బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌పై ప్రశంసల వర్షం కురిపించింది ప్రముఖ నటి సిమి గరెవాల్. కొన్ని రోజులుగా బంధుప్రీతి నుంచి చిత్రపరిశ్రమలోని మాఫియా వంటి అంశాలపై ఘాటుగా స్పందిస్తోంది నటి కంగన. ఇదే పరిస్థితి తనకు గతంలో ఎదురైందని.. కానీ, తాను కంగనలా ధైర్యంగా పోరాడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది సిమి.
"నా కన్నా ధైర్యవంతురాలైన కంగనా రనౌత్‌ను అభినందిస్తున్నా. చిత్రపరిశ్రమలో ఓ శక్తివంతమైన వ్యక్తి నా కెరీర్‌ను నాశనం చేయడానికి ఎలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడ్డాడో నాకు మాత్రమే తెలుసు. కానీ, నేను అప్పుడు మౌనంగా ఉండిపోయా. ఎందుకంటే నాకు అంత ధైర్యం లేదు. " -సిమి గరెవాల్, సీనియర్ నటి
"ఇటీవలే #కంగనాస్పీక్స్టూఆర్నాబ్ కార్యక్రమం చూసిన తర్వాత మీ అందరికీ ఏమి అనిపిస్తుందో నాకు తెలియదు. కానీ, అది నన్ను చాలా నిరుత్సాహపరిచింది. మరోవైపు సుశాంత్ ఆత్మహత్య నన్ను ఎంతగానో కలచివేసింది. ఎందుకంటే బాలీవుడ్‌కు కొత్తగా వచ్చిన నటులు ఏమి చేయగలరు. ఆ పరిస్థితి మారాలి" అని సిమి గరెవాల్ ట్వీట్ చేసింది.
జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్పటి నుంచి హిందీ చిత్రసీమలో నెపోటిజంపై విమర్శలు వచ్చాయి. వాటిల్లో మహేశ్ భట్, కరణ్ జోహర్ వంటి నిర్మాతల పాత్ర ఉందని పరోక్షంగా ఘాటు విమర్శలు చేసింది కంగన. ఆత్మహత్యా? లేదంటే ప్రణాళిక ప్రకారం చేసిన హత్యా? అనేది తేల్చాలని ఆమె కోరింది. ఇది సోషల్‌మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.