'ఉప్పెన'తో ఎగసిన యువ అందం కృతిశెట్టి. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ఆ చిత్రంలో 'బేబమ్మ'గా ఆకట్టుకుందీ 18 ఏళ్ల ముద్దగుమ్మ. 'ఉప్పెన'లో పల్లెటూరి అమ్మాయిగా కనిపించిన కృతి.. 'శ్యామ్ సింగరాయ్'లో మోడ్రన్ గాళ్‌గా మెరిసింది. ఈ నేపథ్యంలో కృతిశెట్టి మీడియాతో ముచ్చటించింది. ఆ సినిమాతో పాటు మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.
‘ఉప్పెన’లో బేబమ్మ, ‘శ్యామ్ సింగ రాయ్’లో కీర్తి.. ఈ రెండు పాత్రల ప్రయాణం ఎలా సాగింది?
కృతి శెట్టి: ‘బేబమ్మ’, ‘కీర్తి’ మధ్య ఎలాంటి పోలికలూ ఉండవు. ‘బేబమ్మ’లా కనిపించేందుకు సంపద్రాయం గురించి తెలుసుకోవాలని, పల్లెటూరి అమ్మాయిగా ఆకట్టుకోవాలని చాలా తెలుగు సినిమాలు చూశా. కీర్తి పాత్ర కోసం కోసం ఇంగ్లీష్ సినిమాలు, మోడ్రన్ అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసుకుని, నా స్టైల్లో నటించా.
కీర్తి పాత్ర పోషించేటప్పుడు ఏది ఛాలెంజింగ్‌గా అనిపించింది?
కృతి: స్మోకింగ్ సీన్స్‌లో నటించడం (నవ్వులు). వాస్తవానికి నాకు స్మోకింగ్ అంటే అసహ్యం. మొదట్లో దర్శకుడు రాహుల్ కథ చెబుతున్నప్పుడే స్మోకింగ్ సీన్స్ తీసేయొచ్చుగా అన్నా. ‘అది కీర్తి, నువ్వు కృతి.. ఇద్దరి మధ్య ఉండే తేడా అదే కదా’ అన్నారు. అందులో నేను కాల్చింది నికోటిన్ లేని హెర్బల్ సిగరెట్. అది నాకోసం స్పెషల్‌గా తీసుకొచ్చారు. మొదటిసారి పట్టుకున్నప్పుడు నా చేయి వణికింది. ఆ తర్వాత సిగరెట్లను తాగడం మూడు రోజులు ప్రాక్టీస్ చేశా. కాస్త తేలిక అయింది.
తొలి చిత్రంలో అందరూ కొత్తే.. ఇందులో అందరూ అనుభవం ఉన్న నటులతో పనిచేయడం ఎలా అనిపించింది?
కృతి: నానితో నటించడమంటే మొదట్లో భయం వేసింది. సెట్‌లో అడుగుపెట్టాక ఆ భయం పోయింది. సెట్‌లో ఆయన ఎంతో ప్రోత్సహించేవారు. ఎవరి నటన బాగోకపోయినా ఎవర్నీ నొప్పించకుండా అర్థమయ్యేలా చెప్తారు. ప్రతి ఒక్కరి నటననూ పరిశీలించి మార్పులు చేర్పులు సూచిస్తారు. ఆయనిచ్చే సపోర్ట్ వల్లే సీన్స్ అంత బాగా పండాయి.
ఇందులో కొన్ని బోల్డ్ సీన్స్‌లో నటించారు. దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి?
కృతి: బోల్డ్ సీన్స్ అంటే అందరూ చెడు ఉద్దేశంతో చూస్తారు. ఏం చేసినా అంతా వృత్తిపరంగానే చూస్తా. ఏది చేసినా అది యాక్టింగ్. యాక్షన్ సీన్స్‌లో ఎంత కష్టపడతామో ఇవీ అంతే. అన్ని సీన్లలోనూ నటించినట్టే ఆ సన్నివేశాల్లోనూ నటిస్తాం. ఇండస్ట్రీలోకి రాకముందు నేను ఎక్కువగా సినిమాలు చూడలేదు. కథలో ఆ సీన్స్ అవసరం అనిపిస్తేనే చేస్తా. లేదంటే చేయను. ‘శ్యామ్ సింగరాయ్’లో నాకు నానికి మధ్య వచ్చిన బోల్డ్ సీన్ కథ డిమాండ్ చేసింది. కథకి ఆ సీన్‌కి సంబంధం ఉంది కాబట్టే చేశా.
కీర్తి పాత్రకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది. ఎవరిచ్చారు?
కృతి: నాన్న చూసి చాలా బాగా చేశావని మెచ్చుకున్నారు. ఆయన షూటింగ్‌కు రాలేదు. లుక్ గురించి పెద్దగా తెలియదు. చాలా కొత్తగా ఉందన్నారు.
‘ఉప్పెన’లో బేబమ్మతో పోలిస్తే కీర్తి పాత్రలో పెద్దగా నటించే అవకాశం లేదు. అయినా ఎందుకు ఒప్పుకొన్నారు?
కృతి: ‘ఉప్పెన’లో నటించేందుకు ఎక్కువ స్కోప్ ఉంది. కానీ, ఇందులో నాలోని ఇంకో కోణాన్ని చూపించే అవకాశం వచ్చింది. ఉప్పెన తరువాత అన్నీ పల్లెటూరి పాత్రలే వచ్చాయి. అందుకే వాటిని నిరాకరించా. పాత్ర పరంగా కీర్తి అంతా కొత్త లుక్, కొత్త పాత్ర అని చేశా. ఇదొక డిఫరెంట్ రోల్. ఛాలెంజింగ్‌గానూ అనిపించింది. అందుకే చేశా. నాకెక్కువ భిన్నపాత్రలు చేయాలని ఉంటుంది.