బాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారంపై దుమారం చెలరేగుతోంది. ఈ విషయమై మంగళవారం రాజ్యసభలో సీనియర్ నటి జయాబచ్చన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది హీరోయిన్ కంగనా రనౌత్. అలా మాట్లాడటం సరికాదని చెప్పింది. చిత్ర పరిశ్రమకు చెందిన వారిపై కరుణ చూపాలని కోరింది.
"జయ బచ్చన్ జీ నా స్థానంలో మీరు కూతురు శ్వేతా, తనయుడు అభిషేక్ బచ్చన్ ఉన్నా ఇలానే మాట్లాడతారా? బెదరింపులు, వేధింపులకు.. నిరంతరం వారు గురవుతున్నా.. చివరికి ఎటువంటి పరిష్కారం దొరకక ఉరి వేసుకున్నా.. మీ సమాధానం ఇలానే ఉంటుందా? దయచేసి పరిశ్రమకు చెందిన వారిపై కాస్త కరుణ చూపండి" అంటూ ట్వీట్ చేసింది.
బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగం విపరీతంగా ఉందని భోజ్పురి నటుడు, భాజపా ఎంపీ రవి కిషన్ సోమవారం పార్లమెంట్ సమావేశాల్లో అన్నారు. ఈ వ్యాఖ్యలపై సమాజ్వాది పార్టీ ఎంపీ జయాబచ్చన్ తీవ్రంగా మండి పడ్డారు. "అన్నం పెట్టిన చేతినే నరుక్కున్నట్లుగా ఉంది" అంటూ మంగళవారం రాజ్యసభలో మాట్లాడారు. లోక్సభలో చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తే ఈ ఆరోపణలు చేయడం ఎంతో సిగ్గుగా ఉందన్నారు.
ఈ వ్యాఖ్యలపై దీటుగా బదులిచ్చారు రవి కిషన్. జయాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. చిత్రపరిశ్రమలో ఎవరి అండా లేకుండానే 600 చిత్రాల్లో నటించి ఎదిగానని గుర్తు చేశారు.