బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతిపై బిహార్‌లో నమోదైన కేసు చట్టబద్ధమైనదని బుధవారం స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఈ కేసు విచారణకు సంబంధించి ఇప్పటివరకు సేకరించిన అన్ని ఆధారాలను సీబీఐ బృందానికి అప్పగించాలని ముంబయి పోలీసులకు సూచించింది.
సుశాంత్ రాజ్‌పుత్ మృతిపై దాఖలైన కేసును పట్నా నుంచి ముంబయికి బదిలీ చేయాలని కోరుతూ.. నటి రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం ఈ విధంగా తీర్పునిచ్చింది. ఈ కేసును బిహార్ ప్రభుత్వం సీబీఐకి బదిలీ చేయడాన్ని సమర్థించింది అత్యున్నత న్యాయస్థానం.
సుప్రీంకోర్టు తీర్పు:
- పట్నాలో సుశాంత్ మృతిపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ చట్టబద్ధమైనది. ఈ ఉత్తర్వులను సవాలు చేసే అవకాశం మహారాష్ట్ర ప్రభుత్వానికి లేదు.
- పట్నాలో నమోదైన కేసు మాత్రమే కాకుండా.. సుశాంత్ కేసుకు సంబంధించిన మరే ఇతర ఎఫ్ఐఆర్లు నమోదైనా సీబీఐ మాత్రమే దర్యాప్తు చేస్తుంది.
- సుశాంత్ మరణం వెనకున్న రహస్యాన్ని దర్యాప్తు చేసే ఏకైక అధికారం సీబీఐకి ఉంది. ఇందులో ఇతర రాష్ట్రాల పోలీసులు జోక్యం చేసుకోలేరు.
- సెక్షన్ 174 సీఆర్పీసీ ప్రకారం దర్యాప్తు చేస్తున్న ముంబయి పోలీసుల పరిధి పరిమితం. సుశాంత్ మరణాన్ని ప్రమాదవశాత్తు జరిగినట్లు ముంబయి పోలీసులు నమోదు చేసినందున, దీనికి పరిమిత దర్యాప్తు అధికారాలు మాత్రమే ఉన్నాయి.
తీర్పుపై స్పందన
సుశాంత్‌సింగ్ కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పుపై.. నటి అంకితా లోఖండే, సుశాంత్ తండ్రి తరపు న్యాయవాది వికాస్ సింగ్, హీరో సోదరి శ్వేతా సింగ్‌తో సహా పలువురు హర్షం వ్యక్తం చేశారు.
"ఇది సుశాంత్ కుటుంబం సాధించిన విజయం. సుప్రీంకోర్టు ప్రతి పాయింట్ మా వాదనలకు మరింత బలం చేకూర్చింది. పట్నాలో నమోదైన కేసు చట్టబద్ధమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ కేసుకు సంబంధించి నమోదైన ఇతర ఎఫ్ఐఆర్లను కూడా సీబీఐ దర్యాప్తు చేస్తుందని సుప్రీం స్పష్టం చేసింది. మాకు తగిన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఈ తీర్పుతో సుశాంత్ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంది".