"కథానాయికగా ఉన్నప్పుడు చేయలేకపోయిన పాత్రలన్నీ ఇప్పుడు పోషిస్తున్నా. అందుకే నటిగా ఈ ప్రయాణాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నా" అన్నారు నటి ఆమని. ఇప్పుడామె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'చావు కబురు చల్లగా'. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రమిది. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడు. బన్నీ వాసు నిర్మాత. ఈనెల 19న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే విలేకర్లతో ముచ్చటించారు ఆమని. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
"గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో నేను చేస్తున్న రెండో చిత్రమిది. కార్తికేయ ఇందులో శవాలను తీసుకెళ్లే వ్యాన్ డ్రైవర్‌గా బస్తీ బాలరాజు అనే పాత్రలో కనిపిస్తారు. నేను తన తల్లి పాత్రను పోషించా. ఓ మురికివాడలో నివసించే పేద కుటుంబం మాది. నా నటన, పలికే సంభాషణలు మాస్‌గా ఉంటాయి. నేనెప్పుడూ ఈ తరహా పాత్ర పోషించలేదు. దర్శకుడు కౌశిక్ కథ చెప్పిన వెంటనే చేస్తానని చెప్పేశా. ఈ చిత్రంలో తల్లి కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని దర్శకుడు ఎంతో చక్కగా ఆవిష్కరించారు. నేనిందులో వైజాగ్ యాసలో సంభాషణలు పలకడానికి చాలా కష్టపడ్డా. కొన్ని సీన్లలో నా పాత్రకి చాలా పెద్ద సంభాషణలున్నాయి. అందుకే ఒకరోజు ముందుగానే నా డైలాగ్స్ స్క్రిప్ట్ తీసుకొని.. రాత్రంతా బట్టీపట్టి షూట్‌కి వెళ్లేదాన్ని".
- ఆమని, నటి