తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మాతృభాషాభిమాని.. ఆధునిక రంగస్థల దిక్సూచి 'జేపీ' - జయప్రకాశ్​ రెడ్డి డెత్​ న్యూస్​

సీనియర్​ నటుడు జయప్రకాశ్​ రెడ్డి పుట్టింది కర్నూల్​ జిల్లా అయినప్పటికి తన తండ్రి ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాలు మారడం వల్ల తెలుగులోని అన్ని మాండలికాల్లో పట్టు సాధించారు. తెలుగు భాషను అమితంగా ప్రేమించే మాతృభాషాభిమాని జేపీ. రంగస్థలంపై నటనను ప్రారంభించి చిత్రపరిశ్రమలో మంచి గుర్తింపు లభించినా.. తన తల్లి వంటి నాటక రంగాన్ని ఎప్పటికీ వదిలిపెట్టనని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు జయప్రకాశ్​ రెడ్డి.

Senior Actor Jayaprakash Reddy special Story
మాతృభాషాభిమాని.. ఆధునిక రంగస్థల దిక్సూచి 'జేపీ'

By

Published : Sep 8, 2020, 12:48 PM IST

ప్రతినాయకుడిగా భయపెట్టినా.. హాస్యనటుడిగా నవ్వించినా జయప్రకాశ్​ రెడ్డి మాటల్లో మనదైన మట్టివాసన గుబాళిస్తుంది. తెలుగునాట ఏ యాసనైనా, మరే మాండలికాన్నైనా తన గొంతులో అవలీలగా పలికించగల సామర్థ్యం ఆయన సొంతం. నాటకాల నుంచి ఎదిగివచ్చిన ఆయన.. తన ఆఖరి ప్రయాణం వరకు ఆ రంగస్థలాన్ని మర్చిపోలేదు. ఓ నాటక సమాజాన్ని ఏర్పాటుచేసి మరీ విరివిగా ప్రదర్శనలు ఇచ్చారు. "నేను తెలుగు పిచ్చివాణ్ని'' అని సగర్వంగా జయప్రకాశ్​ రెడ్డి చెప్పుకునే వారు.

అన్ని యాసల్లోనూ పట్టు

తెలుగునాట మూడు ప్రాంతాలతోనూ ఆయనకు అనుబంధం ఉంది. కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం వీరారెడ్డిపల్లె స్వస్థలం. తండ్రి పోలీసు. నెల్లూరు జిల్లాలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగంలో చేరారు. తనకు ఊహ తెలిసినప్పుడు అక్కడే ఉన్నారు. ఓనమాలు అక్కడే దిద్దారు. అప్పుడే నెల్లూరు యాసనూ ఒంటపట్టించుకున్నారు. పాఠశాలలో స్నేహితులూ, ఉపాధ్యాయులతో మాట్లాడటం, వాళ్ల మాటలు వినడం వల్ల ఆ యాస త్వరగా వచ్చింది. జయప్రకాశ్​ రెడ్డికి పరిశీలన, గ్రహణ శక్తులు ఎక్కువ. ఏదైనా ఇలా విన్నారంటే అలా పట్టేస్తారు.

సెలవులు వచ్చాయంటే సొంతూళ్లో అమ్మమ్మ, తాతయ్యల దగ్గరికి వెళ్లేవారు. దాంతో రాయలసీమ యాసా వచ్చేసింది. నిజానికి సీమ భాషలో ఓ లయ ఉంటుంది. 'ఏమ్‌... రా... ఏం చాస్తాండావ్, యాడికిపోతాండావ్‌..' ఇలా మాట్లాడుతుంటే గమ్మత్తయిన రాగం ఉంటుంది. అది అతన్ని బాగా ఆకర్షించింది. పైగా తండ్రి బదిలీలతో అనంతపురం, కర్నూలు, కడప, ప్రొద్దుటూరులలో చదువుకున్నారు. దాంతో ఆ మాండలికం ఇంకా బాగా అలవడింది.

ఉన్నత చదువులకు గుంటూరు ఏసీ కళాశాలకు వెళ్లారు. అక్కడి యాస మీదా పట్టు పెరిగింది. బీఈడీ వరకు అక్కడే చదివారు. కొన్నాళ్లకు తన తండ్రి డీఎస్పీ హోదాలో నల్లగొండకు బదిలీ అయ్యారు. అక్కడే తాతయ్య కోసం పొలం కొని, అందులోనే ఇల్లు కట్టారు. అప్పటికే జయప్రకాశ్​ రెడ్డికి పెళ్లయింది. గుంటూరు పురపాలక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేశారు. తండ్రి కోసం నల్లగొండ వచ్చిపోతుండేవారు.

తరచూ నల్లగొండ రాకపోకలు సాగించినందున... అక్కడ బంధువులూ, స్నేహితులతో మాట్లాడటం వల్ల తెలంగాణ భాష మీదా పట్టు దొరికింది. అలా మూడు ప్రాంతాలతో జయప్రకాశ్​ రెడ్డికి అనుబంధం అంతా ఇంతా కాదు.

అప్పుడే నాటకాల మీద పట్టుదల

అనంతపురం శ్రీసాయిబాబా నేషనల్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్లో చదువుకున్నారు. అక్కడ చదువుతో పాటు కళలకీ, సంస్కృతికీ విలువ ఇచ్చేవారు. తనకు సైన్సు చెప్పే గుండాచారి సాంస్కృతిక కార్యక్రమాలకు ఇన్‌ఛార్జి. నాటకాలు వేయించేవారు. ఒకసారి జయప్రకాశ్​ రెడ్డికి.. తన మిత్రుడికి నాటకం వేయాలనిపించింది. తెలుగు వాచకంలోని 'దుర్యోధన గర్వభంగం' పాఠాన్ని బట్టీ పట్టారు. జయప్రకాశ్​ భీముడు, తన మిత్రుడు దుర్యోధనుడు. గుండాచారి మాస్టారు ముందుకు వెళ్లి, వారు బట్టీ పట్టిన పాఠాన్ని ఎవరి వర్షన్‌లో వాళ్లు అప్పచెప్పారు. అంతా అయ్యాక కిందకీ పైకి చూసి.. 'ఇంకో తూరి నాటకం అని వస్తే కాళ్లు విరక్కొడతా' అన్నారు. దెబ్బకు అక్కడి నుంచి పారిపోయారు. అవమానంగా అనిపించింది. మూడు రోజుల వరకూ ఏడుస్తూనే ఉన్నారు. ఆయన ఎందుకు కాదన్నాడు అనే రోషం పుట్టుకొచ్చింది. ఎలాగైనా నాటకాలు వేయాలని, పదిమంది మెప్పు పొందాలనే పట్టుదల పెరిగింది.

గుంటూరు ఏసీ కళాశాలలో ఉన్నప్పుడు ఓ సీనియర్‌ 'నాటకంలో వేషం ఉంది.. వేస్తావా' అన్నారు. వెంటనే ఒప్పుకొన్నారు జేపీ. ఆడవేషం అన్నారు. అయినా ఒప్పేసుకున్నారు. పాటలూ, ఆటలూ అన్నీ నేర్పించారు. నాటకం పేరు 'స్టేజీ రాచరికం'. రాజూ, రాణీ, సేవకీ, సేవకుడు మాత్రమే పాత్రధారులు. తనది సేవకి పాత్ర. నాటకం అయ్యాక అబ్బాయిలు ఎత్తుకుని ముద్దులు పెట్టేసుకున్నారు. మూడు నాలుగు రోజుల తర్వాత నోటీసు బోర్డు చూసి అవాక్కయ్యారు. యూనివర్సిటీ ప్రకటించిన బహుమతుల్లో 'ఉత్తమ నటి జయప్రకాశ్​ రెడ్డి' అని రాసి ఉంది. ఆ రోజు తన ఆనందం అంతా ఇంతా కాదు.

అప్పటి నుంచి నాటకాలు వేయడం, వేయించడమే పని. కాలేజీలో ఏదైనా కార్యక్రమం ఉందంటే చాలు.. సాంస్కృతిక కార్యక్రమాల బాధ్యత జేపీకి అప్పగించేవారు. మూడేళ్లలో కాలేజీ స్టార్‌ అయ్యారు. నాటకాల్లో హాస్యపాత్రలు ఎక్కువగా చేసేవారు. రమణారెడ్డిలా పొడవుగా సన్నగా ఉండటం వల్ల హాస్యం బాగా పండేది. తన నాటకాల్లో అన్ని రకాల యాసల్నీ చొప్పించేవారు. ఉద్యోగంలో చేరాక కూడా నాటకాలను వదులుకోలేదు. ఉన్నతాధికారులూ బాగా ప్రోత్సహించేవారు. పలు పరిషత్తులూ, సమాజాలతో కలిసి పనిచేశారు. సినిమాల్లో అవకాశాలు వచ్చినా వాటిని వదల్లేదు. తానే ''జేపీ'స్‌ నెలనెలా నాటక సభ' పేరిట ఓ సమాజాన్ని స్థాపించారు.

అలా చిత్రపరిశ్రమకు పరిచయం

అప్పట్లో జయప్రకాశ్​ రెడ్డి నాటకాలకు ఆదరణ ఎక్కువ ఉండేది. ఎక్కడెక్కడికో వెళ్లి ప్రదర్శినలు ఇచ్చేవారు. స్థానిక ఉన్నతాధికారులూ, రాజకీయ నాయకులూ వచ్చి చూసేవారు. ఓసారి నల్లగొండలో దివాకర్‌బాబు రాసిన 'గప్‌చుప్‌' నాటక ప్రదర్శనకు దాసరి నారాయణరావు ముఖ్య అతిథి. ఆయన వచ్చారు కానీ, పని ఒత్తిడితో ప్రదర్శన ప్రారంభం కాకముందే వెళ్లిపోబోయారు. 'నాటకాల నుంచి వచ్చిన మీరు ఈ నాటకం చూడకుండా వెళ్తారని అనుకోవట్లేదు' అని జయప్రకాశ్​ రెడ్డి అనగానే దాసరి ఆగిపోయారు. 'భలేగా ముందరకాళ్లకు బంధం వేశావయ్యా' అంటూ కూర్చున్నారు దాసరి. నాటకం మొత్తం చూసి వారి బృందాన్ని అభినందించారు. అంతేకాదు.. జేపీని రామానాయుడిగారికి పరిచయం చేశారు.

హైదరాబాద్​లో నాయుడు గారు, వాళ్ల కుటుంబసభ్యుల ముందు నాటకాన్ని ప్రదర్శించారు. అలా 'బ్రహ్మపుత్రుడు' చిత్రంలో అవకాశం వచ్చింది. తర్వాత కొన్ని అవకాశాలు వచ్చినా, ఆదాయం తక్కువ. అప్పులు పెరిగాయి. అలానే తొమ్మిదేళ్లు గడిచిపోయాయి. ఇలాగైతే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వలేనని మళ్లీ వచ్చి, ఉపాధ్యాయుడిగా జీవితం మొదలుపెట్టారు. ఉదయం ఆరింటి నుంచి ట్యూషన్లు చెప్పడం, బడికి వెళ్లడం, మళ్లీ రాత్రి తొమ్మిదింటి వరకూ ట్యూషన్లు... ఇలా మూడేళ్లు చేయడం వల్ల కొంతవరకూ అప్పులు తీరాయి. ఆ తర్వాత అనుకోకుండా ఓసారి హైదరాబాద్​ వచ్చినప్పుడు రామానాయుడు కలిశారు. అప్పుడే 'ప్రేమించుకుందాం రా' చిత్రంలో ప్రతినాయకుడి పాత్రకు ఎంపికయ్యారు జేపీ. తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ప్రతినాయక పాత్రలో ఎక్కడా నవ్వు ఉండకూడదు. సినిమా ఆసాంతం గంభీరంగా ఉండాలి. ఆ పాత్రకు తగ్గట్టు రాయలసీమ యాస మాట్లాడిస్తే బాగుంటుందని జయప్రకాశ్​ రెడ్డికి అనిపించి పరుచూరి సోదరులకు చెప్పారు. వాళ్లు పెడతాం అన్నారు. దాంతో కాస్త సమయం తీసుకుని కర్నూలు, నంద్యాల వైపు వెళ్లారు. ఓ టేపురికార్డరు జేబులో పెట్టుకుని అక్కడ తిరిగేవారు. టీకొట్టు, ఎరువుల దుకాణం, బస్టాండ్‌... ఇలా వివిధ ప్రాంతాల్లో, సందర్భాల్లో వాళ్లంతా ఎలా మాట్లాడుతున్నారో.. నోట్స్‌ రాసుకున్నారు. అలా రాసుకున్నదంతా పరుచూరి సోదరులకు చూపించారు.

అప్పట్లో వాళ్లు తీరిక లేకుండా ఉన్నారు. కానీ తన కోరిక మేరకు ముందురోజు సాయంత్రం సంభాషణలు రాసిచ్చేవారు. రాత్రంతా కూర్చుని వాటిని సీమ భాషలోకి మార్చుకుని సాధన చేసేవారు. అందుకే ఆ పాత్రకు అంత పేరు వచ్చిందన్నారు జయప్రకాశ్​ రెడ్డి. తనకు భాష మీద ఉన్న పట్టు, ఇష్టం వల్ల... కొత్త పదాలు తెలిస్తే రాసుకునే వారు. మంచి కవితలు, సామెతలు ఎక్కడ కనిపించినా ఓ దగ్గర పెట్టుకునేవారు నాటకాల్లో కొత్తమాటలూ, కొత్త పదాలు పడేలా చూసుకుంటారు. ఖాళీ సమయం దొరికితే చాలు తెల్ల కాగితాలు ముందేసుకుని రాసుకోవడం తనకు అలవాటు. పుస్తకాలే అతని నేస్తాలు.

మాతృభాషాభిమాని

జయప్రకాశ్​ రెడ్డికి... తెలుగు అంటే పిచ్చి. ఈ పుస్తకం, ఆ పుస్తకం అని ఉండదు. అన్నీ చదివేస్తారు. సమయం దొరికితే పద ప్రహేళికలు నింపుతుంటారు. పాలగుమ్మి పద్మరాజు రచనలు హృదయానికి హత్తుకున్నాయంటారు జేపీ. దర్శకుడు వంశీ రచనలు, శైలి ఇష్టం. 'మా పసలపూడి కథలు' పుస్తకం నచ్చుతుంది. అందులో గోదావరి గురించిన వర్ణణలో... ఆ గోదావరి పరవళ్ల దగ్గరకు తాను వెళ్లిపోయినట్టు అనిపిస్తుందన్నది జేపీ భావన. డాక్టర్‌ నక్కా విజయరామరాజు 'భట్టిప్రోలు కథలు' అభిమానించారు.

ఇప్పటి వరకూ రకరకాల నాటకాలూ, వేషాలూ వేశారు. వేలల్లోనే ప్రదర్శనలు ఇచ్చారు. సినిమా రంగం అన్నం పెట్టింది. దాన్ని గౌరవిస్తూనే... నాటకాలు వేయడం తన అభిరుచి. వాటిలో ఎప్పటికప్పుడు కొత్తదనం ఉండాలని కోరుకునే వారు. ఈ విషయంలో చివరి వరకు నిత్య విద్యార్థిగానే మెలిగారు జేపీ. రంగస్థలాన్ని కాపాడుకోవాలన్న తాపత్రయంతోనే నాటకాలు వేశారు. దానివల్ల తనకు ఆదాయం ఉండదు. కానీ, నాటకాలను ప్రజలకు మళ్లీ దగ్గర చేయాలని... వీలైనన్ని ప్రాంతాల్లో ప్రదర్శించాలని అభిలషించారు.

ఓ ఉపాధ్యాయుడిగా ఇప్పటి విద్యావిధానంపై జయప్రకాశ్​ రెడ్డి ఎంతో ఆవేదన చెందారు. అప్పట్లో విద్యార్ధినులకు ఆత్మవిశ్వాస పాఠాలు చెప్పేవాళ్లమని... ఇప్పుడు కొంతమంది గురువులే కామాంధులుగా ప్రవర్తిస్తున్నారని.. చాలా విలువలు కోల్పోయామని చాలా సందర్భాల్లో అన్నారు. విద్యార్థులూ జీవం లేకుండా తయారవుతున్నారని.. చాలా కృత్రిమంగా నేర్చుకుంటున్నారని చెప్పారు. చదువు అంటేనే ర్యాంకుల జపంగా మారిందని ఆందోళన చెందేవారు. ప్రాక్టికల్‌గా చదువులు చెప్పే సంస్కృతి ఎప్పుడో పోయిందని ఆయన కలవరం చెందాతారు. ఇతర భాషలు నేర్చుకోవడం మంచిదే కాని, తప్పనప్పుడు పరాయి భాష మాట్లాడటంలోనూ తప్పులేదని. మనం మన భాష తప్ప అన్నీ మాట్లాడుతున్నామని మదనపడేవారు.

అమెరికాలోని యూనివర్సల్‌ స్టూడియోకు వెళ్తే, అక్కడ గుజరాతీ వాళ్లు తమ భాషలోనే మాట్లాడుకుంటూ ఉంటారు. పంజాబీలు, మలయాళీలూ అంతే! తెలుగువాళ్లు మాత్రం ఆంగ్లంలో మాట్లాడుతూ కనిపిస్తుంటారని.. కనీసం కుటుంబసభ్యులతోనైనా తెలుగులో మాట్లాడమని.. పిల్లలకు మన భాష నేర్పించండని తాను ఎక్కడికి వెళ్లినా చెప్పేవారు. జయప్రకాష్‌రెడ్డిలో విలక్షణ నటనతో పాటు మాతృభాషాభిమానీ ఆయనలో ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details