Lata Mangeshkar died: భారత సినీ చరిత్రలో గాయనిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న లతా మంగేష్కర్ తుదిశ్వాస విడిచారు. కరోనా బారినపడిన ఆమె జనవరి 8న ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స అందించిన క్రమంలో కొద్ది రోజులకు కోలుకున్నారు. అయితే.. శ్వాస సంబంధిత సమస్య తీవ్రమవటం వల్ల 28 రోజుల చికిత్స అనంతరం ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆమె సోదరి ఉషా మంగేష్కర్ వెల్లడించారు.
"ఆదివారం ఉదయం 8.12 గంటలకు లతా మంగేష్కర్ కన్నుముశారు. కొవిడ్ అనంతరం 28 రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. పలు అవయవాలు దెబ్బతినటం వల్ల ప్రాణాలు కోల్పోయారు."
- డాక్టర్ ప్రతిత్ సందాని, ముంబయి బ్రీచ్ కాండీ ఆసుపత్రి
గాయని లతా మంగేష్కర్ తుదిశ్వాస విడిచినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆమె చికిత్స పొందుతున్న బ్రీచ్ కాండీ ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
⦁ లతా మంగేష్కర్.. 1929 సెప్టెంబరు 28న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించారు.
⦁ లతా మంగేష్కర్ తల్లిదండ్రులు దీనానాథ్ మంగేష్కర్, శుద్దమతిల మొదటి సంతానం.
⦁ ఐదేళ్ల వయసులోనే తండ్రి దగ్గర సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు.
⦁ 13 ఏళ్ల వయసులో తండ్రి మరణంతో సినీ రంగంలోకి 1942లో నేపథ్య గాయనిగా ప్రవేశించారు.
⦁ దేశ విభజనలో ఖుర్షీద్, నుర్జహాన్ వంటి ప్రముఖ గాయకులు పాకిస్థాన్ వెళ్లిపోవడం వల్ల లతా మంగేష్కర్ దశ తిరిగింది. స్టార్ సింగర్‌గా పేరు తెచ్చుకున్నారు.
⦁ లతా మంగేష్కర్ పాడిన తొలి పాటను సినిమా నుంచి తొలగించారు.(మరాఠి చిత్రం కోసం)
⦁ 'మహల్'(1949) సినిమాలోని ఆయేగా ఆనే వాలా పాటతో లతా కెరీర్ మలుపు తిరిగింది.