పిసినారిగా పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తూనే, విలన్‌గా ముచ్చెమటలు పట్టించిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు. మధ్యతరగతి తండ్రి, అల్లరి తాతయ్య, అవినీతి నాయకుడు, కామెడీ విలన్, నవ్వించే పోలీసు, మాంత్రికుడు ఇలా ఎన్నో పాత్రలను తన నటనతో రక్తికట్టించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఇతర భాషల నుంచి తెలుగు పరిశ్రమకు వచ్చిన వాళ్లే ఎక్కువ, మన నుంచి అక్కడికి వెళ్లిన వారు అరుదు. కోట శ్రీనివాసరావు మాత్రమే ఆ అరుదైన ముద్ర వేశారు. ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావుల శకం ముగిసిన తర్వాత ఆ లోటును కోట శ్రీనివాసరావు భర్తీ చేసిన నటుడనడంలో సందేహం లేదు. అందుకే అలీ నుంచి అమితాబ్ దాకా అందరికీ ఇష్టమైన నటుడయ్యారు. ఈ రోజు కోట పుట్టిన రోజు.. ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన పాత్రలపై ఓ లుక్కేద్దాం.
మినిస్టర్ కాశయ్య(ప్రతిఘటన)
'ప్రతిఘటన' విజయశాంతి, చరణ్‌రాజ్‌లతో పాటు కోట శ్రీనివాసరావు జీవితంలోనూ ప్రత్యేక సినిమాగా నిలిచిపోయింది. 'నమస్తే తమ్మీ...' అంటూ తెలంగాణ యాసతో మినిస్టర్ కాశయ్యగా అదరగొట్టారాయన. సినిమాల్లో తెలంగాణ మాండలికం ప్రాముఖ్యత పెరిగేందుకు దోహదం చేసిందీ పాత్ర. ఆ డైలాగ్స్‌ను పండించేందుకు పట్టుబట్టి మరీ ఆ యాసను నేర్చుకున్నారు. విలన్ కాళీ(చరణ్ రాజ్)కి అండగా నిలబడే అవినీతి మంత్రిగా, కిరాతకుడిగా ఆయన నటనకు విశేష స్పందన వచ్చింది. 'ప్రతిఘటన' ఘనవిజయం సాధించడంలో, కోట కెరీర్‌ను మలుపుతిప్పడంలో మినిస్టర్ కాశయ్య పాత్ర ముఖ్య భూమిక పోషించింది. ఆ తర్వాత ఆయన కెరీర్‌లో ఇలాంటి పాత్రలనేకం చేసి మెప్పించారు.
లక్ష్మీపతి(అహ నా పెళ్లంట)
'ప్రతిఘటన' విడుదలైన ఏడాదిలోనే సూపర్ హిట్టయిన జంధ్యాల చిత్రం 'అహ నా పెళ్లంట'. రాజేంద్రప్రసాద్, రజని హీరోహీరోయిన్లుగా నటించారు. పిసినారి లక్ష్మీపతిగా కోట నటనను ఒక్క మాటలో వర్ణించలేం. అంత అద్భుతంగా నటించారు. నీళ్ల ఖర్చు, సబ్బు ఖర్చు, డబ్బు ఖర్చు తగ్గుతుందని బట్టలకు బదులు న్యూస్ పేపర్లు చుట్టుకోవడం, కోడిని చూరుకు వేలాడదీసి కోడికూర తింటున్నట్టు అనుభూతి చెందడం లాంటి సన్నివేశాలు కడుపుబ్బా నవ్వించాయి. అందుకే అరగుండు(బ్రహ్మానందం)తో కలిసి లక్ష్మీపతి పంచిన వినోదం ఇన్నేళ్లయినా గుర్తుండిపోయింది. ఈ సినిమా హిట్టయ్యాక తెలుగులో బిజీ నటుడు అయిపోయారు. ఇలాంటి పిసినారి పాత్రలనే 'ఆ నలుగురు', 'ఆమె' సినిమాల్లోనూ పోషించారు.
సాంబ శివుడు(గణేష్)
కామెడీ విలన్‌గానే ఎక్కువగా గుర్తుండిపోయే కోట.. గణేశ్ సినిమాలో క్రూరమైన విలన్ పాత్రలో వణుకు పుట్టించారు. ప్రజల రక్తం తాగే ఆరోగ్య మంత్రిగా ఆయన పలికించిన హావభావాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. హీరో ఇంటికొచ్చి ఇచ్చే వార్నింగ్, కిడ్నీ మాఫియాను నడిపించే పలు సన్నివేశాల్లో తానెంతటి నటుడనేది తెలిసిపోతుంది. ఆ సినిమాలో ఆహార్యం కూడా భయంకరంగా ఉంటుంది. గుండుతో, భయంకరమైన కళ్లతో చూస్తేనే వణుకు పుట్టేలా ఉంటుంది. ఆ పాత్రకు నూరుశాతం న్యాయం చేసి సినిమా విజయంలో భాగమయ్యారు.
గురు నారాయణ(గాయం)
'గదైతే నేను ఖండిస్తున్న' అంటూ గురు నారాయణ్ పాత్రతో తెరపై చేసిన సందడి తక్కువేమీ కాదు. జగపతిబాబు హీరోగా ఆర్జీవీ తెరకెక్కించిన క్రైమ్ డ్రామా 'గాయం'. నటుడిగా జగపతిబాబుకి మంచి గుర్తింపు తీసుకొచ్చిన ఈ సినిమాలో కోటశ్రీనివాసరావు గురు నారాయణ్‌గా అదరగొట్టారు. తెలంగాణ యాసను ఒంట బట్టించుకుని ఆయన పలికిన సంభాషణలకు మంచి పేరొచ్చింది. సినిమా ఆద్యంతం కోట విలక్షణమైన నటనతో కట్టిపడేస్తారు. జర్నలిస్ట్‌గా రేవతి అడిగే ప్రశ్నలకు తింగరి సమాధానాలిస్తూ ఆకట్టుకుంటారు. ఇదీ ఆయన కెరీర్‌లో మరిచిపోలేని పాత్రే.
అల్లాదీన్(మనీ)
'భద్రం బీకేర్ ఫుల్ బ్రదరు..భర్తగా మారకు బ్యాచిలరు' అనే పాటతో పెళ్లి వద్దని హితబోధ చేసే అల్లాదీన్‌గా 'మనీ' సినిమాలో ఆకట్టుకుంటారు కోట. ఆర్జీవీ నిర్మించిన ఈ చిత్రంలో బట్లర్ ఇంగ్లీష్‌తో ప్రేక్షకులను మనసారా నవ్వించారు. దీనికి కొనసాగింపుగా వచ్చిన 'మనీ మనీ'లోనూ ఇదే పాత్రతో వచ్చీరాని ఇంగ్లీష్‌తో కామెడీ పండించారు. అందులో పురాణాల మీద, నీతి నిజాయతీల మీద చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి.
పోతురాజు(మామగారు)