తెలంగాణ

telangana

By

Published : Jul 26, 2021, 9:32 AM IST

Updated : Jul 26, 2021, 9:58 AM IST

ETV Bharat / sitara

ప్రముఖ నటి జయంతి కన్నుమూత

అలనాటి తార జయంతి(76) సోమవారం తుదిశ్వాస విడిచారు. ఈమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

jayanthi
జయంతి

ప్రముఖ సీనియర్ నటి జయంతి(76) కన్నుమూశారు. ఆదివారం రాత్రి బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఐదు దశాబ్దాల పాటు భారతీయ చిత్ర పరిశ్రమలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఈమె.. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, మరాఠీ భాషల్లో సుమారు 500కుపైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. కన్నడ సినీరంగంలో సూపర్​స్టార్​ రాజ్​కుమార్​తో సమానంగా అభిమానులను సంపాదించుకున్న నటిగా గుర్తింపు పొందారు.

1949 జనవరి 6న శ్రీకాళహస్తిలో పుట్టిన జయంతి.. చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోవడం వల్ల తల్లితో కలిసి మద్రాసులో అడుగుపెట్టారు. ప్రముఖ నర్తకి, నాట్య విదూషీమణి చంద్రకళ వద్ద నాట్యం నేర్చుకున్నారు. తోటి విద్యార్థులతో కలిసి కన్నడ సినిమా చిత్రీకరణ చూడటానికి వెళ్లినప్పుడు ప్రముఖ కన్నడ దర్శకుడు వైఆర్ స్వామి కమలకుమారిని చూసి 'జేనుగూడ' చిత్రంలో ముగ్గురు కథానాయికల్లో ఒకరిగా తీసుకున్నారు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. కమలకుమారి పేరు చాలా మందికి ఉండటం వల్ల ఆ పేరును జయంతిగా మార్చారు. ఎన్టీఆర్ తో కలిసి జగదేకవీరుని కథ, కుల గౌరవం, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి చిత్రాల్లో నటించారు. అలాగే స్వర్ణ మంజరి, రైతుబిడ్డ, మాయదారి మమల్లిగాడు, పెదరాయుడు చిత్రాలు జయంతిని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి.

కన్నడ హీరో రాజ్ కుమార్​తో కలిసి 30 సినిమాల్లో కథానాయికగా నటించారు. 1965లో 'మిస్ లీలావతి' చిత్రానికి భారత ప్రభుత్వం ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందజేసింది. మైసూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్​తో సత్కరించింది. జయంతి కళాకోకిల, అభినయ శారద బిరుదులు పొందారు. సినీరంగంలోనే కాదు రాజకీయాల్లోనూ అడుగుపెట్టిన ఆమె.. 1998లో లోక్ శక్తి పార్టీ తరపున చిక్ బళ్లాపూర్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ 1999లో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కోరటగీరె నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. జయంతి, రాజశేఖర్ దంపతులకు ఒకే ఒక్క కుమారుడు కృష్ణకుమార్ ఉన్నారు.

ఇదీ చూడండి: కళాకారుడిగా ఆ విషయాన్నే చెప్పా: ఆర్​.నారాయణమూర్తి

Last Updated : Jul 26, 2021, 9:58 AM IST

ABOUT THE AUTHOR

...view details