తొలిసారి స్క్రీన్ మీద కనపడినప్పుడు ప్రేక్షకులు ఆమెను 'ఇష్టం'గా అక్కున చేర్చుకున్నారు. ఆమె నవ్వితే చాలు ప్రేక్షకుల గుండెల్లో 'సంతోషం' కలుగుతుంది. మా అభిమాన నటివి 'నువ్వే నువ్వే' అని ఆమెనే చూపించారు టాలీవుడ్ ప్రేక్షకులు. కుర్రకారులైతే నీమీద ప్రేమను 'ఎలా చెప్పను' అని మనసునే పారేసుకున్నారు. అందుకే నీ ప్రతీ సినిమాకూ అభిమానంతో 'నేనున్నాను' అని ప్రతి ప్రేక్షకుడూ ఆమెతో అన్నారు. ఇంతలా ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసిన తాను ఇంకెవరో కాదు.. శ్రియ శరన్ భట్నాగర్. అందం, అభినయం, ఆకర్షణ ఆమె సొంతం. నేడు శ్రియ 39వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం..
నేపథ్యం
శ్రియ పూర్తి పేరు శ్రియ శరన్ భట్నాగర్. పుష్పేంద్ర శరన్ భట్నాగర్, నీరజా శరన్ భట్నాగర్ దంపతులకు 1982 సెప్టెంబర్ 11న దెహ్రాదూన్‌లో శ్రియ జన్మించింది. తండ్రి భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో పని చేసేవారు. తల్లి కెమిస్ట్రీ టీచర్. శ్రియకు అభిరూప్ అనే సోదరుడు ఉన్నాడు. అతడు ముంబయిలో నివసిస్తున్నాడు. ఈ నటి బాల్యం ఎక్కువగా హరిద్వార్‌లో సాగింది. అక్కడ బీఎచ్ఈఎల్ కాలనీలో వీరి కుటుంబం ఉండేది. దిల్లీలోని లేడీ శ్రీరామ్ కళాశాలలో సాహిత్యంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పొందింది. శ్రియ మొదట తల్లి నీరజా శరన్ దగ్గరే కథక్, రాజస్థానీ ఫోక్ డాన్స్ నేర్చుకుంది. ఆ తర్వాత షోవన నారాయణ్ దగ్గర కథక్ డాన్స్‌ను అభ్యసించింది. కళాశాలలో తన గురువుతో ఎన్నో నాట్య బృందాలలో పాల్గొనేది.
ఉషాకిరణ్‌లో ఇష్టంగా
కళాశాలలో చదువుతున్నప్పుడు శ్రియకు మొదటిసారిగా కెమెరా ముందు కనిపించే అవకాశం వచ్చింది. నాట్య గురువు సిఫార్సుతో ఒక మ్యూజిక్ వీడియోలో అవకాశాన్ని దక్కించుకోగలిగింది శ్రియ. బనారస్‌లో షూట్ చేసిన ఈ వీడియో రామోజీ ఫిలింస్ దృష్టిలో పడింది. దాంతో 'ఇష్టం' సినిమాలో నేహా పాత్రలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకోగలిగింది. అయితే, ఈ సినిమా విడుదల కాకముందే నాలుగు సినిమాల్లో నటించే అవకాశాన్ని సంపాదించింది. వాటిలో 'నువ్వే నువ్వే' సినిమా కూడా ఉంది. 'సంతోషం' సినిమా శ్రియకు మొదటి కమర్షియల్ విజయాన్ని అందించింది.
బాలీవుడ్‌లోకి
మొదటిసారి 'తుజే మేరీ కసం' అనే సినిమాతో హిందీ పరిశ్రమలో అడుగుపెట్టింది శ్రియ. ఈ చిత్రంలో రితేష్ దేశముఖ్, జెనీలియా డిసౌజ హీరోహీరోయిన్లుగా నటించారు. తెలుగులో శ్రియ నటించిన 'ఠాగూర్' సినిమా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల వేడుకలో ప్రదర్శనకు నోచుకుంది. అలాగే ఈ సినిమా వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఆ తరువాత తమిళ్లో ఎనక్కు 20 ఉనక్కు 18 (నీ మనసు నాకు తెలుసు) సినిమాలో తరుణ్, త్రిషలతో స్కీన్ర్‌ని షేర్ చేసుకుంది. ఈ చిత్రంలో శ్రియ ఫుట్‌బాల్ కోచ్‌గా నటించింది. 'నేనున్నాను' సినిమాలో క్లాసికల్ గాయనిగా శ్రియ కనిపించింది.
2005లో 10 సినిమాలు విడుదల