తండ్రి చాటు తనయుడిగానే పరిశ్రమకు పరిచయమైన హీరో రామ్‌చరణ్ తేజ్. మెగా వారసుడిగా భారీ అంచనాల మధ్య సినీ రంగ ప్రవేశం చేశాడు. చిరంజీవిలా డ్యాన్స్ చేయగలడా? ఆయనలా నటించగలడా? ఆ గ్రేస్ ఉందా? అని మొదటి సినిమాతోనే పోల్చి చూడటం మొదలు పెట్టినా... మోయలేనంత అంచనాల భారం తనపై ఉన్నా... తొలి చిత్రం 'చిరుత'తో ప్రేక్షకుల్ని మెప్పించాడు. డ్యాన్స్, నటన, ఈజ్‌లో తన ప్రతిభను ప్రదర్శించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.
'చిరుత'తో
అగ్రహీరో చిరంజీవి, సురేఖ దంపతులకు 1985 మార్చి 27న జన్మించాడు చరణ్. చిన్నప్పట్నుంచే తండ్రి సినిమాల్ని చూస్తూ డ్యాన్స్‌పై మక్కువ పెంచుకున్నాడు. డిగ్రీ పూర్తయ్యాక 2007లో 'చిరుత'తో వెండితెరకు పరిచయమయ్యాడు. తొలి సినిమాలోనే చక్కటి పరిణతిని ప్రదర్శించిన రామ్‌చరణ్ 'ఉత్తమ నూతన నటుడి'గా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు. నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అతడ్ని వరించింది.
'ఆర్.ఆర్.ఆర్' లో అల్లూరిలా
ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరిగా రామ్‌చరణ్ కొనసాగుతున్నాడు. పుష్కరకాలంగా హీరోగా ప్రయాణం చేస్తున్న ఇతడు.. ప్రస్తుతం 14వ చిత్రం 'ఆర్.ఆర్.ఆర్' చేస్తున్నాడు. 'మగధీర' తరువాత రామ్‌చరణ్- రాజమౌళి కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఆ పాత్ర కోసం మీసం మెలేశాడు.
రెండో చిత్రంతోనే రికార్డుల వేట
ఆ తరువాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో 'మగధీర' చేశాడు. ఆ చిత్రంతో చరణ్ పేరు ఇతర భాషల్లోనూ మార్మోగిపోయింది. ఆ ఏడాది ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డుతో పాటు.. నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నాడు. ఈ చిత్రంతో బలమైన మాస్ కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
'ఆరెంజ్' విఫలమైనా.. 'రచ్చ'తో మళ్లీ
2010లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'ఆరెంజ్' చేశాడు. ఆ చిత్రం పరాజయం పాలైనప్పటికీ, చరణ్ నటనకు మాత్రం విమర్శకుల ప్రశంసలు లభించాయి. 2011లో సంపత్ నంది దర్శకత్వంలో 'రచ్చ' చేశాడు. భారీ ఓపెనింగ్స్‌ను సాధించిన ఈ చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. 2013లో వి.వి వినాయక్ దర్శకత్వంలో 'నాయక్', వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అల్లు అర్జున్‌తో కలిసి 'ఎవడు' సినిమాల్లో నటించాడు. ఆ తరువాత 'జంజీర్'తో హిందీకి పరిచయమయ్యాడు. తెలుగులోనూ ఆ చిత్రం 'తుఫాన్'’ పేరుతో విడుదలైనా... పెద్దగా ప్రేక్షకాదరణ దక్కించుకోలేకపోయింది.