మీర్జాపురం రాజా 1946లో ఒకవైపు 'కీలుగుఱ్ఱం' చిత్రాన్ని నిర్మిస్తూనే భార్య కృష్ణవేణి కోరికపై స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యంలో రాజకీయ దృక్పథాలను అనుసంధానిస్తూ 'మనదేశం' పేరుతో మరో సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆ చిత్రానికి దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. ఆ సినిమాలో పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రకోసం కొత్త నటుడిని అన్వేషిస్తూ నందమూరి తారక రామారావుని ఎంపికచేశారు. షూటింగ్ సిద్ధమైంది.
ఆ సన్నివేశంలో ఆందోళన చేస్తున్న హీరో నారాయణరావును అరెస్టు చేసేందుకు ఇన్స్పెక్టర్ వస్తాడు. హీరో ఎదురు తిరుగుతాడు. పరిస్థితి అదుపు తప్పుతుంది. లాఠీచార్జీ చేయడం అనివార్యమవుతుంది. దర్శకుడు 'యాక్షన్' చెప్పారు. ఎన్టీఆర్ తన పాత్రలో జీవించారు. ఆయన చేతిలోని లాఠీకి పూనకం వచ్చింది. అడ్డొచ్చిన వాళ్లను చితకబాదారు. సెట్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. దర్శకుడు 'కట్...కట్' అంటూ బిగ్గరగా అరుస్తున్నారు. 'స్టాప్' అంటూ కేకలేశారు. వాతావరణం చల్లబడింది. రామారావుని దర్శకుడు పిలిచారు. "నటించవయ్యా అంటే నరమేధం సృష్టించేలా ఉన్నావే. చూడబ్బాయ్. ఇది డ్రామా కాదు. సినిమా. మరీ అంతగా విరుచుకపడి నటించాల్సిన అవసరం లేదు" అంటూ సినిమా సూక్ష్మతను వివరించారు. అదీ మన తారకరాముడికి పనిమీద వుండే నిబద్ధత, అభినివేశం. 'ఇంతవాణ్ని. ఇంతవాణ్నయ్యాను' అంటూ పలికిన తొలి డైలాగు నందమూరి తారక రామారావును నిజంగానే అంతవాణ్నిచేసి అత్యున్నత శిఖరాల మీద కూర్చోబెట్టింది. ఆ అభినవ రాముని జయంతి ఈరోజే (మే 28). ఈ సందర్భంగా ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌముని ప్రస్థానం గుర్తు చేసుకుందాం.
తొలిరోజుల్లో నందమూరి..
కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో మే28, 1923న నందమూరి తారక రామారావు జన్మించారు. తండ్రి లక్ష్మయ్య చౌదరి, తల్లి వెంకటరామమ్మ. ఏడేళ్ల వయసులో రామారావుకు రామాయణం, భారతం వంటి పురాణాలు వంటబట్టాయి. బెజవాడ మున్సిపల్ హైస్కూలులో చదువు పూర్తిచేసి 1940లో స్థానిక ఎస్.ఆర్.ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్‌లో చేరారు ఎన్టీఆర్. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అప్పట్లో తెలుగు విభాగానికి అధిపతిగా వుండేవారు. ఒకసారి కళాశాలలో ప్రదర్శించిన 'రాచమల్లు దౌత్యం' అనే నాటకంలో రామారావు ‘నాయకురాలు నాగమ్మ’ వేషం వేయాల్సి వచ్చింది. అయితే మీసాలు తీయనని విశ్వనాథతో చెప్పి మీసాలతోనే ఆ వేషం వేసి రక్తి కట్టించారు. 1942లో రామారావుకు మేనకోడలు బసవరామ తారకంతో పెళ్లి జరిగింది. 1947లో బి.ఎ. పట్టా పుచ్చుకున్న తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేశారు ఎన్టీఆర్. పోలీసు శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వచ్చినట్లే వచ్చి చేజారింది.
దెహ్రాదూన్‌లో షార్ట్ సర్వీస్ కమీషన్డ్ ఆఫీసరు ఉద్యోగానికి ఇంటర్వ్యూకి రమ్మని పిలుపొచ్చింది. కానీ తండ్రి వద్దనడం వల్ల రామారావు వెళ్లలేదు. బెజవాడలో ఉండగా సారథి స్టూడియో వారు నిర్మించబోయే 'శ్రీమతి' అనే చిత్రం కోసం కొత్త ఆర్టిస్టుల వేట ప్రారంభమైంది. పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. ఈ విషయమై ఎల్.వి.ప్రసాద్ విజయవాడ వచ్చారు. అప్పుడు రామారావును సుబ్రహ్మణ్యం అనే శ్రేయోభిలాషి దుర్గా కళామందిరంలో 'రైతుబిడ్డ' సినిమా చూస్తున్న ఎల్.వి. ప్రసాద్ వద్దకు తీసుకెళ్లారు. చూడగానే ప్రసాద్‌కు రామారావును బాగా నచ్చారు. తాను రాజమండ్రి వెళుతున్నానని, మద్రాసుకు వెళ్లగానే కబురు పంపుతానని, స్క్రీన్ టెస్టుకు రావల్సి ఉంటుందని చెప్పి వెళ్లారు. కొద్దిరోజుల్లోనే మద్రాసు నుంచి రామారావుకు కబురొచ్చింది.
మద్రాసులో అడుగుపెట్టి.
మే 21న రామారావు మద్రాసు వెళ్లి శోభనాచల స్టూడియోలో ఎల్.వి. ప్రసాద్‌ను కలుసుకున్నారు. అక్కడ 'ద్రోహి' చిత్రం షూటింగ్ జరుగుతోంది. దర్శకుడు ప్రసాద్ మేకప్ మ్యాన్ మంగయ్యతో రామారావుకు మేకప్ వేయించారు. టెస్ట్ చేసి, కొన్ని స్టిల్స్ తీసి, చిన్న సన్నివేశాన్ని చిత్రీకరించారు. వాటిని పరిశీలించిన తర్వాత కబురు చేస్తానని చెప్పగా.. రామారావు బెజవాడ వచ్చి ‘ఎన్.ఎ.టి’ సంస్థ తరఫున నాటకాలు ప్రదర్శించ సాగారు. తమ్ముడు త్రివిక్రమ రావు, అట్లూరి పండరీకాక్షయ్య నిర్వహణ బాధ్యతలు చూసుకునేవారు. అనంతరం రామారావు మద్రాసు సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం సంపాదించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఉద్యోగం చేస్తుండగా ఎల్.వి.ప్రసాద్ నుంచి ఉత్తరం వచ్చింది. ‘శ్రీమతి’ చిత్ర నిర్మాణం ఆగిపోయిందని, మీర్జాపురం రాజా నిర్మిస్తున్న 'మనదేశం' చిత్రంలో మంచి పాత్ర ఉందని.. మద్రాసు రమ్మని రాశారు. చేస్తున్న ఉద్యోగాన్ని వదలి రామారావు మద్రాసు వెళ్లారు.
'మనదేశం'లో పోలీసు ఇన్స్పెక్టరు వేషంలో రామారావు మెప్పించారు. ఆ చిత్రం 1949 నవంబరులో విడుదలైంది. తర్వాత బీఏ సుబ్బారావు శోభనాచల సంస్థతో సంయుక్త నిర్మాణంలో 'పల్లెటూరి పిల్ల' సినిమా నిర్మాణం ప్రారంభించి.. జంట హీరోలుగా నాగేశ్వరరావు, ఎన్.టి.రామారావును తీసుకున్నారు. సినిమా బాగా ఆడింది. తర్వాత విజయ సంస్థ 'షావుకారు' (1950) చిత్రానికి ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం వహించారు. రామారావు ఆ సినిమాలో హీరోగా నటించారు. ఆ రెండు సినిమాలూ విజయవంతమయ్యాయి. అలా ఈ రెండు సినిమాల్లో రామారావుకు అవకాశాలు రావడానికి ఎల్.వి. ప్రసాద్ దోహదపడ్డారు.
నందమూరి నట జైత్రయాత్ర