తల్లిదండ్రులు విడిపోయిన బాల్యం.. అమ్మమ్మ, తాతయ్యల పెంపకం.. మళ్లీ పెళ్లి చేసుకున్న తల్లి.. ఇలా చిన్ని గుండెని పిండేసిన చేదు జ్ఞాపకాలతో పెరిగి పెద్దయిన నటుడతడు. ఊహ తెలియని చిరుప్రాయం నుంచే పుట్టెడు కష్టాలు, కన్నీళ్లతో సాగిన ప్రయాణంలోనూ నటనను ఆలంబన చేసుకున్న కళాకారుడతడు. చిన్నతనం నుంచి నృత్యమంటే ప్రాణంగా భావించి.. ఆ కళలో ప్రతిభావంతమైన ప్రదర్శనతో.. సినిమాల్లో గ్రూప్ డ్యాన్సర్‌గా, మరోపక్క టీవీ కమర్షియల్స్‌లో నటుడిగా, కొన్ని మ్యూజిక్ వీడియోస్‌లో అభినివేశాన్ని ప్రదర్శించి.. నెమ్మదిగా వెండితెరపై హీరోగా మన ముందుకు వచ్చిన వ్యక్తి షాహిద్ కపూర్. నేడు(ఫిబ్రవరి 25) అతడి పుట్టిన రోజు. ఈ సందర్భంగా షాహిద్ కపూర్ గురించి కొన్ని విశేషాలు మీకోసం..
ఛిద్రమైన బాల్యం
నటుడు పంకజ్ కపూర్, నటి నీలిమా అజీమ్‌ల కుమారుడు షాహిద్ కపూర్. 1981 ఫిబ్రవరి 25న దిల్లీలో జన్మించాడు. తన మూడో ఏటనే అభిప్రాయ భేదాల కారణంగా తల్లి, తండ్రి విడిపోవడం వల్ల చిన్నారి మనసు తల్లడిల్లింది. తండ్రి ఆప్యాయతకి దూరమై కొన్నాళ్లపాటు బాధ నుంచి విముక్తి పొందలేదు. నటి అయిన తల్లి నీలిమా అజీమ్.. షాహిద్ పదో ఏట దిల్లీ నుంచి ముంబయికి మకాం మార్చింది. సినీ అవకాశాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ముంబయిలోని తాత, అమ్మమ్మల దగ్గర షాహిద్ పెరిగాడు.
తాత, అమ్మమ్మ ఇద్దరూ రష్యా నుంచి వెలువడే స్పుత్నిక్ పత్రికలో జర్నలిస్ట్‌లుగా పనిచేసేవారు. అయితే తాతయ్యకు షాహిద్ కపూర్ తండ్రితో మంచి అనుబంధం ఉంది. ఆ విషయాలని చెప్తూ.. అల్లుడు రాసిన ఉత్తరాలను చూపిస్తూ మనవడి బెంగ తీర్చాడు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా తాతయ్య మనవడిని స్కూల్ దాకా దిగబెట్టి, తీసుకుని వచ్చేవాడు. షాహిద్ దిల్లీలోని జ్ఞానభారతి స్కూల్లో, ముంబయి రాజహంస్ విద్యాలయంలో చదువుకున్నాడు. ఆ తర్వాత ముంబయిలోని మిత్తి భాయ్ కాలేజ్‌లో మూడు సంవత్సరాలు చదివాడు. కొన్నాళ్ల తర్వాత కపూర్ తల్లి నీలిమా అజీమ్ రాజేష్ కత్తర్‌ని ద్వితీయ వివాహం చేసుకుంది. అప్పుడు షాహిద్ తల్లి దగ్గరే పెరిగాడు.
డ్యాన్స్ అంటే ప్రాణం
డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం చూపించే షాహిద్ కపూర్ తన 15వ ఏట షైమక్ డ్యాన్స్ స్కూల్‌లో శిక్షణ పొందాడు. డ్యాన్స్ స్కూల్‌లో విద్యార్థిగా ఉన్నప్పుడే షాహిద్ కొన్ని సినిమాల్లో గ్రూప్ డ్యాన్సర్‌గా పనిచేశాడు. 'దిల్ తో పాగల్ హై', 'తాల్' తదితర చిత్రాలకు డ్యాన్సర్‌గా చేశాడు. ఆ సందర్భంలో కొన్ని స్టేజి షోలలోనూ అభినయం చేశాడు. వాటిలో వోగ్, గోల్డెన్ ఐ స్టేజి షోలకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. అదే స్కూల్‌లో ఇన్‌స్ట్రక్టర్‌గానూ పనిచేశాడు. షారూక్ ఖాన్, కాజోల్, రాణి ముఖర్జీలతో కలసి ఓ శీతల పానీయం యాడ్లోనూ ప్రతిభ ప్రదర్శించాడు. తన తండ్రి రూపొందించిన 1998 నాటి టెలివిజన్ సిరీస్ మోహన్ దాస్ 'బిఏ ఎల్ ఎల్‌బి'కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.
ఆఖోమే మ్యూజిక్ వీడియోలో కపూర్‌ని చూసిన నిర్మాత రమేష్ తౌరాని తన చిత్రంలో ఓ పాత్ర ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. అప్పుడు వ్యక్తిగతంగా కలిసిన రమేష్ తౌరాని.. 20 ఏళ్ల వయసున్న షాహిద్ కపూర్ తన చిత్రంలో పాత్రకి ఇంకా చిన్నవాడిని అనుకున్నాడు. ఆ రకంగా రమేష్ తౌరాని ద్వారా రావాల్సిన అవకాశం షాహిద్ కపూర్‌కి చేజారిపోయింది.
'ఇష్క్ విష్క్'తో తెరంగేట్రం