రైల్వేస్టేషన్‌లో తల్లి చనిపోయిందని తెలియక 'అమ్మా లే' అంటూ నిద్రలేపేందుకు ప్రయత్నించిన పిల్లాడిని చూసి.. ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ చలించిపోయారు. ముజఫర్‌పుర్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో తన మనసును కదిలించిందని ఆయన పేర్కొన్నారు. అందుకే ఆ చిన్నోడిని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
"అనాథలుగా మారిన ఆ పిల్లల పూర్తి బాధ్యత మీర్ ఫౌండేషన్ చూసుకుంటుంది. ప్రస్తుతం ఆ పిల్లలు వారి తాత సంరక్షణలో ఉన్నట్లు సమాచారం ఉంది. వారికి సహాయం చేయడానికి మాకు దారి చూపిన ప్రతి ఒక్కరికీ మీర్ ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నా. నా చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాను. 30 సంవత్సరాల క్రితం నా తల్లి చనిపోయింది. తల్లిదండ్రులు లేని లోటు ఎలా ఉటుందో నాకు తెలుసు. వారితో తగినంత సమయం గడపలేకపోయాననే బాధ జీవితాంతం వేధిస్తుంటుంది. అందుకే మేము మా కెరీర్‌లో ఎంత బిజీగా ఉన్న మా పిల్లల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వారితో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నిస్తున్నాం. వారు ఎక్కడికైనా వెళ్లినా, మేము దూరంగా ఉన్నా ఎప్పటికప్పుడు ఫోన్‌లో చాట్ చేస్తూనే ఉంటాం".
-షారుక్ ఖాన్, బాలీవుడ్ కథానాయకుడు