నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళనపై వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఆమెతో మాటల యుద్ధం ఆపాలని కోరుతూ ప్రముఖ గాయకుడు మికా సింగ్ నెటిజన్లను అభ్యర్థించాడు.
" పంజాబీ సోదరులు దయచేసి మౌనంగా ఉండాలని కోరుతున్నా. కంగనా రనౌత్‌పై దృష్టి పెట్టడం, ఆమె గురించి మాట్లాడటం మన పని కాదు. ఆమెతో వృత్తిపరంగా నాకు ఎలాంటి విభేదాలు లేవు. ఆమె తప్పు చేసింది. దాని వల్ల ఏర్పడ్డ సమస్యల్ని ఎదుర్కొంటోంది. కనీసం క్షమాపణలు చెప్పకుండా ట్వీట్ తొలగించింది. రైతులకు మద్దతు తెలపడం మన ప్రధాన ఉద్దేశం. దానిపై దృష్టి పెట్టండి. కంగన క్రేజీ.. ఆమెను వదిలేయండి. పాపా.. కంగనా నువ్వు సౌమ్యంగా ఉండే కరణ్ జోహర్, హృతిక్ రోషన్, రణ్‌వీర్ సింగ్‌లాంటి బాలీవుడ్ ప్రముఖుల్ని లక్ష్యంగా ఎంచుకొని తప్పించుకోవచ్చు. కానీ మాతో పెట్టుకోవద్దు" అని మికా సింగ్ సున్నితంగా హెచ్చరించాడు.
సింగర్ మికా సింగ్, నటి కంగనా రనౌత్ 'ఇది సిగ్గు పడాల్సిన విషయం'
అన్నదాతలకు మద్దతు పలుకుతూ ఇటీవల పంజాబీ నటుడు దీప్ సింధు నిరసనలో పాల్గొన్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందిస్తూ సిగ్గుపడాల్సిన విషయమంటూ కంగన ట్వీట్ చేసింది. రైతుల పేరుతో కొందరు ప్రయోజనం పొందాలనుకుంటున్నారని విమర్శించింది.
కంగన వ్యాఖ్యలను నటి హిమాషీ ఖురానా, గాయకుడు అమీ విర్క్, నటి సర్గున్ మెహతా ఖండించారు. రైతులు తమ హక్కుల గురించి ప్రశ్నించకూడదా..? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీరితోపాటు చిత్ర పరిశ్రమలోని కొందరు, నెటిజన్లు ఆమెకు వ్యతిరేకంగా పోస్ట్‌లు చేస్తున్నారు. అంతేకాదు ఓ వృధ్ధ మహిళ గురించి కంగన చేసిన ట్వీట్‌పై దిల్లీ సిక్కు గురుద్వారా నిర్వాహక కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇటీవలే రైతుల ఆందోళనలో పాల్గొన్న ఓ సిక్కు వృద్ధురాలి(షాహీన్ బాగ్ బామ్మగా భావించి) గురించి తప్పుడు సమాచారంతో కూడిన ట్వీట్ చేసిన కంగనా కొద్దిసేపటికే దాన్ని డిలీట్ చేసింది. ఈ విషయంపైనా సింగర్ దిల్జిత్ సింగ్‌తో వాదించింది నటి కంగనా.
ఇదీ చదవండి:సింగర్ దిల్జిత్, నటి కంగన మాటల యుద్ధం!