తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆశ'గా పుట్టింది.. రేవతిగా మారింది - రేవతి న్యూస్​

నటిగా, దర్శకురాలిగా, సామాజిక కార్యకర్తగా జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు రేవతి. తన ఏడో సంవత్సరం నుంచే భరతనాట్యం నేర్చుకొన్న ఆమె ఆ తరువాత పలు ప్రదర్శనలు ఇచ్చారు. 1983లో తెరంగేట్రం చేసిన రేవతి.. తమిళం, మలయాళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో నటించి ఉత్తమ నటిగా గుర్తింపు తెచ్చుకొన్నారు. నేడు (జులై 8)న రేవతి పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

Senior Actress Revathi Birthday Special Story
బర్త్​డే: 'ఆశ'గా పుట్టింది.. రేవతిగా అయ్యింది

By

Published : Jul 8, 2020, 6:01 AM IST

Updated : Jul 8, 2020, 6:56 AM IST

అక్కడ ఓ ఫ్యాషన్ షో జరుగుతోంది. చక్కగా మేకప్ వేసుకున్న స్కూల్ విద్యార్థినులు వేదికపై హొయలు పోతున్నారు. కెమెరాలు క్లిక్ మంటూ ఫొటోలను చక చక తీసేస్తున్నాయి. తమిళ నాట అత్యధిక జనాదరణ ఉన్న ఓ పత్రిక ఫోటోగ్రాఫర్...ఫ్యాషన్ షో లో పాల్గొన్న గ్రూప్ ఫొటో కవర్ పేజీగా ఎంపిక చేశారు.

కట్ చేస్తే... తన చిత్రాల ద్వారా సరికొత్త ట్రెండ్ సృష్టించిన ఓ దర్శకుడు ... త్వరలో తీయబోయే చిత్రం కోసం కొత్త ముఖాల కోసం అన్వేషణ చేస్తున్నారు. అదే సమయంలో ఆ పత్రిక ముఖ చిత్రంగా ప్రచురితమైన ఫ్యాషన్ షో ఆయన కంటపడింది. గ్రూప్ ఫొటోలో చాలామంది ఉన్నా.. ఒక అమ్మాయి మాత్రమే ఆ దర్శకుడిని ఎంతగానో ఆకర్షించింది. వెంటనే... తన హీరోయిన్ దొరికిందని ఎగిరి గంతేశారు ఆ దర్శకుడు.

ఒక్క ఫ్యాషన్ షో ఓ అమ్మాయిని రంగుల ప్రపంచానికి పరిచయం చేస్తుందని... ఆ అమ్మాయితో పాటు ఆ ఫ్యాషన్ షో లో పాల్గొన్న సహా విద్యార్థినులకు ఎంతమాత్రం తెలీదు.

ఆ షో ద్వారా సినీవినీలాకాశంలోకి ఓ కొత్త తార పుట్టుకొచ్చింది. ఆమె ఎవరో కాదు హీరోయిన్​ 'రేవతి'... ఆమెను తెరకు పరిచయం చేసిన దర్శకుడు ది గ్రేట్ డైరెక్టర్ భారతీ రాజా.

రేవతి

సినీ వ్యాకరణాన్ని సమూలంగా మార్చేశారు దర్శకుడు భారతీ రాజా. పల్లె సీమల్లోని మట్టి పరిమళాన్ని వెండితెరకు అద్దుతూ.. సహజత్వానికి అతి దగ్గరగా ఉన్న పాత్రల్ని కళ్ళముందు ఆవిష్కరిస్తూ ప్రేక్షకుల హృదయాల్ని తడిమే భావోద్వేగాల సమ్మేళనంతో ఆయన తీసిన చిత్రాలు ఔత్సాహిక దర్శకులకు పాఠాలుగా నిలిచాయి. భారతీ రాజా స్కూల్ నుంచి ఓ ఆర్టిస్ట్ వచ్చిందంటే... కొన్ని దశాబ్దాల భవిష్యత్ భరోసా ఉన్నట్లే. అంతెందుకు...? భారతీ రాజా తెరకెక్కించిన '16 వయతినిలే' సినిమా భారతీయ భాషల్లో ఎంత పేరు గడించిందో సినీ అభిమానులందరికీ తెలుసు. అలాంటి దర్శకుడి సినిమా 'మన్ వాసనై' ద్వారా రేవతి పరిచయం అయ్యారు. ఇక... అప్పటినుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు.

రేవతి

రేవతిగా మారిన 'ఆశ కెలున్నీ'..

రేవతి అసలు పేరు ఆశ కెలున్నీ. 1966 జులై 8న కేరళ కొచ్చిలో ఆమె జన్మించారు. మలన్ కట్టి కేలున్నీ, లలిత కెలున్నీ ఆమె తల్లి తండ్రులు. తండ్రి ఆర్మీలో పనిచేసేవారు. కూతురు కళల్లో రాణించాలని చిన్నతనంలోనే వారు భరతనాట్యం నేర్పించారు. సినీ రంగంలో విజయాలు చవి చూసినా...వ్యక్తిగత జీవితంలో కొన్ని ఆటుపోట్లను రేవతి ఎదురుకొన్నారు. సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ సురేష్ చంద్ర మేనన్​ను రేవతి 1986లో వివాహమాడారు. వారిద్దరికి పిల్లలు లేరు. అభిప్రాయభేదాల కారణంగా 2002 నుంచి విడివిడిగా ఉండేవారు. చెన్నై అదనపు ఫ్యామిలీ కోర్టు 2013 ఏప్రిల్ 23న వీరిద్దరికి విడాకులు మంజూరు చేసింది. అయితే 2018లో రేవతి కృత్రిమ ఫలదీకరణ ద్వారా ఆమె ఓ కూతురికి జన్మనిచ్చినట్లు...ఆ అమ్మాయికి ఐదేళ్లు అంటూ బహిరంగంగా ప్రకటించారు. ఈ ప్రకటన ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. రేవతి కూతురు పేరు మహి.

రేవతి

తెలుగులో రేవతి చిత్రాలు..

వివిధ భాషల్లో నటించిన రేవతి తెలుగువారికీ సుపరిచితమే. మానస వీణ, సీతమ్మ పెళ్లి, రావుగారిల్లు, ప్రేమ, లంకేశ్వరుడు, అంకురం, గాయం, గాయం -2, గణేష్, ఈశ్వర్, అనుక్షణం, లోఫర్, సైజ్ జీరో, బ్రహ్మోత్సవం, యుద్ధం శరణం...లాంటి సినిమాల్లో నటించారు. 'ప్రేమ' చిత్రంలో ఆమె యువతకు దగ్గరయ్యారు. ఆ సినిమాలోని పాటలు ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచి ఉన్నాయి. గాయం, గాయం -2 చిత్రాల్లో సామాజిక స్పృహ కలిగించే పాత్రల్లో ఆమె కనిపించి ప్రజాదరణ పొందారు రేవతి.

రేవతి

అందుకున్న అవార్డులు

చిత్రపరిశ్రమకు అందించిన సేవలకు గుర్తింపుగా రేవతి పలు అవార్డులు అందుకున్నారు. మూడుసార్లు జాతీయ పురస్కారాలు స్వీకరించారు. 1992లో 'తేవర్ మగన్' చిత్రానికిగాను ఉత్తమ సహాయ నటిగా, 2002లో 'మిత్ర్ ...మై ఫ్రెండ్' ఉత్తమ ఆంగ్ల చిత్రంగా, 2011లో 'రెడ్ బిల్డింగ్ వేర్ ది సన్ సెట్స్' అనే నాన్ ఫీచర్ ఫిలిం విభాగంలో జాతీయ అవార్డులను రేవతి దక్కించుకున్నారు. 1990లో 'కిజక్కు వాశల్' చిత్రానికి ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర పురస్కారాన్ని అందుకున్నారు. 1998లో 'తలై ములై' చిత్రానికిగాను ఉత్తమ నటిగా ప్రత్యేక అవార్డును తమిళనాడు ప్రభుత్వం రేవతికి అందించింది. 2012లో 'మోలీ ఆంటీ రాక్స్' అని చిత్రానికిగానూ సెకండ్ సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్​కి ఉత్తమ నటిగా నామినేట్ అయ్యారు రేవతి.

రేవతి

ఫిలింఫేర్ సౌత్ అవార్డులు

1983లో 'మన్ వాసనై' చిత్రానికి ప్రత్యేక అవార్డు స్వీకరించారు రేవతి. 1988లో 'కక్కోతికవిలె అప్పూపన్ తాడికల్' మలయాళ సినిమాకు ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. 1992లో 'అంకురం' తెలుగు చిత్రంలో ఉత్తమనటి ఎంపికయ్యారు. అదే సంవత్సరం 'తేవర్ మగన్' చిత్రానికి బెస్ట్ తమిళ్ ఆర్టిస్ట్​గా పురస్కారాన్ని పొందారు. 1993లో 'మరుపధియమ్', 1994లో 'ప్రియాంక' చిత్రంలో బెస్ట్ తమిళ్ ఆర్టిస్ట్​గా అవార్డు స్వీకరించారు. అదే వరుసలో సినిమా ఎక్స్​ప్రెస్, ఫిలిం ఫాన్స్ అసోసియేషన్, ది మైలాపూర్ అకాడమీ బర్కిలీ డ్రామా అవార్డులు ఆమె అందుకున్నారు రేవతి.

ఇదీ చూడండి... ఇన్​స్టాలో దీపికా పదుకొణె మరో రికార్డు

Last Updated : Jul 8, 2020, 6:56 AM IST

ABOUT THE AUTHOR

...view details