హాలీవుడ్ యాక్షన్ సినిమా 'మిషన్ ఇంపాజిబుల్'.. ఈ సిరీస్‌లో వచ్చిన చిత్రాలన్నీ రికార్డు సృష్టించాయి. ఈ చిత్రంలోని పోరాట సన్నివేశాలు, హీరో విన్యాసాలు అభిమానుల్ని కట్టిపడేశాయి. ఇప్పుడు ఇదే తరహా సన్నివేశాలు, విన్యాసాలతో అభిమానులను అలరించేందుకు వచ్చేస్తున్నాడు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్.
దాదాపు మూడేళ్ల తర్వాత వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు షారుక్. అంతకముందు వరుస ఫ్లాప్‌లతో ఉన్న బాద్షా.. ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. ఈ క్రమంలోనే స్పై థ్రిల్లర్ 'పఠాన్'కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ చిత్రం దుబాయ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. నెటిజన్లను విపరీతంగా ఆక్టటుకుంటున్నాయి.
ఈ వీడియోల్లో సినిమాకు సంబంధించిన భారీ యాక్షన్ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. షారుక్(డూప్).. బస్సులు, ట్రక్కులు మీద స్టంట్స్ చేస్తూ కనిపించాడు. అవి చూస్తుంటే ఒళ్లు గగ్గుర పొడిచేలా ఉన్నాయి. మొత్తంగా ఈ చిత్రీకరణ సన్నీవేశాలు హాలీవుడ్ చిత్రం 'మిషన్ ఇంపాజిబుల్' స్థాయిలో ఉన్నాయి.
ఈ చిత్రంలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రానికి యశ్ రాజ్ ఫిల్మ్స్ చిత్ర సహ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. సినిమా షూటింగ్ గతేడాది నవంబరులోనే ప్రారంభమైంది. ఇందులో జాన్ అబ్రహం నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో సల్మాన్‌ఖాన్, హృతిక్ రోషన్ అతిథి పాత్రల్లో నటించనున్నారు. డింపుల్ కపాడియా కీలక పాత్రలో నటిస్తోంది.
ఇదీ చూడండి : తొలిసారి ఆ నలుగురితో షారుక్!