కరోనా వైరస్ ప్రభావం పార్లమెంట్‌పైనా పడింది. బాలీవుడ్ గాయనికి కరోనా పాజిటివ్ తేలడం ఇందుకు మూలమైంది. ఆమె ఇటీవల ఇచ్చిన విందుకు పలువురు పార్లమెంట్ సభ్యులు, సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు వెళ్లడం కలకలం రేపుతోంది. అదే సమావేశంలో పాల్గొని వచ్చిన రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆమె తనయుడు, ఎంపీ దుష్యంత్ సింగ్ ఇప్పటికే స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అయితే, పార్టీకి వెళ్లొచ్చిన దుష్యంత్‌తో పలువురు పార్లమెంట్ సభ్యులు సైతం సన్నిహితంగా మెలగడం, ఆయనతో పాటు సమావేశాల్లో పాల్గొనడం అనుమానాలకు తావిస్తోంది. దుష్యంత్‌ను పలువురు మీడియా ప్రతినిధులు సైతం ఇంటర్వ్యూ చేశారు.
బాలీవుడ్ గాయనితో పార్లమెంట్‌కు కరోనా సెగ
బాలీవుడ్ గాయని కనికా కపూర్ కరోనా పాజిటివ్‌గా తేలడం వల్ల, పలువురు రాజకీయ నాయకులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఇటీవల కాలంలో ఆమె హాజరైన పార్టీలకు వీరు వెళ్లడమే ఇందుకు కారణం.
ఈ నేపథ్యంలో ఆయనతో కలిసి పార్లమెంట్ స్థాయీ సంఘ సమావేశంలో రెండు గంటలు గడిపినట్లు టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయిన్ తెలిపారు. తానూ స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నట్లు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్ సమావేశాలు కొనసాగించడం సబబు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ సమావేశాలు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు దుష్యంత్‌ను కలిసిన అప్నాదళ్ నేత అనుప్రియ పాటిల్, స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మంత్రి మురళీధరన్, ఎంపీలు సురేష్ ప్రభు, హుస్సేన్ సింగ్ సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. దీంతో స్వీయ నిర్బంధంలోకి వెళుతున్న రాజకీయ నాయకుల వారి సంఖ్య పెరుగుతోంది.