సున్నితమైన ప్రేమకథలతో ఇటు యువతరంతో పాటు అటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా సినిమాలు తీయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది(Shekhar Kammula Movies) అందెవేసిన చేయి. ఆయన చిత్రాలన్నీ మంచి కాఫీలా మనసుకు ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. జ్ఞాపకాల ఊసుల్లో హాయిగా ఊరేగిస్తుంటాయి. ఇప్పుడాయన తన మెగాఫోన్‌తో వెండితెరపై ఆవిష్కరిస్తున్న మరో అందమైన ప్రేమకథ 'లవ్‌స్టోరి'(Love Story Release Date). నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రమిది. నారాయణ దాస్.కె.నారంగ్, పుస్కూర్ రామ్మోహన్‌రావు నిర్మించారు. ఈ సినిమా ఈనెల 24న(Love Story Release Date) ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు శేఖర్ కమ్ముల.
'లవ్‌స్టోరి'కథకు 'లీడర్' సినిమాతోనే బీజం పడింది. ఆ చిత్రంలో నేనెక్కువ ఫోకస్ చేసింది రాజకీయాల్లోని అవినీతినే. రాజకీయాల్లో నాణేనికి మరోవైపు కులం ఉంటుంది. ఆ సినిమాలో దాన్ని కాస్త టచ్ చేసి వదిలేశాను. ఈ అంశాన్ని పూర్తిస్థాయిలో స్పృశిస్తూ ఓ చిత్రం చేయాలని అప్పటి నుంచే అనుకుంటుండేవాడ్ని. నిర్భయ ఘటన తర్వాత లింగ వివక్షపైనా చర్చించాలి అనిపించింది. చాలా రోజులుగా నా మనసులో నానుతూ వస్తున్న ఇలాంటి అంశాలన్నింటి నేపథ్యం నుంచి పుట్టుకొచ్చిన కథే 'లవ్‌స్టోరి'.
నా కథలన్నీ అలా పుట్టినవే..
'నేను పుస్తకాలు చదువుతా.. ఆ కథల్ని ఆస్వాదిస్తా. అలాగని వాటి నుంచి ఓ కథ రాయాలని అనుకోను. సినిమాలైనా అంతే. నచ్చితే చూస్తా.. దాన్ని అక్కడితోనే వదిలేస్తా. నా కథలు.. అందులోని భావోద్వేగాలు.. అన్నీ నేను చుట్టూ చూసిన జీవితాల నుంచే తీసుకుంటుంటా. అందరూ 'మీకంటూ ఓ మార్క్.. స్టైల్ ఉంది' అంటుంటారు. నిజానికి వాటిని నేనసలు నమ్మను. ఏ దర్శకుడైనా తన మార్క్ ఇది. ఇలాగే తీయాలని చూడరు. భావోద్వేగభరితంగా కథనం ముందుకు నడిపించగలిగితే.. ఎవరు ఏ కథ తీసినా అందంగానే ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు వాళ్లను వాళ్లు మర్చిపోయి తెరపై పాత్రలతో ప్రయాణం చేసేలా చేయగలగాలి. అలా చేసి చూపగలిగితే చాలు.. ఏ దర్శకుడైనా విజయం సాధించినట్లే'.
అలాంటి కథలు రావాలి..
'ఇటీవల వస్తున్న చిత్రాల్లో తెలుగు భాషలోని వివిధ యాసల సొగసు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. జానపదాలు వినిపిస్తున్నారు. కథలకు మట్టి పరిమళాలు అద్దుతున్నారు. ఇది మంచి పరిణామం. నిజానికి ఇదెప్పుడో జరగాల్సింది. భాష, యాసలతో పాటు అందులోని సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కథలు.. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదోడు, రైతులు ఇలా ప్రతిఒక్కరి జీవితాల్ని వాస్తవికంగా ఆవిష్కరిస్తూ న్యాయం చేసే కథలు మరిన్ని రావాలి. ఈ పరిణామం ఇప్పటికే వేరే భాషల్లో ఉంది. ఇప్పుడిప్పుడే తెలుగులోనూ ఆ ఒరవడిని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలంగాణ యాసపై పట్టుంది. అందుకే నా చిత్రాల్లో తెలంగాణ సొగసు ఎక్కువ కనిపిస్తుంది'.
విభిన్నమైన జానర్‌లో ధనుష్