Shyamsingha Roy: 'శ్యామ్ సింగరాయ్'తో రెండేళ్ల తర్వాత విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నటుడు నాని. ఇంటెన్స్ ప్రేమకథతో తెరకెక్కిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రమిది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారమవుతోన్న ఈ చిత్రం ప్రేక్షకులకు మరింత చేరువైంది. దీంతో ఈ ప్రేమకథా చిత్రం తమకెంతగానో నచ్చిందని అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా శ్యామ్‌సింగరాయ్, రోజీ సింగరాయ్‌ల ప్రేమకథ తమని ప్రభావితం చేసిందని అందరూ మెచ్చుకుంటున్నారు.
కాగా, 'శ్యామ్ సింగరాయ్' చూసిన కొంతమంది స్టూడెంట్స్ ఆన్‌లైన్ క్లాస్‌లో లెక్చరర్‌ని కాస్త ఇబ్బందిపెట్టారు. ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఆన్‌లైన్ క్లాస్‌లో ఓ విద్యార్థి తన ఐడీని శ్యామ్ సింగరాయ్‌గా మార్చుకున్నాడు. 'ఇది నిజంగానే మీ పేరా? లేక సినిమా పేరుని మీ ఐడీగా పెట్టుకున్నారా?' అని లెక్చరర్ అడగ్గా.. అది తన పేరేనని, తన సతీమణి రోజీ సింగరాయ్ కూడా క్లాస్‌లోనే ఉందని, తమని కలపాల్సిన బాధ్యత లెక్చరర్‌దేనని అన్నాడు. అంతటితో ఆగకుండా తాను పునర్జన్మ ఎత్తానంటూ సినిమా కథ చెప్పాడు. ఇది మొత్తం విన్న లెక్చరర్ చేసేది ఏమీ లేక.. క్లాస్ అయ్యాక పర్సనల్‌గా మాట్లాడదామని అన్నాడు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్‌ని ఓ నెటిజన్ 'శ్యామ్ సింగరాయ్' చిత్రబృందాన్ని ట్యాగ్ చేస్తూ 'ఆన్‌లైన్ క్లాస్‌లో శ్యామ్ సింగరాయ్' అంటూ ట్విటర్‌లో షేర్ చేశాడు. అది చూసిన చిత్ర దర్శకుడు రాహుల్.. "వాట్" అంటూ షాక్ అయ్యారు. అయితే, ఈ ఆడియోని సరదాగా క్రియేట్ చేశారా? నిజంగానే ఇలాంటి సంఘటన జరిగిందా? అనేది తెలియనప్పటికీ నెటిజన్లు మాత్రం దీన్ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.