దక్షిణాది తెరకు దూరమైన నటి శ్వేతాబసు ప్రసాద్.. బాలీవుడ్లో మాత్రం ఆఫర్లు దక్కించుకుంటోంది. 2017 నుంచి ఏడాదికి ఓ సినిమా చొప్పున చేస్తోంది. అంతేకాకుండా వెబ్ సిరీస్‌ల్లోనూ తన నటనతో ఆకట్టుకుంటోంది. తాజాగా 'కామెడీ కపుల్' అనే సినిమాలో నటించేందుకు పచ్చజెండా ఊపేసింది.
షకీబ్ సలీం, శ్వేతాబసు ప్రసాద్ ఇందులో హిందీ నటుడు షకీబ్ సలీంతో కలిసి కనువిందు చేయనుంది. రొమాన్స్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని నచికేత్ సమంత్ తెరకెక్కిస్తున్నాడు. యోడ్లే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. పూర్తి తారాగణం, సాంకేతిక బృందం వివరాలు త్వరలో ప్రకటిస్తామని చెప్పింది చిత్రబృందం.
దర్శకుడు నచికేత్ గతంలో మరాఠీ చిత్రాలు 'గచ్చీ', 'హబడ్డీ', 'గుడ్ బడ్డీ గడ్బడీ' వంటి సినిమాలు తెరకెక్కించాడు. అయితే 'కామెడీ కపుల్' ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నాడు.
ప్రస్తుతం శ్వేత.. 'డాక్టర్.డాన్' అనే వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తోంది. ఇందులో రేఖ అనే లాయర్ పాత్ర పోషిస్తోంది. షకీబ్ చివరిగా సల్మాన్ నటించిన 'రేస్-3', కబీర్‌ఖాన్ స్పోర్ట్స్ డ్రామా '83'లోనూ నటించాడు. 1983 ప్రపంచకప్ నేపథ్యంలో సాగే ఈ కథలో ఆల్‌రౌండర్, వైస్ కెప్టెన్ మెహిందర్ అమర్నాథ్గా నటించాడు. ఇప్పటికే నిర్మాణపనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. కరోనా కారణంగా విడుదల వాయిదాపడింది.