బాలీవుడ్లో ఎన్ని క్లాసిక్స్ వచ్చినా.. 'దిల్వాలే దుల్హానియా లే జాయేంగే' స్థానం మాత్రం చెక్కు చెరగనిది. 1995 అక్టోబర్ 20న విడుదలైన ఈ సినిమా.. మంగళవారంతో(అక్టోబరు 20) 25ఏళ్లు పూర్తిచేసుకుంది. తరాలతో సంబంధం లేకుండా దశాబ్దాలుగా ప్రేక్షకులను ఇప్పటికీ ఉర్రూతలూగిస్తూనే ఉంది. దృశ్యకావ్యం అంటే అర్థం తెలియనివాళ్లు డీడీఎల్జే చూసి తెలుసుకోవాలని సినీ విమర్శకులే ఇప్పటికీ చెబుతుంటారు.
వసూళ్లు, రికార్డులు పక్కన పెడితే 90ల్లో కుర్రకారును ఈ సినిమా మార్చేసింది. ఓ రకంగా వెండితెర రొమాన్స్‌ను రీ డిఫైన్ చేసిందని చెప్పుకోవచ్చు. ఆ ఏడాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలన్నీ దాదాపు ఈ సినిమావే. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు ఇలా ప్రధాన విభాగాలన్నింటిలో అవార్డులు సొంతం చేసుకుంది.
షారుక్, కాజోల్‌లా ఉండాలి
తుజే దేఖాతో యే జానా సనమ్.. ప్యార్ హోతా హై దీవానా సనమ్
రుక్జా ఓ దిల్ దివానే.....
న జానే మేరే దిల్ కో....
ఈ పాటలు వింటే అరే ప్రేమంటే ఇంత సున్నితంగా, తియ్యగా ఉంటుందా.. మనమూ ప్రేమలో పడితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. వీరిద్దరి జోడీ ఆ తరం ప్రేమికులను ఎంతగా ప్రభావితం చేసిదంటే.. ప్రేమికులంటే కాజోల్, షారుక్‌లా కచ్చితంగా ఇలానే ఉండాలి అనిపించేంతగా చేసింది.
చిరస్థాయిగా నిలిచిపోయాయి
ఈ సినిమాలోని రెండు సన్నివేశాలు అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఒక పూల తోట మధ్యలో ఓ యువకుడు వెనుక గిటార్, నెత్తిన టోపి పెట్టుకుని తన ప్రేయసి కోసం పాట అందుకుంటాడు. ‘తుజే దేఖా తో యే జానా సనమ్’ అంటూ సాగే ఈ పాటను, ఆ సన్నివేశాన్ని ఎప్పటికీ మర్చిపోలేము. క్లైమాక్స్‌లో వచ్చే రైల్వే స్టేషన్ సీన్‌ను కూడా మర్చిపోలేమంతే. చూసే ప్రతీ ప్రేక్షకుడికి కన్నీళ్లు తెప్పించేస్తాయి.
కాజోల్‌ను పడేసిన షారుక్.. ఆమె రియాక్షన్ అదుర్స్!
అయితే సినిమాలోని 'రుక్ జావో దిల్ దివానే' పాట చివర్లో కాజోల్‌ను షారుక్ గిరాగిరా తిప్పి వెల్లకిలా వాల్చి ఒక చేయిని ఆమె వీపు వెనుక ఆసరాగా ఉంచి ఇచ్చిన పోజ్ ఐకానిక్‌గా నిలిచింది. ఆ పోజ్ తర్వాత కాజోల్‌ను షారుక్ దభేలున కిందపడేస్తే ఆమె ఆశ్చర్యపోతూ చూసే దృశ్యం ఉంటుంది. ఆ సన్నివేశాన్ని ఎన్నో సినిమాల్లో రీక్రియేట్ చేశారు. అయితే ఆ ఫోజును తీస్తున్నప్పుడు సెట్లో ఓ గమ్మత్తైన సంఘటన జరిగింది.
దర్శకుడు ఆదిత్య చోప్రా.. కాజోల్కు తనను కిందపడేసే షాట్ గురించి ముందే చెప్పలేదట. ఆమెకు చెప్పలేదన్న విషయం షారుక్‌కు చెప్పలేదట. కిందపడినప్పుడు కాజోల్ రియాక్షన్ సహజంగా రావడానికే ఆదిత్య అలా చేశారు. యాక్షన్ చెప్పగానే షారుక్ ఫోజ్ ఇవ్వడం, ఆ తర్వాత కాజోల్కు ఆసరాగా ఉంచిన చేయి తీసేసి మామూలుగా వెళ్లిపోవడం, కిందపడ్డ కాజోల్ ఏం జరిగిందో అర్థంకాక అయోమయంతో అతడి వంక చూడటం జరిగిపోయాయి. షాట్ ఓకే అయిన తర్వాత ఆమెకు అసలు విషయం చెప్పారు ఆదిత్య. ఆయన చెప్పినట్లుగానే తన రియాక్షన్ బాగా రావడం వల్ల ఆనందంగా నవ్వేసింది కాజోల్.
ఇదీ చూడండి డీడీఎల్జే@25: లండన్‌లో షారుఖ్, కాజోల్ జోడీ కాంస్య విగ్రహం