రెబల్‌స్టార్ ప్రభాస్, దర్శకుడు సుజిత్ కాంబినేషన్లో వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం 'సాహో'. ఈ సినిమా నుంచి సంగీత త్రయం శంకర్-ఎహసాన్-లాయ్ తప్పుకుంటున్నట్లు సోమవారం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 'సాహో' చిత్రీకరణ దాదాపుగా పూర్తవుతున్న నేపథ్యంలో సంగీత దర్శకులు సినిమా నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందన్న విషయంపై శంకర్ వివరణ ఇచ్చారు.
"సాహోలో బయటి కంపోజర్ల నుంచి మరిన్ని పాటలు కలిపేందుకు చిత్రబృందం నిర్ణయించింది. ఈ విషయం మాకు కాస్త అసౌకర్యాన్ని కలిగించింది. సినిమాకు మేమే సంగీత దర్శకులుగా ఉండాలని అనుకున్నాం. అందుకే సినిమా నుంచి తప్పుకున్నాం. ఈ మధ్య కాలంలో ఒక సినిమాకు ఎందరో సంగీత దర్శకులు కలిసి పనిచేయడం చూస్తూనే ఉన్నాం. ఇదే విషయం గురించి నిర్మాణ సంస్థ మాతో చర్చించింది. అయితే మాకు ఇష్టం లేదని చెప్పేశాం. ఎందుకంటే ఒక సినిమాకు ఒక సంగీత దర్శకుడే సంగీతం అందిస్తాడు. ఫలానా చిత్రానికి సంగీతం అందించింది ఆయనే అని చెబితేనే సంగీత దర్శకుడికి గౌరవం దక్కుతుంది.