అశ్లీల చిత్రాల వ్యాపారం కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. మంగళవారం వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాకు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధిస్తూ నిర్ణయం తీసుకుంది కోర్టు. దీంతో అతడి నుంచి పోలీసులు మరింత సమాచారం సేకరించేందుకు రెడీ అవుతున్నారు. అలాగే కుంద్రా సతీమణి, ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి ఈ కేసు విషయంలో ఇంకా క్లీన్ చిట్ లభించలేదని క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
"ఈ కేసులో శిల్పాశెట్టికి ఇంకా క్లీన్ చిట్ లభించలేదు. ఫోరెన్సిక్ ఆడిటర్లు బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్నారు. హాట్‌షాట్ యాప్ ప్రదీప్(కుంద్రా బావమరిది) పేరు మీదే ఉన్నా.. దీని మొత్తం వ్యవహారాన్ని రాజ్‌కుంద్రానే చూస్తున్నారు. కుంద్రా అరెస్టు తర్వాత పలువురు మా వద్దకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ కేసు విషయంలో రూ.6 కోట్ల విలువ గల అరవింద్ శ్రీవాత్సవ్ అనే వ్యక్తి బ్యాంకు ఖాతాలను నిలిపివేశాం. తన ఖాతాలను అతడు పునరుద్ధరించాలని కోరినా.. మొదట పోలీసులు ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించాం. అలాగే నటి షెర్లిన్ చోప్రాకు సమన్లు పంపించాం."