాల్లో చెరగని ముద్రవేసింది. సంప్రదాయ సంగీతమైనా, పాశ్చాత్య గీతమైనా, ప్రేమ పాటలు, విరహగీతాలు, కవ్వించి కాలు కదిపించే ఐటెం గీతాలు.. ఏ తరహా పాటలైనా ఆమె గళంలో పడితే ఆణిముత్యాలై ప్రేక్షకుల మదిలో నాటుకుపోవాల్సిందే.
తనదైన వైవిధ్యమైన గానామృతంతో అన్ని వర్గాల ప్రేక్షకులను రంజింపజేసి చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది శ్రేయా. "దేవుల్లే మెచ్చింది. మీ ముందే జరిగింది. వేదంలా మిగిలింది. సీతారామ కథ వినుడి.." అంటూ ఎంత చక్కగా తన గొంతుతో భక్తిభావాన్ని పలికించగలదో.. అదే స్వరంతో "హే నాయక్.. తుహే లవ్ నాయక్.." అంటూ ఊపుతెప్పించే గీతాలతో కుర్రకారును ఉర్రూతలూగించగలదు.
క్లాస్, మాస్, రాప్, రాక్ పాటేదైనా ఆమె వాణిలో ప్రతిధ్వనిస్తే చాలు "నువ్వేం మాయ చేశావో కానీ ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని.." అంటూ యువతరం తన స్వరంలో మైమరిచిపోతుంది. "నువ్వే నా శ్వాస.. మనసున నీకై అభిలాష.." అంటూ తన నోటి నుంచి ఇంకొక్క గీతమైన విని తరించాలని ఉవ్విళ్లూరుతుంది. "వచ్చే వచ్చే నల్లమబ్బుల్లారా.." అంటూ వానపాటలతో అల్లరి చేయాలన్నా.. "సిగ్గేస్తుంది నిను చూస్తుంటే.. సిగ్గేస్తుంది నీ మాటింటే.." అంటూ రొమాంటిక్ గీతాలతో కవ్వించాలన్నా.. మదిలో మెదిలే తొలిపేరు శ్రేయా ఘోషలే. అందుకే దర్శక, నిర్మాతలు శ్రేయాతో తమ చిత్రాల్లో ఒక్కపాటైనా పాడించుకోవాలని చెవులు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటారు.
ఆ స్వర సరస్వతిది తెలుగు నేల కాదు...
"జగదానందకారక జయ జానకీ ప్రాణనాయకా.. శుభ స్వాగతం ప్రియ పరిపాలకా.." అంటూ 'శ్రీరామ రాజ్యం'లో రసరమ్యంగా శ్రేయా ఆలపించిన గీతం వింటే ఏ సినీ సంగీతాభిమానైనా ఆ స్వరం తెలుగు గడ్డ ముద్దు బిడ్డదేమో అని తలుస్తారు. ఎందుకంటే అంత అచ్చమైన తేటతెలుగు ఉచ్ఛారణతో అందరినీ కట్టిపడేసింది శ్రేయా ఘోషల్.
శ్రేయా పశ్చిమ బంగాల్లో పుట్టిపెరిగింది. 1984 మార్చి 12న బంగాల్లోని దుర్గాపూర్లో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది. తండ్రి బిశ్వర్‌జీత్ ఘోషాల్, తల్లి సర్‌మిష్‌తా ఘోషల్. శ్రేయాకు సంగీతంలో తొలిగురువు తన తల్లే. నాల్గవ ఏట నుంచే తన తల్లి దగ్గర హార్మోనియం నేర్చుకోవడం మొదలుపెట్టింది. తర్వాత మహేష్ చంద్ర శర్మ వద్ద హిందూస్థానీ సంగీతాన్ని అభ్యసించింది.
ఆ టీవీ షోతో గుర్తింపు..