తెలంగాణ

telangana

By

Published : Feb 8, 2020, 6:43 PM IST

Updated : Feb 29, 2020, 4:10 PM IST

ETV Bharat / sitara

రీమేక్​ అవసరమా అని అనిపించింది: శర్వానంద్

'జాను' సినిమా ప్రేక్షకాదరణ పొందుతున్న సందర్భంగా విలేకర్లతో ముచ్చటించాడు హీరో శర్వానంద్. ఈ చిత్రం విషయంలో జరిగిన కొన్ని ఆసక్తికర అంశాల్ని పంచుకున్నాడు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్​ను ప్రస్తుతం తాను అనుసరిస్తున్నానని అన్నాడు.

రీమేక్​ అవసరమా అని అనిపించింది: శర్వానంద్
హీరో శర్వానంద్

వెండితెరకు పరిచయమైన నాటి నుంచి నేటి వరకూ విభిన్న పాత్రలు.. వినూత్నమైన కథలతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న నటుడు శర్వానంద్‌. సినిమా సినిమాకు తనలోని నటుడిని సినీ ప్రియులకు మరింత కొత్తగా పరిచయం చేస్తున్నాడు. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'జాను'. తమిళంలో క్లాసిక్ '96' సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిన్న(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో శర్వానంద్‌ విలేకర్లతో ముచ్చటించాడు.

జాను సినిమా గురించి మాట్లాడుతున్న శర్వానంద్

అవసరమా అనిపించింది

రాజన్న (దిల్‌రాజు) నాకు ఒక రోజు '96' సినిమా చూపించారు. చూడడం అయిపోయాక.. నీ అభిప్రాయం ఏంటి? అని అడిగారు. "96' మంచి క్లాసిక్‌ మూవీ' అని చెప్పాను. వెంటనే ఈ సినిమా రీమేక్‌లో నువ్వు నటిస్తున్నావు అన్నారు. 'అది మంచి క్లాసిక్‌ మూవీ.. అన్నా. ఇద్దరు పెద్ద స్టార్స్‌ చేశారు. చాలా బాగా నటించారు. రీమేక్‌ చేయడం అవసరమా' అని అడిగాను. 'నీకు కథ నచ్చింది కదా. కాబట్టి నువ్వు ఈ సినిమాలో చేస్తున్నావ్‌' అని అనేశారు. నాకు దిల్‌రాజు నిర్ణయం మీద పూర్తి నమ్మకం ఉంటుంది. అందుకే ఆయన అడిగిన కొంత సమయానికే ఓకే చెప్పేశాను. సినిమా ఓకే చేశాక మూడు నెలలకు 'జాను' షూటింగ్‌ ప్రారంభించారు. '96' చిత్రాన్ని ఒక్కసారే చూశాను. అదీ కథ గురించి తెలుసుకోడానికి అంతే. షూటింగ్‌ ప్రారంభమయ్యాక ఆ సినిమా చూడలేదు.

జాను సినిమాలోని ఓ సన్నివేశం

ప్రతి సీన్‌కు ఓ కథ

తమిళంలో తెరకెక్కిన '96' సినిమాలో విజయ్‌ సేతుపతి పోషించిన రామ్‌‌ పాత్రను తెలుగులో నేను చేశాను. ఈ పాత్రను పోషించడానికి ముందు నేను ఎలాంటి హోంవర్క్స్‌ చేయలేదు. మా డైరెక్టర్‌ ప్రేమ్‌కుమార్‌ ఏం చెబితే అదే చేసేవాడిని. ఎందుకంటే ఆయనకు రామ్‌ పాత్ర గురించి పూర్తి అవగాహన ఉంది. అలాగే ప్రతి సీన్‌కు ముందు అసలు ఆ సీన్‌కు ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌ కథను వివరించేవారు. అలా నేను ఈ సినిమాలో ఆయన చెప్పినట్లు నటించాను.

బాగా కష్టపడ్డాను

'96' గురించి తెలుసుకున్నప్పుడు కేవలం ఒక్క రాత్రిలోనే సినిమా అంతా అయిపోతుంది కదా, చాలా ఈజీ అని అనుకున్నాను. కానీ ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో ఎక్కువ కష్టపడిన సినిమా.. 'జాను'. ట్రావెల్‌ ఫొటోగ్రాఫర్‌ నిజజీవితంలో ఎలా ప్రయాణాలు చేస్తారో.. అలా ఈ సినిమా కోసం 20 రోజులు పాటు కెన్యా, మాల్దీవుల్లో ప్రయాణించాం. ఆ సమయంలోనే యాక్సిడెంట్‌ అయ్యింది.

ట్రోల్స్‌ గురించి భయపడ్డా

'96' సినిమాతో త్రిష, విజయ్‌ సేతుపతి ఒక బెంచ్‌ మార్క్‌ను క్రియేట్‌ చేశారు. ఒకవేళ వాళ్ల స్థాయిలో మేం నటించకపోతే ఎలాంటి ట్రోల్స్‌ వస్తాయో అని మొదటి నుంచి భయపడ్డాం. ఈరోజు విడుదలయ్యాక చాలా మంది 'జాను' చిత్రానికి ఇచ్చిన రేటింగ్‌ చూసి సంతోషించాను. 'ఒకవేళ మేము సరిగ్గా చేయకపోతే మమ్మల్ని విమర్శించేవారు కదా' అనిపించింది.

జాను సినిమాలోని ఓ సన్నివేశం

సమంత లేకపోతే రాదు

'జాను'లో సమంత నటన కంటే నా నటనే బాగుందని చాలా మంది అంటున్నారు. దాన్ని నేను ఏమాత్రం నమ్మను. సమంత కాకుండా ఇంకెవరైనా ఆ స్థానంలో ఉండుంటే నా నుంచి ఆ స్థాయిలో ఫెర్ఫామెన్స్‌ రాదని చెప్పగలను.

ఆ సీన్‌కు బాగా కనెక్ట్‌

'జాను' సినిమాలోని ఓ సీన్‌కు ఎమోషనల్‌ బాగా కనెక్ట్‌ అయ్యాను. ఒక సన్నివేశంలో సమంత దగ్గర కూర్చుని.. 'నీకు తాళి కట్టేటప్పుడు నువ్వు అనుకున్నట్టు గానే నేను వచ్చా జాను' అని సమంతతో చెబుతాను, యాక్షన్‌ చేసి చూపిస్తాను. నిజం చెప్పాలంటే నా జీవితంలో అలాగే జరిగింది. అందుకే నేను ఆ సీన్‌కు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యాను. నాలైఫ్‌లో కూడా అలాంటి ఫస్ట్‌లవ్‌ స్టోరీనే ఉండబట్టి నేను కనెక్ట్‌ అయ్యాననుకుంటా.

జాను సినిమాలోని ఓ సన్నివేశం

అదే మాకు పెద్ద విజయం

'జాను' సినిమా గురించి మాకు మంచి ఫీడ్‌బ్యాక్‌ వచ్చింది. ఎక్కడా కూడా రీమేక్‌లా అనిపించలేదు. ఒక ఫ్రెష్‌ సినిమాను చూసినట్లు ఉందని చాలా మంది అన్నారు. అంతేకాకుండా విజయ్‌ సేతుపతి, త్రిషను మర్చిపోయి.. కేవలం సమంత, శర్వానే చూస్తున్నాం అని చెబుతున్నారు. అవే మాకు లభించిన పెద్ద విజయం.

రాజు కాకపోతే చేయను

'96' సినిమాను దిల్‌రాజు కాకుండా ఇంకా ఎవరు రీమేక్‌ చేసిన మేం చేసేవాళ్లం కాదు. రాజన్న కాబట్టే ఈ రీమేక్‌లో నేను నటించాను.

అక్షయ్‌ ఫార్మాలా

'పడిపడిలేచే మనసు', 'రణరంగం' సినిమాలతో పరాజయాలను చవిచూశాను. ఆ రెండు సినిమాలకు ముందు నాకు వరుసగా ఐదు హిట్‌లు ఉన్నాయి. వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్‌ కావడం వల్ల తక్కువ సమయంలోనే వీలైనన్ని మంచి కథల్లో నటించాలని నేను ఫిక్స్‌ అయ్యాను. అందుకే వెంట వెంటనే సినిమాలను ప్రారంభించాను. బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌ ఫార్మాలాను ఫాలో అవుతున్నాను.

Last Updated : Feb 29, 2020, 4:10 PM IST

ABOUT THE AUTHOR

...view details