బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ బలన్మరణం చెంది నెలరోజులు గడుస్తున్నా... ఇంకా బంధుప్రీతి (నెపోటిజం) అంశంపై చర్చకు తెరపడలేదు. స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సహా పలువురు నటీనటులు.. హిందీ చిత్రసీమలో బంధుప్రీతి, పక్షపాతం ఉన్నాయని ఆరోపించారు. స్టార్స్ వారసులకు మాత్రమే అవకాశాలు ఇస్తున్నారని, సినీ నేపథ్యం లేనివారిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. అయితే జూలై 18న ప్రముఖ దర్శకుడు బల్కి దీనిపై స్పందించారు.
అలా అనడం మూర్ఖత్వం!
నెపోటిజం అన్ని రంగాల్లో ఉంటుందన్న బల్కి.. దాని ప్రభావం ఎవరి మీదా పెద్దగా పడదని అన్నారు. స్టార్ వారసులైన మాత్రాన వారిలో నైపుణ్యం లేనిదే ఎదగలేరన్నాడు. అయినా తల్లిదండ్రుల నుంచి వారి వృత్తిని పిల్లలు వారసత్వంగా తీసుకోవడాన్ని బంధుప్రీతి అనడం సరికాదన్నారు. స్వేచ్ఛాయుత సమాజంలో ఉన్న వ్యక్తులు ఈ విధంగా భావించడం మూర్ఖత్వమని అభిప్రాయపడ్డారు.
ఆలియా, రణ్‌బీర్‌కు మించిన వారు
స్టార్ హీరోయిన్ ఆలియా భట్, హీరో రణ్‌బీర్ కపూర్‌కు మించిన నటులు ఎవరైన ఉన్నారా? అంటూ సవాల్ విసిరారు బల్కి. ప్రస్తుతం దీనిపై సామాజిక మాధ్యమాల్లో ఓ మినియుద్ధమే జరుగుతోంది.