ShyamSinghaRoy movie director: రాహుల్ సాంకృత్యాన్.. తెలుగు సినిమాలో మొదలైన కొత్త వెల్లువకి ఓ కొండగుర్తు! స్టార్లతో సినిమాలు చేసినా.. అందులో తనదైన ముద్రను బలంగా వేస్తున్నాడు. థ్రిల్లర్‌కు మానవీయ కోణంతోపాటూ మనదైన సంస్కృతినీ కలిపి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతున్నాడు. చేసింది మూడు సినిమాలే.. వేస్తున్నవి తొలి అడుగులే.. అయినా అతని ప్రయాణంలో యువత నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో ఉన్నాయి. కెరీర్‌లో దూసుకెళ్లలేక వెనక్కీ తగ్గలేక కొట్టుమిట్డాడేవాళ్లకి చుక్కాని కాగల రాహుల్ కథ అతని మాటల్లోనే..
2013.. హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్ క్యాంపస్ అది. మధ్యాహ్నం పన్నెండుగంటలకి నేను ఆఫీసులో అడుగుపెట్టగానే మా టీమ్‌లీడర్ 'రా.. నీ కోసమే వెయిటింగ్' అన్నాడు హడావుడి పెడుతూ. నేను అతణ్ణి అనుసరిస్తూ ప్రాజెక్ట్ పనిలో లీనమైపోయాను. అరవై నిమిషాలు ఆరు సెకన్లలా గడిచిపోయాయి. ఒంటిగంట కొట్టగానే నా ఫోన్ మోగడం మొదలైంది. 'సీన్ నంబర్ 45 ఇంకా పూర్తికాలేదు.. వస్తావా?' అంటున్నాడు మా డైరెక్టర్. 'బాబూ! నువ్వు తీసుకెళ్లిన బైకు స్టూడియో వాళ్లది. అది లేకుంటే ఇక్కడ పని నడవదు..!' అరుస్తున్నాడు ప్రొడక్షన్ మేనేజర్. ఈ ఫోన్ కాల్స్ మా షూటింగ్ స్పాట్ నుంచి. ఆ ఫోన్‌లతో పనిపైన దృష్టి పెట్టలేక 'ఆరుగంటల తర్వాత వచ్చి ప్రాజెక్ట్ చేస్తాను. ప్లీజ్..!' అని నా టీమ్‌లీడ్‌ను రిక్వెస్ట్ చేసుకున్నాను. లంచ్ కూడా చేయకుండా గచ్చిబౌలి ఇన్ఫోసిస్ క్యాంపస్ నుంచి హడావుడిగా బయల్దేరాను. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర యూటర్న్ చేస్తుండగా.. నా బైక్ హఠాత్తుగా గాల్లోకి లేచింది! నాకన్నా వేగంగా వస్తున్న కారు ఒకటి బలంగా ఢీకొట్టి వెళ్లిపోవడం.. గాల్లోకి లేచి ముందుకుపడ్డ నా శరీరం నుంచి 'ఫట్' మంటూ శబ్దం రావడం.. క్షణాల్లో జరిగిపోయాయి. ఆ తర్వాతేమైందో గుర్తులేదు. మళ్లీ నాకు మెలకువ వచ్చేటప్పటికి ఆసుపత్రిలో ఉన్నాను. మూణ్ణెళ్లు నాలుగ్గోడలకే పరిమితమైనా.. నా కెరీర్ ప్రయాణంలో అదో పెద్ద మలుపు. ఆ మలుపుకి అటూ-ఇటూ ఏమున్నాయో చెబుతాను..
కర్నూలు జిల్లా జిన్నుకమ్మవారిపల్లె మా సొంతూరు. మా తాతయ్య అక్కడ ఓ చిన్న పత్తిఫ్యాక్టరీ నడపడం వల్లే ఊరికి ముందు 'జిన్ను' అన్నది వచ్చి చేరిందంటారు. మా నాన్నవాళ్ల కాలానికి పరిశ్రమ మూతపడి.. ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. మానాన్న ప్రసాద్ కర్నూలు నగరంలోని బిర్లా నూనె ఫ్యాక్టరీలో ఉద్యోగిగా చేరాడు. అక్కడే ఆయనకు కమ్యూనిజంతో పరిచయం ఏర్పడింది. ఆ భావజాలంతో కులం మతం వంటి సామాజిక వ్యవస్థలను తీవ్రంగా విమర్శించేవాడు. బెంగాల్ కమ్యూనిస్టు నేత ప్రమోద్‌దాస్ గుప్తాపైన ఇష్టంతో మా అన్నయ్యకు ప్రమోద్ అనీ, ప్రఖ్యాత మార్క్సిస్టు చరిత్రకారుడు రాహుల్ సాంకృత్యాన్ మీద మక్కువతో ఆపేరు నాకూ పెట్టాడు. ఊహవచ్చాక నా తొలి జ్ఞాపకం.. నాన్న పుస్తకాల ర్యాక్‌లో అందంగా అమర్చిన పుస్తకాలు. పదమూడేళ్లప్పుడు వాటిలో నుంచి శ్రీశ్రీగారి మహాప్రస్థానం నా చేతికొచ్చింది. ఏమీ అర్థంకాకపోయినా.. ఆ కవితల్ని కంఠస్థంపెట్టి పాటలా పాడుకునేవాణ్ణి. ఇంటర్‌కు వచ్చేనాటికి చలం సాహిత్యం దాదాపుగా చదివేశాను. ఆ తర్వాత నా పేరే ఉన్న రాహుల్ సాంకృత్యాన్ పుస్తకాల్నీ ముగించేశాను. సమాజాన్ని అనేక ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరిచేసిన వీళ్ల సాహిత్యంతోపాటూ.. నాన్న చెప్పే కమ్యూనిస్టు కబుర్లు నాలో సామాజిక స్పృహకి కారణమయ్యాయి. ఆ సామాజిక స్పృహా, సాహిత్యంతో పరిచయం రెండూ కలిస్తే ఒకప్పుడైతే రచయితలయ్యే వారేమో కానీ.. మా తరంలోని వాళ్లందరూ షార్ట్‌ఫిల్మ్ మేకర్స్‌గా మారుతుండేవారు. నేనూ అదే చేశాను.
ఫస్ట్ 'షార్ట్'!
నేను అనంతపురంలో బీటెక్ చదివేటప్పుడు నా బ్యాచ్‌మేట్స్‌తో కలిసి తొలిసారి కెమెరా చేతిలోకి తీసుకున్నాను. మా ఫ్రెండ్ ఆలయం నేపథ్యంలో ఓ కథ చెబితే.. నాస్తికుణ్ణికదా.. దాన్ని శ్మశానం నేపథ్యంగా మార్చుకున్నాను. బీటెక్ తర్వాత ఇన్ఫోసిస్ మైసూరులో ఉద్యోగం వచ్చింది. హైదరాబాద్‌లోని ఓ షార్ట్‌ఫిల్మ్ సర్కిల్ పోటీ కోసం ఎంట్రీలని ఆహ్వానిస్తే నా సహోద్యోగులతో కలిసి 'థర్టీయత్ మైల్‌స్టోన్' అన్న షార్ట్‌ఫిల్మ్ తీశాను. షూటింగ్ పూర్తయ్యాక రాత్రింబవళ్లూ ఎడిటింగ్ చేస్తూ కూర్చునేవాణ్ణి. షార్ట్‌ఫిల్మ్ పోటీల ఎంట్రీ
పంపడానికి రేపు ఆఖరితేదీ అనగా.. ఆ ముందురోజూ నిద్రాహారాలు మాని పనిచేసి చివరి వెర్షన్ రూపొందించాను. ఆ వెర్షన్ ఉన్న సీడీని కొరియర్‌లో పంపుదామను కుంటూండగానే.. ఆ రోజు ఆదివారం కావడం వల్ల మైసూరులో కొరియర్ షాపులన్నీ మూతపడ్డాయి. అన్ని రోజుల శ్రమ వృథా అయిపోతుందన్న దిగులుతో పచ్చి మంచినీళ్లైనా ముట్టకుండా కొరియర్‌వాళ్ల కోసం పిచ్చిగా తిరిగాను. చివరికి ఓ షాపతణ్ని ప్రాధేయపడితే.. సీడీని హైదరాబాద్ పంపడానికి ఒప్పుకొన్నాడు. అతని చేతిలో కవర్ పెట్టి నిశ్చింతగా నడుచుకుంటూ వస్తుంటే జోరుగా వర్షం పడింది. ఎందుకో తెలియదు.. ఆ వర్షంలో తడుస్తూ ఏడ్చేశాను! ఆ కన్నీళ్లెందుకో అప్పట్లో నాకు అర్థం కాలేదు కానీ.. ఓ బిడ్డని ప్రసవించాక తల్లికొచ్చే ఆనందబాష్పాల్లాంటివనీ ఆ కన్నీళ్లే దర్శకుడిగా నాకు జన్మనిచ్చాయనీ ఇప్పుడు అనిపిస్తోంది.
భలే ఏమార్చారు..
సినిమా రంగంవైపు వెళ్లాలన్న నిర్ణయం తీసుకున్నాక.. ఉద్యోగాన్ని హైదరాబాద్‌కు బదిలీ చేయించుకున్నాను. ఎక్కడెక్కడో తిరిగి ఎవర్నెవర్నో అవకాశాలకోసం అడుగుతుంటే 'మేం సినిమా తీస్తున్నాం. నువ్వే ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌వి' అంటూ ఓ బ్యాచ్ తారసపడింది. ఇక వాళ్లతోనే ఉందామని వెళ్లిపోయాను. అదో పెద్ద హాలు.. కనీస వసతుల్లేని అందులోనే పదిమందిదాకా ఉండేవాళ్లం. 'ప్రొడ్యూసర్ ఇంకా డబ్బులివ్వలేదు. ఈలోపు నువ్వే సర్దు..' అని నా మొత్తం జీతం తీసుకునేవాడు ఆ బ్యాచ్ లీడర్. ఆ పదిమందికీ భోజనంతోపాటూ వాళ్ల జల్సాలకీ నేనే డబ్బులిచ్చేవాణ్ణన్నమాట. అలా జీతం ఐదురోజుల్లో హారతి కర్పూరమైపోతే.. వాళ్లతో కలిసి నేనూ పస్తులుండేవాణ్ణి. ఒక్క పూట నూడుల్స్ తినే పడుకునేవాణ్ణి. ఇంత చేసినా.. షూటింగ్ మొదలవుతుందా అంటే అదీ లేదు. అలా ఏడు నెలలు నా జీతం సంతర్పణ అయ్యాకకానీ.. నేనో మాయావలలో చిక్కుకున్నానన్న విషయం బోధపడలేదు. మోసపోయానన్న అవమానభారంతో అక్కడి నుంచి బయటపడ్డాను. ఆ తర్వాత హైదరాబాద్ ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నవాళ్లం కలిసి ఓ 'షార్ట్‌ఫిల్మ్ క్లబ్' పెట్టాం. ఆ క్లబ్ ద్వారానే 'చిత్రా.. ఐ లవ్యూ!' అనే షార్ట్ ఫిల్మ్ తీశాను. దాన్ని 'మా' టీవీ పోటీలకి పంపించాం. ఈలోపు నా ఫ్రెండ్ యువచంద్ర ప్రొడ్యూసర్‌గా 'సూపర్‌స్టార్ కిడ్నాప్' అనే సినిమా తీస్తుంటే.. అందులో చేరిపోయాను. ఉదయం ఏడుగంటలకి షూటింగ్ స్పాట్‌కి వెళ్లి ఆ తర్వాత ఇన్ఫోసిస్‌లో పనిచూసుకుని.. మధ్యాహ్నం తర్వాత షూటింగ్‌లో కలుసుకుని.. మళ్లీ ఆఫీసుకి వచ్చి.. రోజంతా ఇలాగే తిరిగేవాణ్ణి. అలా ఓ రోజు ఆఫీసు నుంచి షూటింగ్‌కు వెళుతున్నప్పుడే ఆ ప్రమాదం చోటుచేసుకుంది. కాళ్లు రెండూ విరిగిపోయి. నా గదికే పరిమితమైపోయాను. ఆ రోజుల్లో నాకు పదేపదే ఒకే ఆలోచన వస్తుండేది. 'ఇప్పుడైతే ప్రాణాలతో బయటపడ్డాను కానీ... ఈ ప్రమాదంలో నేను చనిపోవడానికి 80 శాతం ఛాన్స్ ఉంది. జీవితం ఇంత అస్థిరమైనప్పుడు.. ఇక్కడ మనకిష్టమైన పనే చేస్తూ చనిపోవచ్చు కదా?' అనిపించేది. ఓ రోజు అమ్మతో 'ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాలపైనే దృష్టి పెడతాను!' అని చెప్పాను.