నిన్నే పెళ్లాడతా అంటూ నాగార్జున ఒక్కరే వెంటపడలేదండోయ్. ఆ సినిమాలో టబుని చూశాక దాదాపు తెలుగు కుర్రాళ్లంతా అదే మాటన్నారు. చూడ్డానికి ముంబయి ముద్దుగుమ్మలా ఉంటుందిగానీ... టబు మన తెలుగమ్మాయే. హైదరాబాద్‌లో పుట్టిపెరిగింది. ఇక్కడే చదువుకుంది. ఆ తర్వాత ముంబయి వెళ్లింది. కథానాయికగా గుర్తింపు తెచ్చుకొంది. అన్నట్టు విదేశాల్లోనూ టబుకి అభిమానులున్నారు. ది నేమ్ సేక్, లైఫ్ ఆఫ్ పై చిత్రాల్లో ఆమె నటన ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది హృదయాల్ని కొల్లగొట్టింది. అదేంటో తెలీదు కానీ... దేవుడు అన్నీ ఒక్కరికే ఇచ్చేస్తుంటాడు. టబుకి అందం ఇచ్చేశాడు. అదనంగా నటనని కూడా ఇచ్చేశాడు. అందుకే అవార్డులు ఇంటికి నడుచుకొంటూ వచ్చాయి. ఆరడుగులకి ఒకట్రెండు పాయింట్లు తక్కువుండే ఈ సోయగం... హిందీ ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. తెలుగువాళ్లతోనూ మా కథానాయిక అనిపింంచుకుంది. తమిళం, మలయాళం, బెంగాళీ ఇలా పలు భాషల్లో నటించి రాణించింది. 38 యేళ్లుగా వెండితెరతో అనుబంధాన్ని కొనసాగిస్తోంది. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం మీ కోసం..
తబుస్సుమ్..
అసలు పేరు తబుస్సుమ్ హష్మి. 1971 నవంబరు 4న హైదరాబాద్‌లో జన్మించింది. తండ్రి జమాల్ హష్మి, తల్లి రిజ్వానా. ఆమె ఓ స్కూల్ టీచర్. బాల్యంలో ఉండగానే తల్లిదండ్రులిద్దరూ విడిపోయారు. అధ్యాపకులైన అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరిగింది. హైదరాబాద్‌లోని సెంట్ ఆన్స్ హై స్కూల్‌లో చదువుకుంది. ప్రముఖ నటులు షబానా అజ్మీ, బాబా అజ్మీలకి టబు స్వయానా మేనకోడలు. వాళ్లను స్ఫూర్తిగా తీసుకొని 1983లో హైదరాబాద్ నుంచి ముంబయికి వెళ్లింది. నిన్నటి తరానికి చెందిన ప్రముఖ కథానాయిక ఫరానాజ్ కూడా టబుకి బంధువు అవుతారు.
చిన్న పాత్రతో...
1980లోనే కెమెరా ముందుకెళ్లింది. బజార్ అనే చిత్రంలో బాలనటిగా ఓ చిన్న పాత్ర పోషించింది. ఆ తర్వాత ఐదేళ్లకు హమ్ నే జవాన్‌లో దేవానంద్‌కి కూతురిగా నటించింది. పద్నాలుగేళ్ల వయసులో చేసిన ఆ పాత్ర ద్వారా టబు బాలీవుడ్ వర్గాల్ని ఆకట్టుకుంది. బోణీకపూర్ తన సంస్థలో నిర్మించనున్న రూప్‌కీ రాణీ చోరోంకా రాజా, ప్రేమ్ చిత్రాల కోసం టబుని కథానాయికగా ఎంపిక చేసుకొన్నాడు. ప్రేమ్‌లో సంజయ్‌కపూర్ సరసన నటించింది. అయితే ఆ చిత్రం పూర్తి కావడానికి సుమారు ఎనిమిదేళ్లు పట్టింది. సుదీర్ఘకాలం తర్వాత విడుదలైనా... ఆ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో టబుకి ఏ మాత్రం కలిసిరాలేదు.
స్టార్ అయింది..
కూలీ నెంబర్ 1 చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమైంది. 1987లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆ చిత్రం చక్కటి ఆదరణ పొందింది. వెంకటేష్ సరసన నటించిన ఆమె గురించి తెలుగు ప్రేక్షకులంతా ప్రత్యేకంగా మాట్లాడుకొన్నారు. అంతలోనే హిందీ చిత్రాలతో మరింత బిజీ అయిపోయింది. విజయ్‌పథ్‌లో అజయ్ దేవగణ్ సరసన నటించి తొలి విజయాన్నందుకొంది. ఇక ఆ చిత్రం తర్వాత మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. సాజన్ చలే ససురాల్, జీత్ చిత్రాలు ఆమెని స్టార్ కథానాయికని చేశాయి. 90వ దశకమంతా బాగా కలిసొచ్చింది. అటు గ్లామర్ పాత్రలతోనూ, ఇటు నటనకు ప్రాధాన్యమున్న కథల్లోనూ నటించింది. హిందీలో చేసిన మ్యాచిస్ చిత్రం టబుకి ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. పంజాబీ మహిళ పాత్రలో ఆమె ఒదిగిపోయిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఆ వెంటనే ప్రియదర్శన్ దర్శకత్వంలో కాలాపానీ చేసింది. అది కూడా గుర్తింపును తీసుకురావడం వల్ల తమిళంలో కూడా అవకాశాల్ని సంపాదించుకుంది.