తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వెండితెర కన్నీటి చుక్క.. సిల్క్​ స్మిత

హొయలొలికించే అందాలతో ప్రేక్షకులందరు మెచ్చిన నటిగా మారింది వెండితెర సుందరి సిల్క్​ స్మిత. నేడు ఆమె 25వ వర్ధంతి. ఈ సందర్భంగా ఆమె గురించి ప్రత్యేక కథనం మీకోసం..

Silk Smitha
సిల్క్​ స్మిత

By

Published : Sep 23, 2020, 5:23 AM IST

ఆమె పేరు చెప్పగానే అభిమాన ప్రేక్షకుల గుండెలు బరువెక్కుతాయి. కన్నీటితో కళ్లు తడిసిపోతాయి. ఆమె అందం... అభినయం..నృత్య సమ్మోహనాన్ని మించిన వ్యక్తిగత జీవితమే వీక్షకులను ఎంతగానో కలచివేస్తుంది. దీపం చుట్టూ శలభంలా తనకు తానే కాలి బూడిదయింది. తళుకుబెళుకులు రంగుల ప్రపంచంలో అమాయకమైన చిరునవ్వుల్ని మిగిల్చి తనని తాను అంతం చేసుకుని మరెన్నటికీ తిరిగిరాలేని దూర తీరాలకు తరలిపోయింది. సినీమాయలోకపు పాకుడురాళ్ల అంచున నిల్చుని నిలదొక్కుకోలేక అనంతానంత అగాధంలోకి జారిపోయి ప్రాణాలు కోల్పోయింది. ఆమె... విజయలక్ష్మి వడ్లపాటి.(సిల్క్​ స్మిత). నేడు ఆమె వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం.

1960 డిసెంబర్ 2న సిల్క్​ స్మిత జన్మించారు. 1996, సెప్టెంబర్ 23న మరణించారు. ఈ రెండు తేదీల మధ్య జీవితంలో కొంత భాగం వెండి తెరకు అంకితం చేశారు. ఏమాత్రం మోమాటం లేకుండా నర్తించి, నటించి, ఒళ్లు దాచుకోకుండా కనిపించి, కవ్వించి.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించేందుకు తనవంతుగా కృషి చేశారు. చారడేసి కళ్ళు పలికించే శృంగార నైషధాలు ఎన్నో? లిపి స్టిక్ రాసుకున్న పెదాల్లో పరుచుకున్న మంచు తుఫానులు ఇంకెన్నో? ఆకట్టుకునే శరీర సౌష్టవం... నడిచినా నర్తించినట్లనిపించే సోయగం... ముద్దు ముద్దు మాటలు.. కత్తిలాంటి పాటలు.. ఆమెకి తప్ప అనితర సాధ్యం. స్మిత.. సదా మందస్మిత. స్మితకు విశేషణంగా సిల్క్.. వెరసి సిల్క్ స్మిత.

వెండితెర వైభవం

సిల్క్ స్మిత ప్రధానంగా దక్షిణ భారత సినిమాల్లో నటించారు. మొదట సైడ్ యాక్ట్రెస్ గా కనిపించారు. 1979వ ఏడాదిలో 'వండి చక్రం' అనే తమిళ సినిమాలో 'సిల్క్' అనే పాత్రతో మొదటగా గుర్తింపు సంపాదించుకున్నారు. 1980లలో అత్యంత డిమాండ్ ఉన్న ఎరోటిక్ నటిగా గుర్తింపు పొందారు. 17 సంవత్సరాల సుదీర్ఘ సినిమా కెరీర్​లో, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో మొత్తం 450 సినిమాలకు పైగా నటించారు. సెప్టెంబర్ 23న చెన్నైలోని తన అపార్ట్మెంట్ లో ఆత్మహత్య చేసుకొన్నారు.

కుటుంబ నేపథ్యం

రామల్లు, సరసమ్మ దంపతులకు ఏలూరులో సిల్క్ స్మిత జన్మించారు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా పది సంవత్సరాల వయసులో నాలుగో తరగతితో విద్యకు స్వస్తి చెప్పారు. ఆమె రూపం ఎంతోమంది దృష్టిని ఆకర్షించేది. దాంతో, ఆమె చాలా ఇబ్బంది పడేవారు. చాలా చిన్న వయస్సులోనే స్మితకు వివాహం చేసేశారు ఆమె తల్లిదండ్రులు. భర్త, అత్తామావయ్యలు స్మితను వేధింపులకు గురి చేశారు. దాంతో, ఇంటి నుంచి స్మిత పారిపోయారు.

టచ్ అప్ ఆర్టిస్ట్ నుంచి టాప్ లెవెల్​కు

టచ్ అప్ ఆర్టిస్ట్ గా స్మిత తన కెరీర్​ను మొదలుపెట్టారు. చిన్న క్యారెక్టర్ రోల్స్​తో ఇండస్ట్రీలో బ్రేక్ సంపాదించుకున్నారు. ఆ తరువాత ఏవీఎం స్టూడియో సమీపంలో ఫ్లోర్ మిల్ డైరెక్టర్​గా పనిచేసే విను చక్రవర్తి స్మితను కనుగొన్నారు. అతను ఆమె పేరుని 'స్మిత'గా మార్చారు. అతని సంరక్షణలో స్మిత ఉండేవారు. అతని భార్య స్మితకు ఇంగ్లీష్ నేర్పారు. అలాగే స్మిత డాన్స్ నేర్చుకోవడానికి ఏర్పాటు చేశారు. అయితే తరువాత, తన సెక్స్ అప్పీల్ కారణంగా నైట్ క్లబ్బుల్లో, రెస్టారంట్లలో డాన్స్ చేసే పాత్రల్లో ఎక్కువగా నటించారు. తమిళ సినిమా 'వండి చక్రం' సినిమాలో 'సిల్క్' అనే ప్రాధాన్యత ఎక్కువున్న పాత్రలో నటించారు. ఈ పాత్ర వల్ల స్మితకు ఎక్కువ గుర్తింపు, ప్రశంసలు వచ్చాయి. ఆ తరువాత 'సిల్క్' అనే పదాన్ని తన పేరు ముందు పెట్టుకున్నారు స్మిత. అయితే, ఆ తరువాత ఆ తరహా పాత్రలే ఎక్కువగా సిల్క్ స్మితకు వచ్చాయి.

డాన్స్ నంబర్స్

తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, కొన్ని హిందీ సినిమాలలో స్మిత నటించారు. డాన్స్ నంబర్స్​తో, బోల్డ్ పెరఫార్మన్సెస్​తో దక్షిణ సినిమా పరిశ్రమలో ఎక్కువ జనారాధన సంపాదించుకొన్నారు. 'అమరం' అనే తమిళ సినిమాలో, 'హళ్లి మెష్ త్రు' అనే కన్నడ సినిమాలలో స్మిత ఐటెం సాంగ్స్ ని బాక్సాఫీసు వద్ద కూడా సెలెబ్రేట్ చేసుకున్నారు. కొంతమంది విమర్శకులు, జర్నలిస్టులు స్మితని 'సాఫ్ట్ పోర్న్' స్టార్ గా అభివర్ణించారు.

నర్తకే కాదు నటిగా కూడా

స్మిత కేవలం డాన్సర్ పాత్రలను మాత్రమే కాదు. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు కూడా పోషించారు. స్మిత నటనతో కూడా ఎక్కువ ప్రేక్షాదరణ పొందారు. నాన్ సెక్సువల్ పాత్రల్లో కూడా ప్రేక్షకులని, విమర్శకులని ఇంప్రెస్ చేశారు స్మిత. ఇండియన్ అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్మిత నటించిన 'లయనం' అనే మలయాళ సినిమా కల్ట్ స్టేటస్​ను సంపాదించుకొంది. ఎన్నో భాషల్లోకి డబ్ అయ్యింది ఈ చిత్రం. మలయాళంలో విడుదలైన పది సంవత్సరాల తరువాత హిందీలో 'రేష్మా కి జవానీ' అనే పేరుతో తెరకెక్కించారు. ఈ చిత్రం కూడా కల్ట్ స్టేటస్​ను సంపాదించుకొంది. బాలుమహేంద్ర దర్శకత్వం వహించిన 'వసంత కోకిల' సినిమా స్మిత కెరీర్​లో అత్యంత గౌరవనీయమైన చిత్రంగా నిలిచింది. ఇందులో శ్రీదేవి, కమల్ హాసన్ వంటి అగ్ర నటీనటులతో స్మిత స్క్రీన్ షేర్ చేసుకొన్నారు. సీతాకొక చిలుక, అభిమన్యుడు తదితర చిత్రాల్లో స్మిత అభినయం ఉన్న పాత్రల్లో మెరిశారు. హస్కీ వాయిస్​తో అలరించారు.

ఏకాకి జీవితం

సిల్క్ స్మితకు చాలా తక్కువ మందే స్నేహితులు. తాను ఎక్కువగా మాట్లాడేవారు కాదు. అలాగే ఎవరితోనూ అంత తొందరగా స్నేహం చేసేవారు కాదు. స్మిత ఉన్నది ఉన్నట్లు చెప్పేవారని ఫిల్మ్ సర్కిల్​లో ఓ టాక్ ఉంది. అలాగే స్మితకు కోపం కూడా తొందరగా వస్తుందని కూడా ఓ వార్త ప్రాచుర్యంలో ఉంది. వీటినే కొంతమంది పొగరని భావించేవారు. వృత్తి పట్ల నిబద్దత, సమయ పాలన, డెడికేషన్ ...ఇవీ స్మిత విజయ రహస్యాలు. తను ఆలస్యంగా ఎప్పుడూ షూటింగ్​కు వచ్చేవారు కాదు. వృత్తి పట్ల ఎంతో బాధ్యతగా ఉండేవారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేముందు మేకప్​నే వృత్తిగా తీసుకొన్నారు. మేకప్ లేకపోయినా సహజంగానే స్మిత ఎంతో అందంగా ఉండేవారు.

జీవితం విషాదాంతం

1996, సెప్టెంబర్ 23న తన స్నేహితురాలు, ప్రముఖ డాన్సర్ అయిన అనురాధతో తనను బాధపెడుతోన్న అంశం గురించి చర్చించడానికి కాంటాక్ట్ చేశారు. అయితే అప్పుడు అనురాధ తన పిల్లల్ని స్కూల్​లో దిగపెడుతున్నారు. ఆ కారణంగా, స్కూల్​లో తన పిల్లల్ని దిగబెట్టిన తరువాత తనని కలవడానికి వస్తానని అనురాధ స్మితతో అన్నారు.

అయితే, అదే రోజు కొన్ని గంటల తరువాత చెన్నైలోని తన ఇంట్లో చనిపోయి ఉన్నారు స్మిత. ఈ విషయం ఆమె అభిమానుల్ని ఎంతో కలవరపెట్టింది. ఇప్పటికీ స్మిత మరణం వెనుక ఉన్న కారణం ఓ మిస్టరీగానే మిగిలింది. కొంతమంది, సినిమా నిర్మాణంలో పెద్ద మొత్తంలో పెట్టి నష్టపోయినందుకు స్మిత ఆత్మహత్య చేసుకొన్నారని భావిస్తారు. మరికొంతమంది స్మిత ప్రేమించి విఫలమైన కారణంగా సూసైడ్ చేసుకున్నారని అనుకుంటున్నారు. ఆమె మరణించిన కొన్ని నెలలకు పోస్ట్ మోర్టమ్​లో స్మిత తన చీరతో ఫ్యాన్​కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారంటూ రిపోర్ట్ వచ్చింది.

స్మిత జీవితంపై సినిమా

2011లో ప్రముఖ హిందీ నిర్మాత ఏక్తా కపూర్, సిల్క్ స్మిత జీవితం ఆధారంగా 'ది డర్టీ పిక్చర్' అనే సినిమాను నిర్మించారు. మిలన్ లుథ్రియా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఇందులో విద్యాబాలన్ నటించారు. స్మిత పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమాను విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషలలో డబ్ అయింది. ఆ చిత్రాలు కూడా స్మిత పుట్టిన రోజు నాడే విడుదల అయ్యాయి. అనుకూలమైన రివ్యూస్ సంపాదించుకోగలిగింది ఈ సినిమా.

అయితే, స్మిత కుటుంబీకులు ఈ సినిమాతో సంతోషంగా లేరని కొన్ని వార్తలు వచ్చాయి. అలాగే స్మిత సోదరుడు వి. నాగవరప్రసాద్ తమని సంప్రదించకుండా, తమ అంగీకారం తీసుకోకుండా ఈ సినిమాను తెరకెక్కించారంటూ విమర్శించారు. ఈ కారణంగా, ఏక్తా కపూర్ వెంటనే సిల్క్ స్మిత జీవిత ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం లేదంటూ ఓ స్టేట్ మెంట్​ను విడుదల చేశారు. అది అప్పట్లో సంచలనం అయింది. విద్యాబాలన్​కి ఈ చిత్రం ద్వారా నటిగా మంచి పేరే వచ్చింది.

2013లో, కన్నడ భాషలో సిల్క్ స్మిత జీవితాధారంగా 'డర్టీ పిక్చర్: సిల్క్ సక్కత్ హాట్' అనే సినిమా రిలీజ్ అయింది. ఇందులో పాకిస్థానీ నటి వీణా మాలిక్ నటించారు. ఆమె తన అభినయానికి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. కర్ణాటకలో ఈ చిత్రం పెద్ద హిట్టయింది. అదే ఏడాది మలయాళంలో స్మిత జీవిత ఆధారంగా 'క్లైమాక్స్' అనే టైటిల్​తో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సిల్క్ స్మిత పాత్రలో సనా ఖాన్ నటించారు.

తెలుగులో స్మిత

తెలుగులో స్మిత నటించిన సినిమాలు ప్రేక్షకులకు ఎంతో గుర్తు. 'సీతాకొక చిలుక', 'యమకింకరుడు', 'ఖైదీ', 'గూఢచారి నెంబర్ 1', 'రోషగాడు', 'ఛాలెంజ్', 'రుస్తూం', 'హీరో', 'అగ్నిగుండం', 'చట్టంతో పోరాటం', 'శ్రీ దత్త దర్శనం', 'దొంగ', 'రాక్షసుడు', 'కిరాతకుడు', 'ఖైదీ నెంబర్ 786', 'గీతాంజలి', 'బామ్మా మాట బంగారు బాట', 'ఆదిత్య 369', 'చైతన్య', 'అంతం', 'బావ బావమరిది', 'కుంతి పుత్రుడు', 'గోవిందా గోవిందా', 'రక్షణ', 'ముఠామేస్త్రి', 'పల్నాటి పౌరుషం', 'చిలకపచ్చ కాపురం', 'మా ఆవిడ కలెక్టర్' వంటి ఎన్నో సినిమాలలో నటించారు. స్మిత మరణించి ఎన్నేళ్లయినా...ఆమె మిగిల్చిన కదిలే బొమ్మలు సజీవంగానే ఉంటాయి. సినిమా ప్రపంచంలో స్మిత మరపురాని, మరచిపోలేని తెరతారక. ఆ తారక ప్రేక్షకుల గుండెల్లో తళుక్కుమంటూనే ఉంటుంది.

ఇదీ చూడండి 'డ్రగ్స్ కేసులో దోషులను కఠినంగా శిక్షించండి'

ABOUT THE AUTHOR

...view details