సంగీతం పరంగా ప్రత్యేకమైన అభిరుచి ఉన్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన సినిమాల్లో పాటలు ప్రేక్షకుల్ని అలరిస్తుంటాయి. 'ఫిదా'లో 'వచ్చిండే'.. పాట ఉర్రూతలూగించింది. ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. శేఖర్ కమ్ముల కొత్త చిత్రం 'లవ్‌స్టోరి' పాటలూ సినిమాపై అంచనాల్ని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఇందులోని 'సారంగ దరియా..' పాట యూట్యూబ్‌లో కొత్త చరిత్రని సృష్టించింది. ఈ పాట లిరికల్ వీడియో విడుదలైన 32 రోజుల్లోనే 10 కోట్ల వ్యూస్‌ని సొంతం చేసుకుంది. దక్షిణాదిలో ఇంత తక్కువ సమయంలో ఆ మైలురాయిని అందుకున్న ఘనత మరే లిరికల్ వీడియోకి దక్కలేదు. ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందించారు.
"మంచి ఊపు, జోష్ ఉన్న పాట ఇది. కచ్చితంగా విజయవంతం అవుతుందని ఊహించా. కానీ ఈ స్థాయికి వెళుతుందని అనుకోలేదు. ఈ పాట విజయం సినిమాపై మరిన్ని అంచనాల్ని పెంచింది. 'ఫిదా'లోని 'వచ్చిండే..' పాట సినిమా విడుదలైన తర్వాత విజయవంతమైంది. కానీ 'సారంగ దరియా' పాట లిరికల్ వీడియోకే ఇంత మంచి స్పందన రావడం పట్ల నాకూ, మా బృందానికి ఎంతో ఉద్వేగంగా ఉంది."
-శేఖర్ కమ్ముల, దర్శకుడు
మూడేళ్ల కిందే అనుకున్నా
"నా ప్రతి సినిమాలోనూ తెలంగాణ నేపథ్యంలో ఏదో ఒక పాత్ర తప్పకుండా ఉంటుంది. నేను హైదరాబాద్‌లోనే పెరిగాను కాబట్టి నా భాష ఇంచుమించు అలాగే ఉంటుంది. జానపదాలూ బాగా వింటుంటా. కొన్ని పాటల్ని వింటున్నప్పుడే వీటిని సినిమాలో పెడితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. జానపదాలపై ఇష్టంతో సినిమా కోసం ప్రత్యేకంగా ఆ గీతాల్ని తయారు చేయించుకోవచ్చు. మూడేళ్ల కిందటే 'సారంగ దరియా' పాట విన్నా. అవకాశం వస్తే కచ్చితంగా నా సినిమాలో వినిపించాలనుకున్నా. 'సారంగ దరియా'కి తగ్గ సందర్భం 'లవ్‌స్టోరి'లో ఉండటం వల్ల ఆ పాటని ఇందులో వాడాం. ఈ పాటకి గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ ఓ కొత్త భాష్యం చెప్పారు. తనదైన ముద్రతో బాగా రాశారు. సంగీత దర్శకుడు పవన్‌కి ఇది తొలి సినిమానే అయినా జానపదాన్ని అర్థం చేసుకుని, బాణీని కట్టారు. మంగ్లీ గానం, సాయిపల్లవి డ్యాన్స్ పాటకి ఆకర్షణని తీసుకొచ్చాయి. నృత్య దర్శకుడు మంచి స్టెప్పులు చేయించారు. లిరికల్ వీడియో కంటే పది రెట్లు ఎక్కువ స్పందన వీడియో గీతానికి లభిస్తుందని ఊహిస్తున్నా" అన్నారు శేఖర్ కమ్ముల.
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరి’ ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది.