అడుగు బయట పెట్టలేని ఈ పరిస్థితుల్లోనూ ప్రేక్షకుడి వినోదానికి లోటు లేకుండా చేస్తున్నాయి ఓటీటీ వేదికలు. వెబ్‌సిరీస్‌లనీ, ఇప్పటికే విడుదలైన సినిమాల్నీ అందుబాటులో ఉంచుతూ ప్రేక్షకుడిని కట్టిపడేస్తున్నాయి ఆయా వేదికలు. ఒక రకంగా ప్రేక్షకుడికి ఈ మాధ్యమాల్ని మరింత బలంగా అలవాటు చేసినట్టయింది ఈ లాక్‌డౌన్ కాలం. ఇప్పుడు తమ వేదికల్ని ఆశ్రయిస్తున్న ప్రేక్షకుడిని మరింత రంజింపజేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి ఓటీటీ ఛానళ్లు. థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్న సినిమాల్ని కొనేసి ఈ వేదికల్లో అందుబాటులో ఉంచేలా నిర్మాతలతో బేరసారాలు సాగిస్తున్నాయి. వడ్డీల భారం మోయడం కంటే ఓటీటీ ఛానళ్లలో విడుదల చేసుకోవడమే శ్రేయస్కరమా? కొన్నాళ్లు ఓపిక పట్టి థియేటర్లలోనే విడుదల చేసుకోవడం మంచిదా అని ఆలోచిస్తున్నారు నిర్మాతలు. కానీ ఎక్కువమంది థియేటర్ల వైపే మొగ్గు చూపుతున్నారు.
లాక్‌డౌన్ సమయంలో కొన్ని అనువాద చిత్రాలు నేరుగా ఓటీటీ వేదికల్లోకి వచ్చేశాయి. లాక్‌డౌన్ పూర్తయ్యాక వాటిని విడుదల చేసుకునే పరిస్థితులు ఉంటాయో లేదో అని నిర్మాతలు డిజిటల్ వేదికల్లోనే విడుదల చేశారు. ‘శక్తి’, ‘షూట్ అట్ ది సైట్ ఉత్తర్వు’ లాంటి అనువాద చిత్రాలు అమెజాన్ ప్రైమ్‌లోవిడుదలయ్యాయి. తెలుగులో విడుదల తేదీని ప్రకటించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అవన్నీ లాక్‌డౌన్ ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చూస్తున్నాయి. కానీ లాక్‌డౌన్ పూర్తయిన వెంటనే థియేటర్లు తెరుస్తారా? అప్పుడు ప్రేక్షకుడు థియేటర్‌కి వచ్చేందుకు ఆసక్తి చూపుతాడా? అనే ప్రశ్నలు నిర్మాతల్ని ఆలోచనలో పడేస్తున్నాయి. వీటికి తోడు పెట్టుబడి మీద వడ్డీల భారం కూడా నిర్మాతల్ని ఓటీటీ వేదికల్లో విడుదల గురించి ఆలోచించేలా చేస్తున్నాయి. అయితే పరిమిత వ్యయంతో తెరకెక్కిన ఒకట్రెండు చిత్రాలు ఓటీటీల వైపు వెళతాయేమో కానీ, అధిక వ్యయంతో తెరకెక్కిన సినిమాలు థియేటర్లలో విడుదలయ్యేలా కనిపిస్తున్నాయి.