Ghantasala 100 Years: భాగవత గ్రంథకర్త బమ్మెర పోతన తన కావ్యకన్య గురించి చెప్పిన 'బాల రసాల.. ' అనే వర్ణన అమర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గళమాధుర్యానికి కూడా ఇట్టే సరిపోతుంది. లేత మామిడి చిగురు లాంటి అతి కోమలమైనదే ఆయన స్వరమాధురి.
'ఏ తల్లి మొదటి కబళం నా జోలెలో వేసిందో.. ఆమె వాత్సల్యపూరిత భిక్ష నాకు అష్టైశ్వర్యాలు ప్రసాదించింది' అని సవినయంగా చెప్పేవారు గతం మరవని ఘంటసాల. తండ్రి కోరిక మేరకు సంగీతం నేర్చుకునేందుకు విజయనగరం చేరిన తొలిరోజుల్లో వీధుల్లో జోలె పట్టి (మధూకరం) తిరుగుతూ పూట గడుపుకొనేవారు. అంతటి గాయకుడు తర్వాత... ఎంత ఎదిగారో... అందరికీ తెలిసిందే. ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగయ్యను ఆరాధించిన ఘంటసాల 'గాయకుడికి గాత్రం ఒక్కటే చాలదు. భాషపై పట్టు, లోకజ్హానమూ కావాలి' అని చెప్పేవారు. ఘంటసాల శతజయంతోత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనం..
కృష్ణాజిల్లా గుడివాడ తాలూకాలోని చౌటపల్లె గ్రామంలో 1922 డిసెంబర్ 4వ తేదీన రత్తమ్మ, సూర్యనారాయణ దంపతుల ఆరుగురు సంతానంలో ఒకడిగా పుట్టారు ఘంటసాల వెంకటేశ్వరరావు. 9వ తరగతి వరకు చదివారు. నాటకాల్లో ఆసక్తిగా నటించేవారు. తండ్రి మృదంగం వాయిస్తూ పాడుతూ ఉంటే.. ఘంటసాల బాలభరతుడిలా నృత్యం చేసేవారు. తన 11వ ఏట తండ్రి చనిపోయాక.. ఘంటసాల కుటుంబం మేనమామ పంచన చేరింది. 14 ఏళ్ల వయసులో చేతి ఉంగరం అమ్మి విజయనగరం వెళ్లి సంగీత కళాశాలలో చేరారు. ప్రిన్సిపల్ ద్వారం వెంకటస్వామినాయుడు ఆదరణతో నాలుగేళ్ల కోర్సు రెండేళ్లలో పూర్తి చేశారు.
పెళ్లికొడుకుదే పాటకచేరి
మేనమామ తన కూతురు సావిత్రినిచ్చి 1944లో ఘంటసాలకు పెళ్లి చేశారు. ఈ వేడుకలో పాటల కచేరీ పెళ్లికుమారుడిదే కావడం ఓ విశేషం. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. మేనమామ గ్రామానికే చెందిన ప్రముఖ సినీ రచయిత సముద్రాల రాఘవాచార్యతో ఏర్పడిన పరిచయం ఘంటసాల జీవితాన్ని మేలుమలుపు తిప్పింది.
గాన గంధర్వుడై..
ముప్పై ఏళ్ల కెరియర్‌లో ఇంచుమించు ప్రతి ఏడూ ఉత్తమ గాయకుడు ఘంటసాలే. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడిగా మూలవిరాట్టు వేంకటేశ్వరస్వామి ఎదురుగా భక్తి గీతాలు ఆలపించిన ధన్యజీవి ఘంటసాల. వాగ్గేయకారుడు అన్నమాచార్యుడి తర్వాత ఈ భాగ్యం ఆయనకే దక్కింది. చిత్రసీమకు వచ్చి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా 1970లో హైదరాబాదు నగరంలో 'ఘంటసాల సంగీత రజతోత్సవం' వైభవంగా జరిగింది. అదే ఏడాది భారత ప్రభుత్వం ప్రకటించిన 'పద్మశ్రీ' అవార్డును రాష్ట్రపతి వి.వి.గిరి చేతుల మీదుగా అందుకొన్నారు.
భగవద్గీత సారం... ప్రైవేటు గీతం
- సినిమా పాటలే కాకుండా.. ఘంటసాల పాడిన 'ఓ పోలీస్ వెంకటస్వామి', 'అత్త లేని కోడలుత్తమురాలు', 'తలనిండ పూదండ దాల్చిన రాణి' లాంటి పలు ప్రైవేటు గీతాలూ బహుళ ప్రజాదరణ పొందాయి. రాగయుక్తంగా ఆయన ఆలపించిన 'పుష్పవిలాపం', 'కుంతీకుమారి' లాంటి కావ్యగానాలు.. 1973లో హెచ్‌ఎంవీ వారి కోసం జీవిత చరమాకంలో పాడిన 'భగవద్గీత' తెలుగువారు కలకాలం దాచుకోదగిన మధుర జ్ఞాపకాలు. ఘంటసాల అమరత్వం పొందిన మూడు నెలల తర్వాత 'భగవద్గీత' రికార్డులు మార్కెట్లో విడుదలై సంచలనం సృష్టించాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మరణానికి ఒకరోజు ముందు 'భద్రాచల రామదాసు వైభవం' డాక్యుమెంటరీ కోసం ఆయన పాట పాడారు. ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు మాస్టర్ వేణు (నటుడు భానుచందర్ తండ్రి) ఆసుపత్రిలోనే రికార్డు చేశారు.
- సముద్రాల రాఘవాచార్యులు పలువురు సినీరంగ ప్రముఖులకు ఘంటసాలను పరిచయమూ చేశారు. ఓ గ్రామ్‌ఫోన్ కంపెనీకి వెళితే ‘నీ గొంతు మైక్ ముందు పనికిరాదు పో’ అని వెనక్కుపంపడం వల్ల ఘంటసాల కుమిలిపోయారు. ఆ తర్వాత ఆకాశవాణిలో పాడే అవకాశాలొచ్చాయి. ఈ దశలో నేటి ప్రముఖ సంగీత దర్శకుడైన ఘంటసాల సాయి శ్రీనివాస్ (ఎస్.తమన్) తాత గారైన నాటి ప్రముఖ సినీ దర్శకుడు ఘంటసాల బలరామయ్య దృష్టిలో పడ్డారు ఘంటసాల. అక్కినేని నాగేశ్వరరావుతో ఆయన తీస్తున్న 'సీతారామ జననం' చిత్రానికి మందలో ఒకడిగా (బృందగానం, నటన) అవకాశమిచ్చి నెలకు రూ.75 జీతంగా ఇచ్చేవారు. అక్కినేనితో అంతకుముందే నాటకాల్లో పరిచయమున్న కారణంగా ఇద్దరూ ఒకే గదిలో సర్దుకునేవారు.
- గాయకుడిగా కొనసాగుతూ దాదాపు వంద చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఇందులో లవకుశ, చిరంజీవులు, రహస్యం, బందిపోటు, పాతాళభైరవి, గుండమ్మకథ, మాయాబజార్, షావుకారు, పాండవ వనవాసం లాంటి చిత్రాలు మంచి పేరు తెచ్చాయి. నిర్మాతగానూ ‘పరోపకారం’, ‘సొంతవూరు’, ‘భక్త రఘునాథ్’ చిత్రాలను ఆయన నిర్మించారు.
- దక్షిణాది భాషలన్నింటిలోనూ కలిపి పది వేలకు పైగా పాటలు పాడారు. అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ దేశాల్లో కచేరీలు చేశారు. హిందీలోనూ 'ఝండా ఊంచా రహే హమారా' అనే చిత్రానికి సంగీత దర్శకత్వ వహించి పాటలు పాడారు.
1971లో ఐక్యరాజ్యసమితిలో గానకచేరీ చేసిన ప్రతిభ ఈ గంధర్వ గాయకుడిది. ఈ సందర్భంగా ఐరాస తరఫున శాంతి పతకం బహూకరించారు. 2003లో భారత ప్రభుత్వం, 2014లో అమెరికాలో ఘంటసాల పేరిట పోస్టల్ స్టాంపులు విడుదల చేశారు.